‘ఇది మంచి ఆరంభం.. అత‌డొక అద్భుతం’ | Shubman Gill Praise-Axar-Patel-Team-Bowling Efforts Vs ENG 1st ODI | Sakshi
Sakshi News home page

Shubman Gill: ‘ఇది మంచి ఆరంభం.. అత‌డొక అద్భుతం’

Jul 15 2026 8:15 AM | Updated on Jul 15 2026 9:09 AM

Shubman Gill Praise-Axar-Patel-Team-Bowling Efforts Vs ENG 1st ODI

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా తొలి విజ‌యాన్ని అందుకుంది. ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా మంగ‌ళ‌వారం జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త జ‌ట్టు 6 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. తొలుత బౌలింగ్‌తో, ఆపై బ్యాటింగ్ ఇలా స‌మిష్టి ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న టీమిండియా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ ముగిసిన అనంత‌రం కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ మాట్లాడాడు. 

ఇది త‌మ‌కు మంచి ఆరంభ‌మ‌ని, దీనిని త‌ర్వాతి మ్యాచ్‌ల్లోనూ కొన‌సాగిస్తామ‌ని గిల్ తెలిపాడు. ‘నిజానికి నేను టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాడినేమో. ఎందుకంటే బౌలింగ్‌తో పోలిస్తే బ్యాటింగ్ బ‌లంగా ఉంది. బౌలింగ్‌లో బుమ్రా మిన‌హా మిగ‌తావారికి ఇంగ్లండ్ గ‌డ్డ‌పై పెద్ద‌గా అనుభ‌వం లేదు. మా ముందు ఎంత పెద్ద ల‌క్ష్యం ఉన్నా దానిని ఛేదించేందుకు మా ద‌గ్గ‌ర బ్యాటింగ్ అస్త్రాలు నిండుగా ఉన్నాయి. కానీ మా బౌల‌ర్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. 

తొలి 10 ఓవ‌ర్ల‌లో ఇంగ్లండ్ 50కి పైగా ప‌రుగులు చేసిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత మిడిల్ ఓవ‌ర్ల‌లో క‌ట్టుదిట్టం చేయ‌డంతో వారికి ప‌రుగులు రావ‌డం క‌ష్ట‌మైపోయింది. చివ‌రి ప‌వ‌ర్ ప్లేలో ఇంగ్లండ్ కాస్త దూకుడుగా ఆడ‌డంతో 250 ప్ల‌స్ స్కోరును దాట‌గ‌లిగారు లేదంటే 220 నుంచి 230కి పరిమితమ‌య్యేవాళ్లేమో. 

2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌డంతో ఒక ప‌ర్‌ఫెక్ట్ కాంబినేష‌న్ కోసం గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నాం. బ్యాటింగ్‌, బౌలింగ్ స‌మ‌పాళ్ల‌లో ఉండేలా వ‌ర్కౌట్ చేస్తున్నాం. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై ఉండే వికెట్ ప‌రిస్థితులు ద‌క్షిణాఫ్రికాలోని ప‌రిస్థితుల‌కు కొంత సారూప్య‌త ఉంటుంద‌ని భావిస్తున్నా. అక్ష‌ర్ ప‌టేల్ త‌న ఆల్‌రౌండ్ పాత్ర‌కు న్యాయం  చేశాడు. రాబోయే రోజుల్లో ఈ విజ‌యాల‌ను కంటిన్యూ చేస్తాం’ అని చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జో రూట్‌ (76 బంతుల్లో 76 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), లియామ్‌ డాసన్‌ (83 బంతుల్లో 68; 6 ఫోర్లు 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్‌ 107/6తో ఇబ్బందుల్లో ఉన్న దశలో రూట్, డాసన్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 22.2 ఓవర్లలో 121 పరుగులు జోడించారు. 

అనంతరం భారత్‌ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (75 బంతుల్లో 80 రిటైర్ట్‌హర్ట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌), అక్షర్‌ పటేల్‌ (52 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), వాషింగ్టన్‌ సుందర్‌ (63 బంతుల్లో 52 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. అక్షర్, సుందర్‌ ఐదో వికెట్‌కు 105 బంతుల్లో అభేద్యంగా 102 పరుగులు జత చేశారు. సిరీస్‌లో భారత్‌ 1–0తో పైచేయి సాధించగా... కార్డిఫ్‌లో రేపు రెండో వన్డే జరుగుతుంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement