breaking news
Sultania
-
సుల్తానియాను అరెస్టు చేయండి
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని దాఖలైన ధిక్కరణ కేసులో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆయన ఎక్కడ కన్పించినా అరెస్టు చేసి సురక్షిత కస్టడీలో ఉంచాలని, ఈ నెల 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరుపరచాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. వారెంట్‌ను అమలు చేయాలంటూ గురువారం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని వెంటనే సీపీకి తెలియజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే సుల్తానియా రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి, శుక్రవారం తప్పనిసరిగా కోర్టుకు హాజరవుతానని హామీ ఇస్తే బెయిల్‌పై విడుదల చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత కూడా న్యాయస్థానం తదుపరి ఆదేశాలిచ్చే వరకు అవసరమైనప్పుడు సుల్తానియా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందనే షరతు విధించింది. వారెంట్‌ను ఏ విధంగా అమలు చేశారన్న వివరాలతో కూడిన నివేదికను వీలైనంత త్వరగా, సాధ్యమైనంత వరకు ఆగస్టు 7లోపే హైకోర్టుకు సమర్పించాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఒకవేళ వారెంట్‌ను అమలు చేయలేకపోతే సరైన కారణాలను కూడా నివేదికలో స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. కంటోన్మెంట్ బోర్డుకు బకాయిల విడుదల కేసులో.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ సర్‌చార్జి బకాయిల విడుదలకు సంబంధించి సమర్పించిన వినతిపత్రంపై నాలుగు వారాల్లో చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని 2024లో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుమారు రూ.33.42 కోట్ల బకాయిలను 8 వారాల్లో విడుదల చేయాలని, ఆలస్యమైతే ఏడాదికి 12 శాతం వడ్డీ చెల్లించడంతో పాటు ఆలస్యానికి గాను ప్రతి నెలా సైనిక సంక్షేమ నిధికి రూ.లక్ష చెల్లించాలని స్పష్టం చేసింది. ఏడాదైనా అమలు కాలేదంటూ.. హైకోర్టు 2024లో ఇచ్చిన ఆదేశాలను సుల్తానియా ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని ఆరోపిస్తూ పిటిషనర్ రామకృష్ణ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకుని శిక్షించాలని కోరారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి మొదట సుల్తానియాకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, అలా చేయడంలో విఫలమైతే కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే తదుపరి విచారణల సందర్భంగా..కౌంటర్ దాఖలు చేయలేదని, కనీసం ఆయన తరఫున ఎవరూ కోర్టుకు హాజరు కాలేదని గమనించిన న్యాయమూర్తి.. సుల్తానియా హాజరుకు ఆదేశించారు. సమయం ఇవ్వాలన్న జీపీ విజ్ఞప్తి తిరస్కరణ ఇదే పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ ధిక్కరణ కేసులో దాఖలైన అఫిడవిట్‌తో పాటు ఏప్రిల్ 17, జూన్ 18 తేదీల్లో ఇచ్చిన గత ఆదేశాలను న్యాయమూర్తి పరిశీలించారు. ప్రభుత్వ న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం కోరిన విషయం గమనించారు. ఎటువంటి కౌంటర్ దాఖలు చేయకపోవడంతో పాటు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఎలాంటి దరఖాస్తు కూడా దాఖలు చేయలేదని గుర్తించారు. జీపీ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ.. సుల్తానియాపై బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఆయన్ను అరెస్టు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో..తదుపరి పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
ఆ హామీని ఎందుకు ఉల్లంఘించారు?
క్రమబద్ధీకరణపై ఉన్నతాధికారుల వివరణ కోరిన హైకోర్టు - సుల్తానియా, రాజీవ్ ఆచార్య, వాణీప్రసాద్‌కు నోటీసులు సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించబోమంటూ కోర్టుకిచ్చిన హామీని ఎందుకు ఉల్లంఘించారో వివరణ ఇవ్వాలని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ ఆచార్య, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాణీప్రసాద్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైనవారి సేవలను క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన జీవో 16ను సవాలు చేస్తూ బూక్యా రాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా తాము తీసుకొచ్చిన చట్ట సవరణ ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించబోమంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగానే... అయితే ఈ హామీని ఉల్లంఘిస్తూ ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులు జారీ చేసిందంటూ బి.సంజీవ్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ... ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఇలా చేసిందన్నారు. అన్ని శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తున్నారని తెలిపారు.


