రూ.71,700 కోట్ల షేర్ల అమ్మకం.. ఒరాకిల్ అధినేత యూటర్న్‌ | Oracle Larry Ellison Ends Plan To Sell $7.5 Billion Stock | Sakshi
Sakshi News home page

రూ.71,700 కోట్ల షేర్ల అమ్మకం.. ఒరాకిల్ అధినేత యూటర్న్‌

Sep 13 2026 4:02 PM | Updated on Sep 13 2026 4:34 PM

Oracle Larry Ellison Ends Plan To Sell $7.5 Billion Stock

టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ లారీ ఎల్లిసన్‌ తన వాటాల విక్రయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒరాకిల్‌లో తనకు ఉన్న వాటాలో 50 మిలియన్‌ షేర్లను విక్రయించేందుకు గతంలో రూపొందించిన ప్రణాళికను ఆయన రద్దు చేశారు. ఈ షేర్ల విలువ ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం సుమారు 7.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.71,700 కోట్లు)గా ఉంది.

అంతకు ముందు రోజే ఎల్లిసన్‌ షేర్ల విక్రయానికి సంబంధించిన ట్రేడింగ్‌ ప్రోగ్రామ్‌ను జూన్‌ 22న ఏర్పాటు చేసినట్లు ఒరాకిల్‌ వెల్లడించింది. ఈ ప్రణాళిక ప్రకారం అక్టోబర్‌ 24 వరకు 50 మిలియన్‌ షేర్లను విక్రయించే అవకాశం ఉండేది. అయితే, ఈ ప్రణాళిక కింద ఇప్పటివరకు ఎలాంటి షేర్లను విక్రయించలేదని, ప్రస్తుతం తన ఒరాకిల్‌ షేర్లను విక్రయించే ఉద్దేశం ఎల్లిసన్‌కు లేదని కంపెనీ స్పష్టం చేసింది.

జూన్‌లో ఈ విక్రయ ప్రణాళికను రూపొందించిన సమయంలో ఆ 50 మిలియన్‌ షేర్ల విలువ సుమారు 8.75 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. అయితే అప్పటి నుంచి ఒరాకిల్‌ షేరు ధర దాదాపు 16 శాతం తగ్గింది. ప్రస్తుతం కంపెనీలో ఎల్లిసన్‌కు సుమారు 40 శాతం నియంత్రణ వాటా ఉంది.

భారీ ఏఐ పెట్టుబడుల ఒత్తిడి

కృత్రిమ మేధ (AI), క్లౌడ్‌ విభాగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఒరాకిల్‌ ఆర్థిక పరిస్థితిపై పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్‌ఏఐ వంటి సంస్థలతో కుదుర్చుకున్న భారీ క్లౌడ్‌ ఒప్పందాలను నెరవేర్చేందుకు కంపెనీ భారీగా ఖర్చు చేస్తోంది. దీంతో నగదు నిల్వలను కాపాడుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాల కోతకు కూడా శ్రీకారం చుట్టింది.

ఉద్యోగుల తగ్గింపునకు సంబంధించిన ఖర్చులు సుమారు 2.8 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని ఒరాకిల్‌ అంచనా వేసింది. ఇది గతంలో పేర్కొన్న అంచనా కంటే 700 మిలియన్‌ డాలర్లు ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ స్థూల లాభ మార్జిన్లు తగ్గడంతో శుక్రవారం ఒరాకిల్‌ షేరు ధర 1.7 శాతం పడిపోయింది.

ఈ నేపథ్యంలో ఎల్లిసన్‌ తన షేర్లను విక్రయించకూడదని తీసుకున్న నిర్ణయం కంపెనీపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని కొంతమేర తగ్గించే సంకేతంగా మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఎల్లిసన్‌ తన కుమారుడు డేవిడ్‌ ఎల్లిసన్‌ చేపడుతున్న వ్యాపార కార్యక్రమాలకు ప్రధాన ఆర్థిక మద్దతుదారుగా ఉన్నారు. పారామౌంట్‌ స్కైడాన్స్‌ కార్ప్‌ ద్వారా వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీని సుమారు 110 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసే ప్రతిపాదనలోనూ ఆయన కుటుంబం కీలకంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement