కొత్త ఎయిర్‌ఫోర్స్‌వన్‌  | Donald Trump unveils Qatari luxury jet for Air Force One fleet | Sakshi
Sakshi News home page

కొత్త ఎయిర్‌ఫోర్స్‌వన్‌ 

Jun 21 2026 12:39 AM | Updated on Jun 21 2026 12:39 AM

Donald Trump unveils Qatari luxury jet for Air Force One fleet

ఖతర్‌ బహూకరించిన 40 కోట్ల డాలర్ల విలువైన విమానాన్ని ఎయిర్‌ఫోర్స్‌వన్‌గా ఆధునీకరించిన అమెరికా 

విమానాన్ని ఎగిరే శ్వేతసౌధంగా అభివర్ణించిన అధ్యక్షుడు ట్రంప్‌ 

వాషింగ్టన్‌: స్నేహపూర్వక సంబంధాలకు గుర్తుగా ఖతర్‌ పాలకులు తనకు బహూకరించిన అత్యంత విలాసవంత విమానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శనివారం వాషింగ్టన్‌లోని జాయింట్‌ బేసి ఆండ్రూస్‌ స్థావరంలో ఆవిష్కరించారు. బోయింగ్‌ కంపెనీ తయారుచేసిన 747–8ఐ రకం లగ్జరీ విమానాన్ని ఇకపై ట్రంప్‌ అధికార పర్యటనల కోసం ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’గా ఉపయోగించనున్నారు. త్వరలో ఇది అధ్యక్షుని అధికార విధుల్లో చేరనుంది. 

నాలుగు దశాబ్దాలపాటు సేవలందించి పాతబడిపోయిన బోయింగ్‌ 747 రకం ఎయిర్‌ఫోర్స్‌వన్‌ విమానం జార్జ్‌ హెచ్‌డబ్ల్యూ బుష్‌ మొదలు ఎందరో అమెరికా అధ్యక్షులకు సేవలందించింది. తాను బహుమతిగా అందుకున్న విమానాన్ని ట్రంప్‌ ఎగిరే వైట్‌హౌజ్‌గా అభివర్ణించారు. ‘‘పాత విమానాన్ని రాబిన్‌ ఎగ్‌ బ్లూ ఎక్స్‌టీరియర్‌ ఉండగా కొత్త విమానం ఎరుపు, తెలుపు, బ్లూ రంగుల్లో ఎంతో ఆకర్షిణీయంగా కన్పిస్తోంది. గతంలో మనం బేబీ బ్లూ ఇష్టపడే వాళ్లం. 

ఇప్పుడు మారాల్సిన సమయం వచ్చింది. అమెరికా జాతీయ జెండాలోని రంగులతో విమానం కొత్త సొబగులు అద్దుకుంది’’అని ట్రంప్‌ తెలిపారు. ట్రంప్‌ ప్రయాణించడానికి ముందు 2, 3 వారాల పాటు దీనిని పరీక్షించి అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నాక ట్రంప్‌ కోసం కొత్త ఎయిర్‌ఫోర్స్‌వన్‌ను కేటాయిస్తారు. 

ఇప్పటికే అధునాతన విమానాన్ని సిద్ధంచేసి ఇవ్వాలని బోయింగ్‌ కంపెనీకి అమెరికా ప్రభుత్వం ఆర్డర్‌ఇచ్చింది. అయితే అవి మరో రెండేళ్లు ఆలస్యంకానున్న నేపథ్యంలో అప్పటిదాకా ఖతర్‌ బహూకరించిన 40 కోట్ల డాలర్ల విలువైన ఈ విమానాన్నే ఎయిర్‌ఫోర్స్‌వన్‌గా ట్రంప్‌ ప్రపంచ పర్యటనలకు ఉపయోగించనున్నారు. 

జూలై 4వ తేదీన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో బోయింగ్‌ 747–8ఐ లగ్జరీ జెట్‌ సైతం ఫ్లై–పాస్ట్‌లో పాల్గొననుందని తెలుస్తోంది. జూలైలో తుర్కియేలో జరగబోయే నాటో సదస్సుకు కొత్త విమానంలోనే వెళ్తానని ట్రంప్‌ ప్రకటించారు. గత వారం ఫ్రాన్స్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం ట్రంప్‌ చేసిన ప్రయాణమే పాత ఎయిర్‌ఫోర్స్‌వన్‌లో చేసిన చివరి అధికారిక పర్యటనగా నిలిచిపోనుంది. 

కొత్త సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌కు 3,774 కోట్లు.. 
‘‘ఈ విమానం రెండేళ్ల తర్వాత రాబోయే ఎయిర్‌ఫోర్స్‌వన్‌కు వారధిగా సేవలందించనుంది. దీనిని సాంకేతికంగా వీసీ–25బీ బ్రిడ్జ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌గా పేర్కొంటాం’’అని వాయుసేన చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ కెన్‌ విల్స్‌బాక్‌ వ్యాఖ్యానించారు. ఖతర్‌ నుంచి స్వీకరించాక అమెరికా అధ్యక్షుడికి అసాధారణ రక్షణ కల్పించేలా ఈ విమానంలో సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్‌ వ్యవస్థసహా ఎన్నో భద్రత ఏర్పాట్లు మార్చారు. 

వీటి కోసం ఏకంగా దాదాపు రూ.3,774 కోట్లు ఖర్చయిందని కెన్‌ వెల్లడించారు. అందంగా కన్పించేందుకు విమానం తోక వద్ద అమెరికా జెండా గుర్తును ముద్రించారు. విమానం లోపల ఎంతో ఆహ్లాదకరంగా కన్పించేలా ఇంటీరియల్స్‌ను డిజైన్‌చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానం అని స్థావరం హ్యాంగర్‌ వద్ద ట్రంప్‌ ప్రసంగించారు. దీనిని ఇంత అందంగా రూపుదిద్దిన కారి్మకులకు హ్యాట్సాఫ్‌. 

మీ కారణంగా ఈ విమానం చరిత్రలో ఎవ్వరూ చూడనంత లగ్జరీగా మారింది. ఇది ఎగిరే శ్వేతసౌధం. నాణ్యమైన కలప, నాణ్యమైన మెటీరియల్స్, నాణ్యమైన ఇంజిన్లు. చక్కటి విమానం ఇచ్చినందుకు ఖతర్‌కు కృతజ్ఞతలు’’అని అన్నారు. లెదర్‌ సీట్లు, బంగారు వర్ణాన్ని తలపించే లేత గోధుమ రంగు గోడలు, సుతిమెత్తని కార్పెట్లు, సరస్సులో ఈదే బాతు పెయింటింగ్‌లతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు’’అని ట్రంప్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement