సాక్షి, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతల దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు దౌర్జన్యానికి దిగారు. దీంతో, పోలీసులకు, మాజీ మంత్రి విడదల రజినికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట సందర్భంగా విడదల రజిని కిందపడిపోయారు. మహిళ అని కూడా చూడకుండా పోలీసులు ఆమెను నెట్టేయడం గమనార్హం.
చిలకలూరిపేట రంగా విగ్రహం సెంటర్లో డీఎస్సీ స్కాంపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో మూడో రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. దీక్షకు మద్దతు పలికి మాజీ మంత్రి విడదల రజిని, నాగార్జున యాదవ్ దీక్షలో పాల్గొన్నారు. అనంతరం, అక్కడికి చేరుకున్న పోలీసులు.. దీక్షకు అనుమతి లేదంటూ దౌర్జన్యానికి దిగారు. పార్టీ నేతలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా విడదల రజిని కిందపడిపోయారు.
అనంతరం, మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ..‘డీఎస్సీ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయి. సంతలో కూరగాయాల మాదిరి డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. విద్యార్థులు, నిరుద్యోగులు నిరసన దీక్షలో పాల్గొంటే పోలీసులు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మూడు రోజుల నుంచి దీక్ష చేస్తుంటే పోలీసులు దీక్ష శిబిరాలను తొలగించడం, మైకులు లాగేయడం చేస్తున్నారు. డీఎస్సీలో అక్రమాలు ప్రజల్లోకి వెళ్లిపోవడంతో ప్రభుత్వానికి భయం పట్టుకుంది. తప్పు చేసిన వాళ్లే భయపడాలి. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి పోలీసులు అడ్డం పెట్టుకొని మా దీక్ష శిబిరాలను ఇబ్బంది పెడుతుంది. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా.. ఎంత ఇబ్బంది పెట్టినా దీక్షలు కొనసాగుతాయి’ అని హెచ్చరించారు.


