
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా వైదొలగడం క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. చాన్నాళ్లుగా టెస్టుల్లో పునరాగమనం కోసం వేచి చూస్తున్న ఈ ముంబైకర్‌కు ‘ఎ’ జట్టు సారథిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సువర్ణావకాశం ఇచ్చింది.
ఆస్ట్రేలియా- ‘ఎ’తో అనధికారిక టెస్టులు
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 (WTC)లో భాగంగా టీమిండియా.. అక్టోబరులో స్వదేశంలో వెస్టిండీస్ (IND vs WI)తో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, విండీస్‌తో సిరీస్‌కు ముందు భారత్- ‘ఎ’- ఆస్ట్రేలియా- ‘ఎ’ మధ్య రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లకు షెడ్యూల్ ఖరారైంది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుంది.
ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌ను చేసిన బీసీసీఐ.. ధ్రువ్ జురెల్ (Dhruv Jurel), సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి యువ టీమిండియా స్టార్లను కూడా ఎంపిక చేసింది. ఇక రెండో టెస్టులో భాగంగా టీమిండియా సీనియర్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ కూడా భారత్-‘ఎ’ జట్టులో చేరారు.
కెప్టెన్సీతో పాటు జట్టు నుంచీ తప్పుకొన్నాడు
అయితే, తొలి టెస్టులో విఫలమైన శ్రేయస్ అయ్యర్(8).. రెండో టెస్టు ఆరంభానికి కొన్ని గంటల ముందే కెప్టెన్సీతో పాటు జట్టు నుంచీ వైదొలిగాడు. ఈ క్రమంలో అతడు బీసీసీఐకి ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం..
‘‘శ్రేయస్ అయ్యర్ రెడ్ బాల్ క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని భావించాడు. ఇదే విషయాన్ని సెలక్టర్లకు చెప్పాడు. రానున్న కొన్ని నెలల పాటు అతడు టెస్టు ఫార్మాట్‌కు దూరంగా ఉండబోతున్నాడు.
కారణం ఇదే
వెన్నునొప్పి కారణంగా తన శరీరం నాలుగు కంటే ఎక్కువ రోజులు ఫీల్డింగ్ చేసేందుకు సిద్ధంగా లేదని చెప్పాడు. అందుకే ఇప్పట్లో టెస్టు క్రికెట్‌ను పూర్తి స్థాయిలో ఆడలేనని స్పష్టం చేశాడు. కాబట్టి సెలక్టర్లు ఇందుకు తగినట్లుగానే అతడి విషయంలో నిర్ణయం తీసుకుంటారు’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
గతంలో బీసీసీఐ వేటు
ఫలితంగా వెస్టిండీస్‌తో సిరీస్‌కు కూడా శ్రేయస్ అయ్యర్ దూరమైనట్లు తెలుస్తోంది. కాగా గతేడాది కూడా శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు దూరం కాగా... బీసీసీఐ అతడిపై వేటు వేసింది.
ఫిట్‌గానే ఉన్నా అబద్దం చెప్పాడని.. దేశీ క్రికెట్ తప్పనసరిగా ఆడాలన్న నిబంధనను ఉల్లంఘించాడని పేర్కొంటూ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకున్న శ్రేయస్ అయ్యర్ దేశీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టాడు.
అనూహ్య రీతిలో పుంజుకుని
ముఖ్యంగా కెప్టెన్‌గా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన అయ్యర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. బ్యాటర్‌గానూ పొట్టి ఫార్మాట్లో ఇరగదీశాడు.
ఐసీసీ చాంపియన్స్‌ట్రోఫీ-2025 (వన్డే)లోనూ టీమిండియా తరఫున సత్తా చాటి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, ఆసియా కప్ టీ20- 2025 టోర్నీకి మాత్రం సెలక్టర్లు అయ్యర్‌ను ఎంపిక చేయలేదు.
భవిష్యత్తు ప్రశ్నార్థకం
దీంతో బోర్డు తీరుపై విమర్శలు రాగా.. భారత్ -‘ఎ’ కెప్టెన్‌గా ఛాన్స్ ఇచ్చింది. కానీ శ్రేయస్ అయ్యర్ తనకు తానుగా తప్పుకొని మరోసారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకున్నాడు. కాగా అయ్యర్ గత ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా చివరి టెస్టు ఆడాడు.
చదవండి: ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్.. చెలరేగిన టీమిండియా యువ ప్లేయర్