ఈ ఏడాది క్రికెట్‌లో బద్దలైన భారీ ప్రపంచ రికార్డులు ఇవే..! | world records shattered in cricket this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది క్రికెట్‌లో బద్దలైన భారీ ప్రపంచ రికార్డులు ఇవే..!

Dec 22 2025 7:42 PM | Updated on Dec 22 2025 8:06 PM

world records shattered in cricket this year

అంతర్జాతీయ క్రికెట్లో 2025 సంవత్సరం చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. ఈ ఏడాది చాలా ప్రపంచ రికార్డులు చేతులు మారాయి. దిగ్గజాలు తమ వారసత్వాన్ని మరింత బలపరుచుకోగా, కొత్త తరం ఆటగాళ్లు సరికొత్త రికార్డులు నెలకొల్పారు. 

పురుషుల క్రికెట్‌లో విరాట్‌ కోహ్లి, జో రూట్‌.. మహిళల క్రికెట్‌లో స్మృతి మంధన లాంటి వారు వేర్వేరు విభాగాల్లో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారు. జట్ల పరంగా పురుషుల క్రికెట్‌లో ఇంగ్లండ్‌ జట్టు.. మహిళల క్రికెట్‌లో టీమిండియా సరికొత్త వరల్డ్‌ రికార్డ్స్‌ నెలకొల్పాయి. 

తిలక్‌ వర్మ 318 నాటౌట్‌
ఈ ఏడాది టీమిండియా ఆటగాడే ప్రపంచ రికార్డుల బోణీ కొట్టాడు. జనవరిలో భారత యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ అంతర్జాతీయ టీ20ల్లో ఔట్‌ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తిలక్‌ టీ20ల్లో ఔట్‌ కాకుండా 318 పరుగులు (19*, 120*, 107*, 72*) చేసి విరాట్‌ కోహ్లి పేరిట ఉండిన రికార్డును తన పేరిట బదిలీ చేసుకున్నాడు.  

విరాట్‌ కోహ్లి @ ఫాస్టెస్ట్‌ 14000 రన్స్‌
ఈ ఏడాది ఫిబ్రవరిలో (ఛాంపియన్స్‌ ట్రోఫీ) విరాట్‌ కోహ్లి ఓ భారీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. పురుషుల వన్డేల్లో అత్యంత వేగంగా 14000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. సచిన్‌ ఈ మైలురాయిని 350 ఇన్నింగ్స్‌ల్లో చేరుకుంటే, కోహ్లి కేవలం 287 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.

సింగిల్‌ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు
ఇదే ఏడాది విరాట్‌ మరో భారీ ప్రపంచ రికార్డును కూడా సాధించాడు. ఓ సింగిల్‌ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్‌ టెస్ట్‌ల్లో 51 సెంచరీలు చేయగా.. విరాట్‌ ఖాతాలో ప్రస్తుతం 53 వన్డే శతకాలు ఉన్నాయి. 

అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక స్కోర్‌
సౌతాఫ్రికా ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా డెస్మండ్‌ హేన్స్‌ రికార్డును బద్దలు కొట్టాడు. హేన్స్‌ 1978లో తన వన్డే అరంగేట్రంలో 148 పరుగులు చేయగా.. బ్రీట్జ్కే 150 పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

రోహిత్‌ శర్మ.. క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు
ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్స్‌కు చేర్చడంతో  రోహిత్‌ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నాలుగు మేజర్‌ ఐసీసీ టోర్నీల్లో ఓ జట్టును ఫైనల్స్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. రోహిత్‌ టీమిండియాను వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌, వన్డే, టీ20 వరల్డ్‌కప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీల ఫైనల్స్‌కు చేర్చాడు. వీటిలో డబ్ల్యూటీసీ మినహా అన్ని టైటిళ్లు కైవసం చేసుకున్నాడు.

అనామక బ్యాటర్‌ ఖాతాలో ప్రపంచ రికార్డు
ఆస్ట్రియాకు చెందిన అనామక బ్యాటర్‌ కరణ్‌బీర్‌ సింగ్‌ ఖాతాలో ఓ భారీ ప్రపంచ రికార్డు చేరింది. అంతర్జాతీయ టీ20ల్లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు (1488) చేసిన బ్యాటర్‌గా కరణ్‌బీర్‌ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఓ ఓవర్‌లో ఏకంగా 39 పరుగులు
సమోవా జట్టు ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులు (39) సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. సమోవాకు చెందిన డారియస్‌ విస్సర్‌ ఓ ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టి 36 పరుగులు పిండుకోగా.. 3 పరుగులు నో బాల్స్‌ రూపంలో వచ్చాయి.

రూట్‌ @ 213
టెస్ట్‌ క్రికెట్‌లో బ్యాటింగ్‌కు సంబంధించి వరుసగా రికార్డును బద్దలు కొడుతున్న ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌.. ఈ ఏడాది ఫీల్డింగ్‌లో ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. రూట్‌ టెస్ట్‌ అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా (213) రాహుల్‌ ద్రవిడ్‌ (210) రికార్డును బ్రేక్‌ చేశాడు.  

చరిత్ర సృష్టించిన స్టార్క్‌
ఆసీస్‌ స్పీడ్‌ గన్‌ మిచెల్‌ స్టార్క్‌ టెస్ట్‌ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో స్టార్క్‌ (420) పాకిస్తాన్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ (414) పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

వన్డేల్లో అతి భారీ విజయం
ఇంగ్లండ్‌ పురుషుల క్రికెట్‌ జట్టు వన్డేల్లో అతి భారీ విజయాన్ని నమోదు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ జట్టు సౌతాఫ్రికాపై  342 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వన్డే క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇదే భారీ విజయం. గతంలో ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. 2023 జనవరిలో భారత్‌ శ్రీలంకపై 317 పరుగుల తేడాతో గెలుపొందింది.

మంధన ఖాతాలో భారీ రికార్డు
భారత మహిళా జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధన ఖాతాలో ఓ భారీ ప్రపంచ రికార్డు చేరింది. మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా వెస్టిండీస్‌ ప్లేయర్‌ స్టెఫానీ టేలర్‌ రికార్డును బద్దలు కొట్టింది. టేలర్‌ 5000 పరుగులు పూర్తి చేసేందుకు 129 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. మంధన కేవలం 112 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని తాకింది.

టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డు
మహిళల వన్డే క్రికెట్‌లో టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ ఫార్మాట్‌ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆసీస్‌ పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌ ఆసీస్‌పై ఈ భారీ రికార్డు సాధించింది. 

ఆసీస్‌ నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించి, సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్‌.. ఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement