Photo Credit: IOA Twitter
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల బోణీ చేసింది. పురుషుల పారా పవర్‌లిఫ్టింగ్ హెవీవెయిట్ కేటగిరీలో ఝండు కుమార్ కాంస్యంతో మెరిశాడు. గ్రూప్-బి నుంచి బరిలోకి దిగిన ఝండు తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువును ఎత్తి 130.9 పాయింట్లు స్కోరును సాధించాడు.
ఇప్పటివరకు ఝండు కెరీర్‌లో అత్యుత్తమంగా ఉన్న 198 కేజీల బరువును అధిగమించనప్పటికీ తాజా కామన్‌వెల్త్ గేమ్స్‌లో మాత్రం కాంస్యాన్ని ఒడిసిపట్టాడు. మూడో ప్రయత్నంలో 196 కేజీల బరువు ఎత్తే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ తన కంటే ఎక్కువగా ఎవరు బరువు ఎత్తకపోవడంతో గ్రూప్-బి నుంచి తొలి స్థానంలో, ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచి పతకం ఖాయం చేసుకున్నాడు.
ఇక నైజీరియాకు చెందిన రిలువాన్ ఇద్రిస్ 208 కిలోల బరువు ఎత్తి 132.8 పాయింట్లు సాధించి పోడియంపై తొలి స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నాడు. ఇక 199 కిలోల బరువు ఎత్తిన ఇంగ్లండ్‌కు చెందిన మాథ్యూ హార్డింగ్ 131 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి వెండిని కైవసం చేసుకున్నాడు. ఇక కాంస్య పతకం గెలుచుకున్న అనంతరం ఝండు కుమార్ మాట్లాడాడు.
‘నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. భారత్‌కు ఇది చాలా ముఖ్యం. ఈ గేమ్స్‌లో నాదే దేశానికి తొలి పతకం కావడాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. జాతీయ జెండాను పోడియంపై చూసినప్పుడు గర్వంగా ఫీలయ్యాను. థాంక్యూ ఇండియా. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను పతకం గెలిచిన విషయాన్ని ముందుగా ఇంట్లో అమ్మానాన్నలకు చెప్తాను. అలాగే, చిన్నప్పటి నుంచి నాకు అండగా నిలిచిన నా స్నేహితుడు గౌతమ్ భయ్యాకు కూడా విషయాన్ని చెప్పాలి’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.

ఈ-రిక్షా నుంచి వెయిట్‌లిఫ్టర్ దాకా
పేదరికం విజయకాంక్షను పెంచుతుందనే మాట పారా పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ సాధించిన ఘనత ద్వారా మరోసారి నిరూపితమైంది. హర్నౌత్‌కు చెందిన ఒక కూరగాయల వ్యాపారి కుమారుడైన ఝండు ఒక ఈ-రిక్షా డ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు. హర్నౌత్‌లోని ది రాక్ స్టార్ జిమ్ యజమాని గౌతమ్ సింగ్ రాకతో ఝండు జీవితం పూర్తిగా మారిపోయింది.
ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్ (కేఐపీజీ)లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. మార్చి 23న జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని వెయిట్‌లిఫ్టింగ్ హాల్‌లో జరిగిన పురుషుల 72 కేజీల విభాగంలో, ఆ పవర్‌లిఫ్టర్ 206 కేజీల బరువును ఎత్తి తన సొంత జాతీయ రికార్డును బద్దలు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. మార్చి 17-18 తేదీలలో నోయిడాలో జరిగిన పారా నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో ఝండు 205 కేజీల బరువును ఎత్తి, సుధీర్ కుమార్ యొక్క 192 కేజీల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.
పుట్టుకతో పోలియో
28 ఏళ్ల అతనికి పుట్టుకతోనే పోలియో సోకిన కాళ్లు ఉన్నాయి. అతని పారా స్పోర్ట్స్ ప్రయాణం 2017లో ప్రారంభమైంది. మొదట్లో, అతను షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పోటీపడ్డాడు. ఆ సమయంలో, అతనికి పారా పవర్‌లిఫ్టింగ్ గురించి తెలియదు. F-55 కేటగిరీలో, ఝండు అనేక షాట్‌పుట్డి, డిస్కస్ త్రో ఈవెంట్లలో పాల్గొని విజయం సాధించాడు, కానీ అతని గమ్యం వేరే చోట ఉండటంతో, విధి అతన్ని ఆ దిశగా నడిపించింది.
కష్టాలతో కూడిన ప్రయాణం తర్వాత, అతను గాంధీనగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(NCOE)కి చేరుకున్నాడు. ప్రముఖ పారా కోచ్ రాజిందర్ సింగ్ రాహేలు మార్గదర్శకత్వంలో పవర్ వెయిట్‌లిఫ్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. డిసెంబర్ 2023లో, KIPG తొలి ఎడిషన్‌లో పవర్‌లిఫ్టింగ్ విభాగంలో ఝండు కుమార్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 2028 లాస్ ఏంజెలెస్ పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యమని ఝండు కుమార్ పేర్కొన్నాడు.
🇮🇳 BRONZE FOR BHARAT! 🥉
Jhandu Kumar opens India’s #CWG2026 medal tally with a massive 190kg lift in Men’s Heavyweight Para Powerlifting. The entire nation is proud! 🇮🇳 #Cheer4Bharat pic.twitter.com/pyZSOZw0uI— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 24, 2026
చదవండి: గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్!


