తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై విచారణ అడిగితే భయమెందుకని మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై బాధితులు, ప్రతిపక్షం అడిగే దానికి ప్రభుత్వం చెప్పే సమాధానాలకు పొంతన ఉండటం లేదన్నారు. అధికారులు మాత్రం అభ్యర్థులను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారన్నారు.
‘డీఎస్సీ-2025లో డీఎస్సీ కన్వీనర్‌ని ఎందుకు పక్కన పెట్టారు?, ఫస్ట్ ర్యాంకర్ నవీన్ అనే యువకుడికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?, పరీక్షల సిస్టంలో పని చేసిన నవీన్‌కు ఫస్ట్ ర్యాంకు రావటం మీద అనుమానం ఉంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు సరైన సమాధానం చెప్పటం లేదు?, రెండో ర్యాంకు వచ్చిన వ్యక్తికి మొదటి ర్యాంకు ఎందుకు ఇచ్చారు?, డీఎస్సీలో అక్రమాలు జరిగాయనటానికి ఇదొక నిదర్శనం. స్పోర్ట్స్ కోటాను 2 నుండి 3 శాతానికి పెంచటం వెనుక కుట్ర ఉంది. జీవో నెంబర్ 4, 47 తేవటం వెనుక కుట్ర ఉంది. ఆ జీవోలు సరైనవే ఆయితే మళ్ళీ జీవో నెంబర్ 56 ఎందుకు తెచ్చారు?
ఈమధ్యలోనే భారీగా అక్రమాలు జరిగాయి. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ తెచ్చుకున్న దుర్గయ్యకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ పై కూడా విచారణ జరపాలి. రూ.15 లక్షల చొప్పున ఉద్యోగాలను అమ్ముకున్నారు. దానిపై విచారణ జరపాలని అడిగితే కేసులు పెడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్లాదిపై దాడి దుర్మార్గం..
మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో దాడి చేయటం దుర్మార్గపు చర్య. మా రిలే దీక్షల్లో రౌడీలు ఉన్నారన చంద్రబాబు అనటం దారుణం. ఆ మాటలను వెనక్కు తీసుకోవాలి. దీక్షల శిబిరాల దగ్గరకు వెళ్ళి చూస్తే చంద్రబాబుకు వాస్తవాలు తెలుస్తాయి’ అని స్పష్టం చేశారు.


