ఆ హామీని ఎందుకు ఉల్లంఘించారు?
కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించబోమంటూ కోర్టుకిచ్చిన హామీని ఎందుకు ఉల్లంఘించారో వివరణ ఇవ్వాలని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం పలువురు
క్రమబద్ధీకరణపై ఉన్నతాధికారుల వివరణ కోరిన హైకోర్టు
- సుల్తానియా, రాజీవ్ ఆచార్య, వాణీప్రసాద్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించబోమంటూ కోర్టుకిచ్చిన హామీని ఎందుకు ఉల్లంఘించారో వివరణ ఇవ్వాలని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ ఆచార్య, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాణీప్రసాద్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైనవారి సేవలను క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన జీవో 16ను సవాలు చేస్తూ బూక్యా రాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా తాము తీసుకొచ్చిన చట్ట సవరణ ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించబోమంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఉద్దేశపూర్వకంగానే...
అయితే ఈ హామీని ఉల్లంఘిస్తూ ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులు జారీ చేసిందంటూ బి.సంజీవ్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ... ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఇలా చేసిందన్నారు. అన్ని శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తున్నారని తెలిపారు.