ఘటన జరిగిన 3 రోజుల తర్వాత నిందితుల అరెస్టు
పోలీసులపై రాజకీయ ఒత్తిడులు
రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్
ఇద్దరు వ్యక్తుల ఉన్మాదానికి యువ డాక్టర్ జీవచ్ఛవంలా మారింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం ఊరి కాని ఊరికి వచ్చిన ఆ యువతి ఇప్పుడు మృత్యువు ముంగిట నిలిచింది. మద్యం మత్తులో విచక్షణ మరిచిపోయి కండకావరంతో కారుతో తొక్కించి కిరాతకంగా వ్యవహరించిన దుర్మార్గులపై కఠినంగా వ్యవహరించడంలో పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి.
రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి జిల్లా): వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక(28) బ్రెయిన్ డెడ్ పాలైన కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఘటన జరిగిన మూడు రోజుల వరకు పోలీసులు కేసును గుంభనంగా ఉంచారన్న దానిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఎందుకు తాత్సారం ప్రదర్శించారో తెలపాలని ప్రశ్నించారు. పోలీసులపై ఎవరి ఒత్తిడి ఉందని నిలదీస్తున్నారు. ప్రియాంక ప్రమాదానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రియాంకకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ మోరంపూడి జంక్షన్ వద్ద శనివారం నిర్వహించిన ధర్నాలో మార్గాని భరత్ పాల్గొన్నారు. 'జస్టిస్ ఫర్ డాక్టర్ ప్రియాంక' ప్లకార్లు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ.. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రియాంకకు జరిగిన అన్యాయంపై తాము పోరాడుతున్నామని, న్యాయం జరిగే వరకు పోరాడేందుకు జనమంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
''డాక్టర్ ప్రియాంకను కారుతో మూడు సార్లు ఢీకొట్టడం అత్యంత దారుణం. ఆగస్టు 3న ఘటన జరిగితే మూడు రోజుల తర్వాత నిందితులను అరెస్ట్ చేసినట్టు చూపించారు. ఘటన జరిగిన రోజు రాత్రే నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు కానీ, అధికారికంగా వారి అరెస్ట్ గురించి వెల్లడించలేదు. ఏదో కుట్ర జరిగిందని మాకు అనుమానంగా ఉంది. మాకున్న సమాచారం ప్రకారం.. యాక్సిడెంట్ కేసుగా చూపించి, నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చూశారు. పోలీసులపై ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉందని అర్థమవుతోంది. డాక్టర్ ప్రియాంక కేసు గురించి పోస్టులు పెట్టొద్దని సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లు అందరినీ బెదిరించారు.

ప్రజాస్వామాన్ని కూటమి ప్రభుత్వం ఖానీ చేస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని నారా లోకేశ్ చెప్పారు, ఇప్పుడు రాజమండ్రిలో అదే జరుగుతోంది. ఒక డాక్టర్‌ను కారుతో తొక్కించిన ఘటనలో నిందితులను పోలీసులు, ప్రభుత్వం కాపాడటానికి ప్రయత్నించడం దారుణం. నిందితులపై ముందే ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టలేదు? 3 రోజుల పాటు నిందితులను ఎందుకు దాచారు? ప్రియాంకకు జరిగిన అన్యాయంపైనా సీబీఐతో దర్యాప్తు చేయించాలి. యాక్సిడెంట్ చేసిన తర్వాత నిందితులు ఎవరెవరికి ఫోన్ చేశారనే కాల్ డేటా బయటపెట్టాలి. ఈ కేసులో నిజానిజాలు వెల్లడి కావాలంటే ప్రజలు బయటకు వచ్చి పోరాడాలి. నిందితులను ఎవరు కాపాడుతున్నారు, ఎందుకు కాపాడుతున్నారు, ఎన్ని సూటుకేసులు ఎన్ని చేతులు మారాయి.. ఇవన్ని బయటకు రావాలి. డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరగాల''ని మార్గాని భరత్ అన్నారు.
ఈనెల 21 వరకు నిందితులకు రిమాండ్
డాక్టర్ ప్రియాంక బ్రెయిన్ డెడ్‌కు కారణమైన కేసులో నిందితులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసఫ్‌లకు కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. వీరిద్దరూ మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ప్రియాంకకు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.


