
టీమిండియాలోకి దూసుకువచ్చిన నయా సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy). ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్ గతేడాదే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టిన నితీశ్ రెడ్డి.. మెల్‌బోర్న్ క్రికెట్‌లో సెంచరీ (114)తో సత్తా చాటాడు.
వెస్టిండీస్‌తో సిరీస్‌లో..
ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చిన నితీశ్ రెడ్డి.. ఆస్ట్రేలియాతో సిరీస్ (IND vs AUS) సందర్భంగా ఇటీవలే తొలిసారిగా వన్డే జట్టుకూ ఎంపికయ్యాడు. ఇక 22 ఏళ్ల ఈ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ప్రస్తుతం వెస్టిండీస్ (IND vs WI)తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు.
బౌలింగ్ పరిమితం.. నో బ్యాటింగ్
అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో నితీశ్ రెడ్డికి.. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌల్ చేసే అవకాశం వచ్చింది. మొత్తంగా పదహారు పరుగులు ఇచ్చిన ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కే రాలేదు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445-8 వద్ద డిక్లేర్ చేయడం సహా.. ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలవడంతో నితీశ్ రెడ్డికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు.
విదేశీ గడ్డపైనే కీలకం
ఈ నేపథ్యంలో విండీస్‌తో రెండో టెస్టుకు ముందు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే నితీశ్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ అరుదైన సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సేవలను విదేశీ గడ్డపై ఎక్కువ ఉపయోగించుకోవాలని తాము భావిస్తున్నట్లు తెలిపాడు.
‘‘అతడొక అద్భుతమైన సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్. బ్యాటింగ్ చేయగల అరుదైన సీమ్ బౌలర్ తను. కాబట్టి తన శరీరానికి కూడా కాస్త విశ్రాంతి కావాలి. హార్దిక్ పాండ్యా విషయంలోనూ మేము ఇలాగే చేశాము.
సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల నైపుణ్యాల విషయంలో మాకు ఎలాంటి సందేహాలు లేవు. అయితే, టెస్టు క్రికెట్‌లో వారి శరీరం స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. తాను ఎంత గొప్పగా బ్యాటింగ్ చేయగలడో నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియాలో నిరూపించాడు.
నాణ్యమైన ఆల్‌రౌండర్
విదేశీ గడ్డ మీద అతడు కీలకం. మున్ముందు ఎన్నో సవాళ్లు ఎదుర్కోబోతున్నాడు. ఇక స్వదేశంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి అతడి సేవలను పరిమితం చేసినా పెద్దగా తేడా ఉండదు.
అతడొక నాణ్యమైన ఆల్‌రౌండర్ అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు’’ అని డష్కాటే చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం (అక్టోబరు 10)- మంగళవారం (అక్టోబరు 14) వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: ఫిట్‌గానే ఉన్నా.. అందుకే నన్ను సెలక్ట్ చేయలేదు: స్పందించిన షమీ