Photo Credit: BCCI Twitter
టీమిండియాతో ఢిల్లీ వేదికగా చారిత్రక టీ20 సిరీస్ ఆడాలని భావించిన అఫ్గానిస్తాన్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సెప్టెంబర్‌లో జరగాల్సిన టీ20 సిరీస్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా తమ దేశంలో టీమిండియాతో వైట్‌బాల్ టూర్ ప్లాన్ చేయనుండడమే వాయిదాకు కారణమని తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
మరోవైపు అఫ్గానిస్తాన్‌లో రాజకీయ అస్థిరత కారణంగానే ఆ జట్టు తమ మ్యాచ్‌లను యూఏఈ లేదా భారత్ వేదికగా ఆడాలని నిర్ణయిం చుకుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాతో టీ20 సిరీస్‌కు ప్లాన్ చేసింది. ఢిల్లీ వేదికగా ప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ సిరీస్‌కు అఫ్గానిస్తాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, సొంతగడ్డపై టీమిండియా పర్యాటక జట్టుగా మ్యాచ్‌లు ఆడనుండడం విశేషం.
బంగ్లాదేశ్ అడ్డుపుల్ల..
కొన్నాళ్ల కిందట భారత్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మాత్రం మనతో సంబంధాలు తిరిగి బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సౌతాఫ్రికా వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ సమావేశాల్లోనూ బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ భారత్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌తోనే ఆ బంధాన్ని తిరిగి మొదలుపెట్టాలని బంగ్లా ప్రభుత్వం భావిస్తోంది.
అందుకే సెప్టెంబర్ 1 నుంచి 13 మధ్య టీమిండియా తమ గడ్డపై ఆరు మ్యాచ్‌ల వైట్ బాల్ సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) ఆడేలా ఇప్పటికే బీసీసీఐకి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఒకవేళ భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే బీసీసీఐ బంగ్లాదేశ్ టూర్‌కు పచ్చజెండా ఉపనుంది.
ఒకవేళ బీసీసీఐ ఆమోదం పొందితే మాత్రం అదే సమయంలో జరగాల్సిన ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ వెనక్కి వెళ్లే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి ఆసియా గేమ్స్ ఉండడం, ఆ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో సిరీస్ ఉండడంతో అఫ్గానిస్తాన్‌తో సిరీస్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఈ లెక్కన విండీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత అంటే నవంబర్‌లో ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ ఆడే అవకాశముంటుంది.
రాజకీయ వివాదం..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాలోని యువత భారత్‌పై విష ప్రచారాలు చేస్తూ మతోన్మాద చర్యలకు పాల్పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ చర్యలను సీరియస్‌గా తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే భారత ప్రభుత్వం ఆదేశాలతో కేకేఆర్ జట్టు బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్‌ను తొలగించింది. దీంతో ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య అగ్గి రాజుకుంది.
ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఆడలేమంటూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయినప్పటికీ బంగ్లా తన వైఖరిని మార్చుకోలేదు. దీంతో ఆ టోర్నీకి బంగ్లాదేశ్ దూరంగా ఉండిపోయింది. అయితే బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత తారిక్ రెహమాన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలోనే క్రికెట్ ద్వారా భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని తారిక్ రెహమాన్ ప్రభుత్వం భావిస్తోంది. మరి భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ టూర్‌లో పాల్గొనేందుకు బీసీసీఐకి అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.
Read: బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్‌గా తిలక్ వర్మ రికార్డు


