
సూర్యకుమార్ సేనపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే (Ryan ten Doeschate) ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా తమ జట్టు సంయమనంతో వ్యవహరించిన తీరు గర్వకారణం అన్నాడు. పాక్ ఆటగాళ్ల కవ్వింపు చర్యలకు తమ ప్లేయర్లు బ్యాట్‌తో సమాధానమిచ్చిన విధానం అమోఘమని కొనియాడాడు.
ఆసియా కప్ టీ20- 2025 టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) ఇప్పటికి రెండుసార్లు తలపడ్డాయి. లీగ్ దశలో పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఆ జట్టుతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది.
తీవ్రస్థాయిలో కవ్వింపులు
ఇక సూపర్-4 మ్యాచ్‌లోనూ భారత జట్టు మరోసారి పాక్‌పై పైచేయి సాధించింది. ప్రత్యర్థిని ఆరు వికెట్ల తేడాతో ఓడించి.. వరుసగా రెండో గెలుపు అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో కవ్వింపులకు పాల్పడ్డారు.
ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58) పూర్తి చేసుకోగానే ఏకే-47 మాదిరి బ్యాట్ ఎక్కుపెట్టి కాల్పులు జరుపుతున్నట్లు సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలు పొట్టనబెట్టుకున్న విషయం విదితమే.
బ్యాట్‌తోనే సమాధానమిచ్చారు
దీంతో ఫర్హాన్ సెలబ్రేషన్స్ పాక్ బుద్ధిని చూపిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నపుడు పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్ భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ- శుబ్‌మన్ గిల్ (Shubman Gill)లతో మాటల యుద్ధానికి దిగారు.
అయితే, ఈ యువ ఆటగాళ్లకు పాక్ ఆటగాళ్లకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చారు. అభి- గిల్ కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పాక్‌కు తమ స్థాయి ఏమిటో చూపించారు. ఈ పరిణామాలపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ డష్కాటే స్పందించాడు.
వాళ్ల చేష్టలు పట్టించుకోము
‘‘హ్యారిస్ రవూఫ్ ఏం చేశాడో నేను కూడా చూశాను. అయితే, మా వాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆట మీద మాత్రమే దృష్టి పెటారు. అందుకు నాకు గర్వంగా ఉంది.
బ్యాట్‌తోనే క్రీడా యుద్ధంలో మా వాళ్లు గెలిచారు. ఈ టోర్నీలో మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. సంయమనంగా ఉంటున్నారు. మాతో మ్యాచ్‌లో పాక్ తొలుత బాగానే బ్యాటింగ్ చేసింది. అప్పుడే అతడు (ఫర్హాన్) అలా చేశాడు.
అయితే, మేము తిరిగి పుంజుకున్న తీరు గొప్పగా ఉంది. 10 ఓవర్ల తర్వాత మా బౌలర్లు మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకున్నారు. కానీ పాక్ ఆటగాళ్ల ప్రవర్తన ఎలా ఉందో అందరం చూశాం.
గర్వకారణం
వాళ్లు ఏదో చెప్పాలని ప్రయత్నించారు. అయితే, మా వాళ్లు కేవలం ఆటకే పరిమితమై తమ పని పూర్తి చేశారు. నిజానికి ఈ మ్యాచ్‌లో మా ఆటగాళ్లపై కూడా ఒత్తిడి ఉంది. కానీ వాళ్లు ఎప్పుడూ కట్టు దాటలేదు.
ఇలాంటి మ్యాచ్‌లలో నియంత్రణ కోల్పోవడం సహజం. మా వాళ్లు మాత్రం అలా చేయలేదు. వాళ్ల సెలబ్రేషన్స్, మా బ్యాటర్లతో పాక్ బౌలింగ్ విభాగం వాగ్వాదాలు దృష్టి మళ్లించేవే. అయితే, ముందుగా చెప్పినట్లు మా జట్టు వేటినీ పట్టించుకోకుండా.. అత్యుత్తమ ప్రదర్శనతో గెలిచిన తీరు మాకు ఆనందదాయకం’’ అని డష్కాటే హర్షం వ్యక్తం చేశాడు.