breaking news
sheik pet
-
11 నెలలు... 8 విడతలు... రూ.5.1 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఎవరైనా ఒకటి రెండుసార్లు సైబర్ నేరాల బారినపడితేనే అప్రమత్తం అవుతారు. అదీ ఒకేరకమైన వేదికల కేంద్రంగా జరిగితే వాటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. అయితే షేక్‌పేటకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి (48) మాత్రం 11 నెలల కాలంలో ఎనిమిది విడతల్లో రూ.5.1 లక్షలు మోసపోయాడు. ప్రతి సందర్భంలోనూ సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ద్వారానే... నగదు రికవరీ, విదేశీ ఉద్యోగాల పేరుతోనే ఎర వేసి టోకరాలు వేయడం గమనార్హం. పూర్తి వివరాలు లేకపోయినా... ఈ ఎనిమిది విడతలకు ముందూ ఓసారి ఇతడు బాధితుడిగా మారినట్లు ఫిర్యాదు ఆధారంగా తెలుస్తోంది. 2025 ఆగస్టు నుంచి 2026 జూన్ వరకు జరిగిన ఈ ‘సీరియల్ సైబర్ క్రైమ్’పై ఎట్టకేలకు బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించడంతో గురువారం కేసు నమోదైంది.క్రైమ్–1లో రూ.2,83,500:ఈ బాధితుడు గతేడాది ఆగస్టులో ఫేస్బుక్లో డెంటన్స్ గ్లోబల్ లా ఫర్మ్ పేరుతో వచ్చిన ప్రకటన చూశాడు. సైబర్ మోసాల్లో కోల్పోయిన డబ్బును బాధితులకు తిరిగి ఇప్పిస్తామన్నది దాని సారాంశం. అప్పటికి కొన్నాళ్ల క్రితం ఓ సైబర్ నేరంలో డబ్బు పోగొట్టుకున్న ఇతడిని ఈ ప్రకటన ఆకర్షించింది. దీంతో బాధితుడు అందులో ఉన్న నంబర్లో సంప్రదించాడు. తాము కేవలం క్రిప్టోకరెన్సీ రూపంలోనే డబ్బు రికవరీ చేస్తామంటూ ఆ ఖాతాలు తెరవాలని చెప్పారు. ఖాతా ప్రారంభం, వెరిఫికేషన్, పన్నులు, సాంకేతిక లోపాలంటే స్వాహా చేశారు.క్రైమ్–2లో రూ.19,050:గతేడాది డిసెంబరులో బాధితుడికి ఫేస్బుక్లో దుబాయ్‌కి ఉద్యోగ వీసాలు ఇప్పిస్తామంటూ డీఎన్ఏటా ఇంటర్నేషనల్ పేరుతో వచ్చిన ప్రకటనను ఆకర్షించింది. అందులో పేర్కొన్న ప్రకారం బాధితుడు స్టోర్ కీపర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. ఇతడిని సంప్రదించిన సైబర్ నేరగాళ్లు వీసా దరఖాస్తు, వైద్య పరీక్షలు, సెక్యూరిటీ డిపాజిట్, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో రూ.19.05 వేలు వసూలు చేశారు.క్రైమ్–3లో రూ.27,653:జనవరిలో ఇన్‌స్టాగ్రాంలో విజ్డమ్ క్యాపిటల్ పేరుతో వచ్చిన ప్రకటన చూశాడు. సైబర్ నేరాల బాధితులకు తాము సొమ్ము రికవరీ చేస్తామంటూ అందులో ఉండటంతో మళ్లీ ఆకర్షితుడయ్యాడు. వారిని సంప్రదించగా తమకు ఢిల్లీ పోలీసులతో సంబంధాలు ఉన్నాయని నమ్మించారు. ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో పెట్టుబడి పెడితే కోల్పోయిన మొత్తం తిరిగి వస్తుందని చెప్పి ఖాతా ప్రారంభం, ప్రాసెసింగ్, వెరిఫికేషన్, పన్నుల పేరుతో డబ్బు వసూలు చేశారు.క్రైమ్–4లో రూ.25,000:అదే నెల్ల బాధితుడికి ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో సింగపూర్ ఉద్యోగ వీసాలు ఇప్పిస్తామంటూ ఫ్లై టు అబ్రాడ్ పేరుతో వచ్చిన ప్రకటన ఇతడి కంట్లో పడింది. వీరి ద్వారానూ స్టోర్ కీపర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసి, రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్, ఎంబసీ, హెల్త్ ఇన్సూరెన్స్ ఛార్జీల పేరుతో డబ్బు చెల్లించి మోసపోయాడు.క్రైమ్–5లో రూ.31,500:ఇప్పటికే రెండుసార్లు ‘రికవరీ క్రైమ్’లో బాధితుడిగా మారిన ఇతడికి ఫిబ్రవరిలో ఫేస్బుక్లో ట్రేడ్ గిని ప్లాట్‌ఫాం అనే ప్రకటన కనిపించింది. వీరిని సంప్రదించగా... ఢిల్లీ పోలీసులతో పాటు ఐ4సీ ఐటీ విభాగంతో సంబంధాలు ఉన్నాయని, హ్యాకర్ల ద్వారా ఆ నగదు రికవరీ చేస్తామన్నారు. వీళ్లూ రిజిస్ట్రేషన్, భద్రత, వెరిఫికేషన్, సిస్టమ్ వాలిడేషన్ పేర్లతో కాజేశారు.క్రైమ్–6లో రూ.69,200:ఏప్రిల్‌లో అమెరికాలో ఉద్యోగ వీసాలు ఇప్పిస్తామని లాయల్ కన్సల్టెన్సీ పేరుతో సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటనను నమ్మాడు. ఫ్రూట్ పికింగ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని... డీఎస్–160 ఫారం, వీసా ప్రాసెసింగ్, బయోమెట్రిక్, అపాయింట్మెంట్, ఇమిగ్రెంట్ పిటిషన్, అటెస్టేషన్ వంటి పేర్లతో వాళ్లు డిమాండ్ చేసిన డబ్బు చెల్లించి మోసపోయాడు.క్రైమ్–7లో రూ.35,000:అదే నెల్లో ఇన్‌స్టాగ్రాంలో కెనడా ఉద్యోగ వీసాలు ఇప్పిస్తామంటూ సుమయ్యా టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వచ్చిన ప్రకటన చూశాడు. వీరి ద్వారా ఫుడ్ ప్యాకింగ్ హెల్పర్ ఉద్యోగం దరఖాస్తు చేశాడు. ఈ కేటుగాళ్లు వివిధ రకాల పేర్లతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ తనిఖీ అంటూ టోకరా వేశారు.క్రైమ్–8లో రూ.23,400:జూ¯Œ లో యూకేకు చెందిన ఎన్కోర్ సొల్యూషన్స్ పేరుతో ఫేస్బుక్లో వచ్చిన ప్రకటన ఇతడి కంట్లో పడింది. గతంలో సైబర్ నేరంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పిస్తామని అందులో ఉండగా మళ్లీ నమ్మేశాడు. వారిని సంప్రదించి బ్యాంకు వెరిఫికేషన్ అని చెప్పడంతో నగదు చెల్లించి మోసపోయాడు.కామేష్ -
షేక్‌పేట తహసీల్దార్.. బదిలీ రగడ!
సాక్షి, హైదరాబాద్: నగరంలో షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక బదిలీపై రగడ రగులుకుంటోంది. తాజాగా మాజీ మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యలతో దీనికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికే రాజకీయ ఒత్తిళ్లతోనే బదిలీ జరిగిందని ఆరోపిస్తూ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనకు బలం చేకూర్చినట్లయింది. బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికైన మరుసటి రోజు షేక్‌పేట తహసీల్దార్‌కు స్థానచలనం కలిగించడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. సరిగ్గా పక్షం రోజుల క్రితం జనవరి 20న ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జరుగతున్న నిర్లక్ష్యం..జాప్యంపై ప్రశ్నించేందుకు బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి తన అనుచరులతో కలిసి షేక్‌పేట తహసీల్ ఆఫీస్‌కు వెళ్లారు. ఈనేపథ్యంలో ఎమ్మార్వో శ్రీనివాస్‌రెడ్డి..కార్పొరేటర్ విజయలక్ష్మి మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ విజయలక్ష్మి ఒకరిపై మరొకరు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా ఈ నెల 11న కార్పొరేటర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికైన 72 గంటల్లోనే శ్రీనివాస్‌రెడ్డిపై బదిలీ వేటు వేస్తూ సీసీఎల్ఏలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్‌కు ఫిర్యాదు చేశాం: దానం నాగేందర్ షేక్‌పేట తహసీల్దార్‌పై ఎంపీ కేశవరావుతో కలిసి సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. ప్రజాప్రతినిధులంటే తహసీల్దార్‌కు గౌరవం లేదన్నారు. ఆదాయ, కులదృవీకరణ పత్రాల జారీలో నిర్లక్ష్యం వహించడం వల్లనే సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అండగా ఉద్యోగ సంఘాలు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డికి అండగా నిలబడ్డాయి. రాజకీయ జోక్యంతోనే బదిలీ జరిగిందని ఆరోపిస్తూన్నాయి. ఏకంగా మీడియా ముందుకు వచ్చి గళం విప్పుతున్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మాజీ ఎంపీ కె.కేశవరావు కుమార్తె, అమెరికాలో ఉన్నత ఉద్యోగం సైతం వదిలి ప్రజా సేవకు వచ్చిన ఆమె.. ఇటువంటి చిన్న చిన్న విషయాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. అధికారికంగా ఉత్తర్వులు అందలేదు: శ్రీనివాస్ రెడ్డి ఇంకా అధికారికంగా తనకు బదిలీ ఉత్తర్వులు అందలేదని షేక్‌పేట మండల తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీలు జరగడం సాధారణమేనని, తన బదిలీ కూడా అలా జరిగే ఉంటుందని భావిస్తున్నానన్నారు. తనను ఎందుకు బదిలీ చేశారో తెలియదన్నారు. కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి ముందుగా తనపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, ఆ తర్వాతే తాను కౌంటర్ పిటిషన్ వేశానన్నారు. ఆదాయ «ధృవీకరణ పత్రం కోసం ఆమె ఫోన్‌చేశారని, తన వద్ద వీఆర్వోలు లేరన్న విషయాన్ని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఆ కొద్దిసేపటికే ఆఫీస్‌కు వచ్చారని, ఆ సమయంలో కోర్టుకు వెళ్లాల్సి ఉండగా కేసును స్టడీ చేస్తున్నానని వెల్లడించారు. నిబంధనల ప్రకారమే తాను నడుచుకున్నానన్నారు. చదవండి: మేయర్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ -
కూలిన ఐదంతస్థుల భవనం
హైదరాబాద్: నగరంలోని షేక్‌పేట్‌లో నిర్మాణ దశలో ఉన్న ఓ ఐదంతస్థుల భవనం అమాంతం కూలిపోయింది. గ్రౌండ్‌ఫ్లోర్ పూర్తిగా ధ్వంసమై పక్కనే ఉన్న భవంతిపై 1,2,3 ఫ్లోర్లు వాలిపోయాయి. కేవలం ఒకే అంతస్థుకు అనుమతి ఉన్నా ఐదంతస్థుల వరకు నిర్మాణం చేపట్టడంతో భవనం కూలిపోయిందని భవనాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చెప్పారు. భవనం కూలిపోయిన వెంటనే అక్కడికి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీ రాములు నాయక్, స్థానిక ఎమ్మార్వో చంద్రకళ వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా గోపినాథ్ మాట్లాడుతూ.. విస్తీర్ణాన్ని మించి నిర్మాణం చేపట్టడంతో ఒక్కసారిగా భవంతి కూలిపోయిందని చెప్పారు. ధ్వంసమైన బిల్డింగ్‌ను ఈ రాత్రికే డిమాలిష్ చేసేందుకు అధికారులను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఘటనలో ముగ్గురు కూలీలకు గాయాలయ్యాయని, అక్రమ కట్టడాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. బిల్డింగ్ అనుమతిపై జీహెచ్ఎంసీ అధికారులు చూసుకుంటారని ఎమ్మార్వో చంద్రకళ అన్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బందిగా ఇక్కడి పరిస్థితిని చక్కదిద్దే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.


