source: X
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు మరో పతకం ఖరారైంది. ఇప్పటికే 12 పతకాలతో (2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు) పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్ మరో పతకం ఖాయం చేసుకొని పట్టికలో మరింత మెరుగైన స్థానానికి వెళ్లే దిశగా సాగుతోంది.
మహిళల బాక్సింగ్ 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి ఈ పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్‌ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్‌ను 5-0 తేడాతో చిత్తు చేసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లడంతో ఆమెకు కనీసం కాంస్య పతకం ఖరారైంది.
ఈ బౌట్‌లో ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సాక్షి మూడు రౌండ్లలోనూ ఏకగ్రీవంగా 5-0 స్కోరుతో విజయం సాధించింది. వేగవంతమైన కదలికలు, కచ్చితమైన పంచ్‌లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను తన ఆధీనంలో ఉంచుకుంది.
ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం జరిగే సెమీఫైనల్లో కెనడాకు చెందిన అంబర్-జేన్ వాల్‌తో సాక్షి తలపడనుంది. అంతకుముందు ప్రీక్వార్టర్‌ఫైనల్లో బోట్స్వానాకు చెందిన లెథాబో మొడుకనెలెపై విజయం సాధించి సాక్షి క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఇదిలా ఉంటే, ఈ పోటీల్లో భారత బాక్సర్ల పోరు కొనసాగనుంది. మహిళల 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి న్యూజిలాండ్‌కు చెందిన మోర్గాన్ హెండర్సన్‌తో క్వార్టర్‌ఫైనల్లో పోటీ పడనుండగా.. పురుషుల 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ బోట్స్వానాకు చెందిన ట్రెజర్ మోరెమితో.. 80 కేజీల విభాగంలో అంకుష్ యాదవ్ సీషెల్స్‌కు చెందిన జేడ్ మికాక్‌తో, 90 కేజీల విభాగంలో నరేందర్ బెర్వాల్ సమోవాకు చెందిన మైఖేల్ సెకోతో క్వార్టర్‌ఫైనల్ బరిలోకి దిగనున్నారు.


