
భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ (India A vs Australia A) జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇవాళ (సెప్టెంబర్ 23) నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు భారత-ఏ కెప్టెన్సీ నుంచి శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తప్పుకున్నాడు.
ఆటగాడిగానూ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో భారత మేనేజ్‌మెంట్ వికెట్‌కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్‌ను (Dhruv Jurel) కెప్టెన్‌గా నియమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జురెల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
రాణించిన మెక్‌స్వీనీ, జాక్ ఎడ్వర్డ్స్
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (74), జాక్ ఎడ్వర్డ్స్ (88) అర్ద సెంచరీలతో రాణించారు.
స్టార్ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (49) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. వికెట్‌కీపర్ జోష్ ఫిలిప్ (39) పర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సమయానికి టాడ్ మర్ఫీ (29), హెన్రీ థార్న్టన్ (10) క్రీజ్‌లో ఉన్నారు.
ఐదేసిన యువ స్పిన్నర్
భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (Manav Suthar) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 28 ఓవర్లలో 93 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సుతార్‌తో పాటు గుర్నూర్ బ్రార్ (13-0-71-2), ప్రసిద్ద్ కృష్ణ (13-3-63-1), మొహమ్మద్ సిరాజ్ (13-1-73-1) వికెట్లు తీశారు.
నితీశ్ కుమార్ రెడ్డి, ఆయుశ్ బదోనికి వికెట్లు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి భారత్-ఏ తరఫున బరిలోకి దిగారు.
చదవండి: దిగ్గజ క్రికెట్ అంపైర్ హెరాల్డ్ డికీ బర్డ్ కన్నుమూత