అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత యువ జట్టు ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. టోర్నీ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. తుది పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో విఫలమైన ఆయూష్ మాత్రే అండ్ కో.. ఏకంగా 191 పరుగుల తేడాతో ఘోర పరాభావన్ని మూటకట్టుకుంది.
దాయాది చేతిలో ఓటమి పాలవ్వడాన్ని భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఈ ఘోర ఓటమిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా సీరియస్ అయింది. ఈ ఓటమిపై సమీక్ష నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ 22న వర్చవల్‌గా జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
జట్టు హెడ్ కోచ్ హృషికేష్ కనిత్కర్, కెప్టెన్ ఆయుష్ మాత్రే, టీమ్ మేనేజర్ నుండి బోర్డు వివరణ కోరనున్నట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని బోర్డు తప్పుబడుతోంది. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్ల ప్రవర్తనపై వచ్చిన నివేదికలు కూడా బీసీసీఐ దృష్టిలో పడినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై కూడా ఆటగాళ్లతో బీసీసీఐ చర్చిస్తుందో లేదో ఇంకా క్లారిటీ లేదు.
"గతంలో భారత జట్లు క్రికెట్‌ను గౌరవించేవి. కానీ ఇప్పుడు అలా లేదు. భారత జట్ల ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుంది" అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. తమ సీనియర్ ఆటగాళ్లనే జూనియర్స్ కూడా ఫాలో అయ్యారు.
కాగా ఈ తుది పోరులో భారత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రేలు ప్రవర్తన కూడా చర్చనీయాంశమైంది. పాక్ పేసర్ అలీ రజా వీరిని ఔట్ చేశాడు. ఔటైన తర్వాత వైభవ్, ఆయుష్.. పాక్ బౌలర్‌ను దుర్భాషలాడారు. ముఖ్యంగా వైభవ్ అయితే తన షూను చూపిస్తూ ఫైరయ్యాడు. అయితే వీరికి భారత అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. పాక్ బౌలర్ స్లెడ్జ్ చేయడంతోనే వైభవ్ అలా ప్రవర్తించాడని పోస్ట్‌లు పెడుతున్నారు.
చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్‌కు భారీ షాక్


