
దిగ్గజ క్రికెట్ అంపైర్ హెరాల్డ్ డికీ బర్డ్ (Harold Dickie Bird, 92) వయోభారంతో కన్నుమూశారు. మంగళవారం లండన్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (Yorkshire County Cricket Club) అధికారికంగా ప్రకటించింది. డికీ బర్డ్ 2014లో యార్క్‌షైర్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆటగాడిగా యార్క్‌షైర్, లీసెస్టర్‌షైర్ కౌంటీలకు ప్రాతినిథ్యం వహించినా, అంతర్జాతీయ అంపైర్‌గానే మంచి గుర్తింపు పొందారు.
డికీ బర్డ్ తన కెరీర్‌లో 66 టెస్టులు, 69 వన్డేలు, 3 వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అంపైర్‌గా వ్యవహరించారు. డికీ బర్డ్ క్రికెట్ అంపైరింగ్‌కు కొత్త నిర్వచనం చెప్పారు. అతని అంపైరింగ్ హాస్యం, స్టయిల్‌తో వైవిధ్యంగా ఉండేది.
క్రికెట్‌కు న్యాయం చేసిన అంపైర్
హెరాల్డ్ డెనిస్ "డికీ" బర్డ్ 1933 ఏప్రిల్ 19న యార్క్‌షైర్‌లో జన్మించాడు. చిన్నతనం నుంచే క్రికెట్‌పై మోజు పెంచుకున్న అతను.. స్థానిక యార్క్‌షైర్ జట్టు తరఫున జెఫ్రీ బాయ్‌కాట్, మైఖేల్ పార్కిన్సన్ వంటి దిగ్గజాలతో కలిసి ఆడాడు.
ఆటగాడిగా ప్రయాణం
1956 నుంచి 1964 వరకు Yorkshire, Leicestershire తరఫున 93 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 3,314 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యుత్తమ స్కోర్ 181 నాటౌట్. ఈ స్కోర్‌ను గ్లామోర్గన్‌పై సాధించాడు. ఆ సీజన్‌లో (1959) యార్క్‌షైర్ టైటిల్ గెలిచింది.
యుక్త వయసులోనే అంపైరింగ్ వైపు..!
డికీ బర్డ్ 32 ఏళ్ల యుక్త వయసులో ఆటను వీడి, తొలుత కోచింగ్‌వైపు వెళ్లాడు. ఆతర్వాత 1973లో ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ ద్వారా అంపైర్‌గా అరంగేట్రం చేశాడు. 20 ఏళ్ల తర్వాత అతను ఇంగ్లండ్ వెలుపల అంపైర్‌గా (1992లో Zimbabwe vs India) నిలిచాడు. 1995లో ఓల్డ్ ట్రాఫర్డ్‌లో అధిక సూర్యరశ్మి కారణంగా ఆట నిలిపిన సంఘటన అతని వైవిధ్య శైలికి ఉదాహరణ.
రచయిత కూడా..!
క్రికెటర్‌గా, కోచ్‌గా, అంపైర్‌గా రాణించిన డికీ బర్డ్‌లో మరో కోణం కూడా ఉంది. అతనిలో ఓ గొప్ప రచయిత ఉన్నాడు. అతని “My Autobiography” యూకేలో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.
యార్క్‌షైర్‌లో విగ్రహం
ఇంగ్లండ్ క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తుగా MBE (Member of the Order of the British Empire) పురస్కారం అందుకున్నాడు. ప్రత్యేకించి యార్క్‌షైర్ కౌంటీకి అతను చేసిన సేవలకు గుర్తుగా యార్క్‌షైర్‌లో డికీ బర్డ్ విగ్రహం ఏర్పాటు చేయబడింది.