కొత్త గ్యాస్‌ పథకం.. పీఎన్‌జీ కనెక్షన్లకు మరింత ఊపు | New PNG incentive scheme Cut Cost Recovery Time 10 Years to 3 | Sakshi
Sakshi News home page

కొత్త గ్యాస్‌ పథకం.. పీఎన్‌జీ కనెక్షన్లకు మరింత ఊపు

Sep 13 2026 5:28 PM | Updated on Sep 13 2026 5:55 PM

New PNG incentive scheme Cut Cost Recovery Time 10 Years to 3

కేంద్ర ప్రభుత్వం దేశంలో పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (PNG) వినియోగాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు కొత్త ప్రోత్సాహక పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 2026 సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభమైన ఈ పథకం ద్వారా సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (CGD) కంపెనీలకు తక్కువ ధరకు లభించే దేశీయ గ్యాస్‌ను అదనంగా కేటాయించనున్నారు. దీంతో ఇళ్లకు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వడం కంపెనీలకు మరింత లాభదాయకంగా మారనుంది.

కొత్త కనెక్షన్‌కు అదనపు గ్యాస్‌

ప్రతి భౌగోళిక ప్రాంతానికి (GA) ప్రభుత్వం నిర్దేశించిన కనీస స్థాయికి మించి కొత్తగా బిల్లు అయ్యే ప్రతి దేశీయ పీఎన్‌జీ కనెక్షన్‌కు 200 స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల (SCM) అదనపు ధరల నియంత్రణ విధానం పరిధిలోని (APM) గ్యాస్‌ను అర్హత కలిగిన సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలకు కేటాయిస్తారు. అంటే కేవలం పైప్‌లైన్‌ వేసి మీటర్‌ ఏర్పాటు చేయడం కాకుండా, వాస్తవంగా గ్యాస్‌ వినియోగించి బిల్లు వచ్చే కనెక్షన్లను పెంచినప్పుడే కంపెనీలకు ఈ ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకాన్ని ఆరు నెలల్లో రెండు విడతలుగా అమలు చేయనున్నారు.

కంపెనీలకు భారీగా తగ్గనున్న ఖర్చు

ప్రస్తుతం సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు తమ సీఎన్‌జీ-ట్రాన్స్‌పోర్ట్‌ విభాగంలో కొంత అవసరాన్ని ఖరీదైన ఎల్‌ఎన్‌జీతో భర్తీ చేస్తున్నాయి. కొత్త పథకం కింద లభించే తక్కువ ధర దేశీయ గ్యాస్‌ను ఎల్‌ఎన్‌జీ స్థానంలో ఉపయోగించుకోవడం ద్వారా కంపెనీల మొత్తం గ్యాస్‌ సోర్సింగ్‌ వ్యయం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంటింటికీ పీఎన్‌జీ కనెక్షన్‌ ఇచ్చేందుకు పెట్టే మూలధన పెట్టుబడి పదేళ్లలో రికవరీ కావాల్సి ఉండగా కొత్త పథకం వల్ల మూడేళ్లలోనే తిరిగొస్తుందని కేంద్రం తెలిపింది.

1.75 కోట్లకు చేరిన పఘెన్‌జీ కనెక్షన్లు

ఆగస్టు 18 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 1.74 కోట్ల దేశీయ పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. తాజాగా పీఎన్‌జీఆర్‌బీ గణాంకాల ప్రకారం 2026 జూలై నాటికి ఈ సంఖ్య 1,75,46,911కు చేరింది. అంటే దేశంలో పీఎన్‌జీ కనెక్షన్ల సంఖ్య ఇప్పటికే 1.75 కోట్లను దాటింది. అయితే కనెక్షన్‌ ఉండటం మాత్రమే కాకుండా అవి క్రియాశీలంగా ఉండేలా చేయడం కూడా ప్రభుత్వ తాజా పథకం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.

కొత్త ప్రాంతాల్లోకి పీఎన్‌జీ నెట్‌వర్క్‌

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ విస్తరణను పీఎన్‌జీఆర్‌బీ అనుమతించిన భౌగోళిక ప్రాంతాల్లో ఆయా సంస్థలు చేపడుతున్నాయి. 2025లో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం 307 భౌగోళిక ప్రాంతాలకు సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ అభివృద్ధి కోసం అనుమతులు ఉన్నాయి. 2026లో పీఎన్‌జీ విస్తరణను మరింత వేగవంతం చేసేందుకు 110 ప్రాధాన్య ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు, పైప్‌లైన్‌ నిర్మాణానికి అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేసే చర్యలు చేపట్టింది.

పీఎన్‌జీకి మారేందుకు మరో ఊతం

పీఎన్‌జీకి మారే వినియోగదారులకు ప్రభుత్వం మే 2026లో మరో సౌకర్యాన్ని కూడా ప్రకటించింది. పీఎన్‌జీ కనెక్షన్‌ తీసుకున్న ఎల్‌పీజీ వినియోగదారులు 30 రోజుల్లో తమ ఎల్‌పీజీ కనెక్షన్‌ను సరెండర్‌ చేయవచ్చు. లేదా భవిష్యత్తులో పీఎన్‌జీ సౌకర్యం లేని ప్రాంతానికి మారాల్సి వస్తే తిరిగి ఎల్‌పీజీ కనెక్షన్‌ పొందేందుకు ట్రాన్స్‌ఫర్‌ వోచర్‌ తీసుకునే అవకాశం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement