భారతి సిమెంట్స్‌పై ‘పచ్చ’ పగ! | Chandrababu government is troubling Bharathi Cements | Sakshi
Sakshi News home page

భారతి సిమెంట్స్‌పై ‘పచ్చ’ పగ!

Aug 6 2026 5:32 AM | Updated on Aug 6 2026 5:32 AM

Chandrababu government is troubling Bharathi Cements

భారతి సిమెంట్‌ కర్మాగారంలో ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి మైనింగ్‌ నిర్వహణను అడ్డుకున్న టీడీపీ గూండాలు

లైమ్‌స్టోన్‌ మైనింగ్‌కు అడ్డుకట్ట.. ఉత్పత్తి నిలిపే కుట్ర!

రెండు రోజులుగా భారతి సిమెంట్స్‌కు అడ్డంకులు 

కార్యకలాపాలను అడ్డుకుంటూ చంద్రబాబు సర్కార్‌ కక్షసాధింపు

మైనింగ్‌ రహదారులకు వాహనాలు అడ్డం.. రేయింబవళ్లు అక్కడే టీడీపీ మూకల తిష్ట 

మైనింగ్‌ ఆగితే ముడిసరుకు కొరత.. 2 రోజుల్లో ప్లాంట్‌ కార్యకలాపాలపైనా ప్రభావం 

ప్రత్యక్షంగా 3 వేల మంది, పరోక్షంగా 12 వేల మంది ఉపాధికి ప్రమాదం 

ఫిర్యాదు చేసినా స్పందించని అధికార యంత్రాంగం 

అ్రల్టాటెక్‌ తర్వాత ఇప్పుడు భారతి సిమెంట్స్‌.. ప్రతిష్టాత్మక పరిశ్రమలే లక్ష్యమా? 

భారత్‌లో రూ.7 వేల కోట్ల పెట్టుబడి, రాష్ట్రానికి రూ. 3 వేల కోట్లు పన్నులు చెల్లిస్తున్న సంస్థకు ఈ పరిస్థితా?.. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఏం సంకేతమిస్తున్నారు?  

వైఎస్సార్‌సీపీ హయాంలో హెరిటేజ్‌కు ఇలాగే అడ్డుపడి ఉంటే ?  

సాక్షి ప్రతినిధి,కడప: పగ పట్టారు.. వెంటాడుతు­న్నారు.. చివరకు పరిశ్రమనే మూసేయించాలన్న లక్ష్యంతో తెగిస్తున్నారు! పెట్టుబడిదారులకు రెడ్‌ కార్పె­ట్‌ అంటూనే.. పరిశ్రమలకు ‘రెడ్‌బుక్‌’ ట్రీట్‌మెంట్‌!  వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ, రాష్ట్ర ఖజానాకు భారీగా పన్నులు చెల్లిస్తున్న భారతి సిమెంట్స్‌పై చంద్రబాబు కక్ష పరాకాష్టకు చేరింది. మొన్న మైనింగ్‌ అనుమతులపై కొర్రీలు.. నేడు ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అనుచరుల ద్వారా మైనింగ్‌కు అడ్డంకులు.. రెండు రోజులుగా రేయింబవళ్లు తిష్టవేసి లైమ్‌స్టోన్‌ తవ్వకాలను నిలువ­రి­స్తున్నా చంద్రబాబు నుంచి అందిన ఆదేశాలతో అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. మైనింగ్‌ ఆగితే ఉత్పత్తి ఆగుతుంది.. ఉత్పత్తి ఆగితే 15 వేల మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిపై దెబ్బ పడుతుంది. 

అయినా పట్టింపులేదా? పరిశ్రమ నడవకూడదన్నదే లక్ష్యమా? రాజకీయ పగ కోసం రాష్ట్ర పారిశ్రామిక ప్రయోజనా­లనే పణంగా పెడతారా? గత వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం ఇదే తరహాలో రాజకీయ కక్షతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ కార్యకలాపాలను అడ్డుకుని ఉంటే ఆ సంస్థ ప్రశాంతంగా వ్యాపారం కొనసాగించగలిగేదా? అని పలువురు పారిశ్రామిక­వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు బినామీలుగా ఆరోప­ణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు నామమాత్రపు ధరలకే విలువైన భూములు కట్టబెడుతున్నారన్న విమర్శలు.. మరోవైపు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థలకు ఇలాంటి వేధింపులు.. ఇదేనా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే విధానం? ఇదేనా పారిశ్రామిక ప్రగతి? అంటూ నిలదీస్తున్నారు. రాజకీయ కక్ష కోసం పరిశ్రమలనే ఉక్కిరిబిక్కిరి చేస్తే రేపు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఏ సంస్థ ముందు కొస్తుందని ప్రశ్నిస్తున్నారు.

నిన్న అల్ట్రాటెక్‌...నేడు భారతి సిమెంట్స్‌..
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇటీ­వల అల్ట్రాటెక్‌ సిమెంట్‌ పరిశ్రమను ముప్పుతిప్పలు పెట్టారు. మైనింగ్‌ని అడ్డుకొని పరిశ్రమ ఉత్పత్తి నిలిపేశారు. నాలుగు దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేని సంస్కృతిని తీసుకువచ్చారు. అదేబాటలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పయనిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికుల పేరిట భా­ర­తి సిమెంట్స్‌లో ఆందోళన చేయించారు.  వైఎస్సార్‌ కడప జిల్లా, కమలాపురం మండలం నల్లలింగాయ­పల్లి వద్ద భారతి సిమెంట్స్‌ 17సంవత్సరాలుగా క్యాప్టివ్‌ లైమ్‌స్టోన్‌ గనులను నిర్వహిస్తోంది. ఆ ప్రాంతంలోకి ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ప్రవేశించారు. మైనింగ్‌ నిర్వహణను మంగళవారం నుంచి అడ్డుకున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా అక్కడే తిష్టవేసి లైమ్‌స్టోన్‌ మైనింగ్‌ నిర్వహణకు ఆటంకం కల్పించారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు మైనింగ్‌ రహదారులకు అడ్డుగా పెట్టి కార్యకలాపాలను అడ్డగించారు. పైగా సిమెంటు పరిశ్రమలోని కార్మికుల విధులకు ఆటంకాలు సృష్టిస్తూ అడ్డుతగులుతున్నారు. భద్రతా సమస్యలను సృష్టిస్తున్నారు. ఇవన్నీ కూడా సీఎం చంద్రబాబుకు తెలిసే టీడీపీ ఎమ్మెల్యేలతో ఇలా చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్లాంట్‌ వాహనాన్ని అడ్డుకుంటున్న టీడీపీ మూకలు 

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
రెండు రోజులుగా భారతి సిమెంట్స్, వికాట్‌ సంస్థ ప­రిశ్రమలో మైనింగ్‌ నిర్వహణను అడ్డుకుంటున్న వ్యవ­హారంపై ప్లాంట్‌ ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. చంద్ర­బాబు ఆదేశా­లతో ఎమ్మె­ల్యే అనుచరు­లు చేస్తున్న అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, పారిశ్రా­మిక కా­ర్య­కలాపాలకు అంతరాయం లేకుండా జో­క్యం చేసుకోవాలని కోరారు. ఇలాంటి అంతరా­యా­లు కొనసాగితే, ప్లాంట్‌ ప్రభావితమ­వు­తుందని యా­జ­మాన్యం ప్రతినిధు­లు ఆందోళన వ్య­క్తం చేస్తు­న్నారు. ఇదే పరిస్థితి కొన­సాగితే 2 రోజుల్లో ప్లాంట్‌ కార్యకలాపాలను నిలిపివే­యవలసి వస్తుంద­ంటు­న్నారు. అయిన­ప్పటికీ అధి­కా­రులు పట్టించు­కో­వ­డం లేదు. చట్టబ­ద్ధౖ­మెన సమ­స్యలను తీర్చేందు­కు, కార్మికుల డిమాండ్‌ పరిష్కరించేందుకు యాజ­మా­న్యం ఎప్పుడు ముందుంటుందని కార్మి­కులు వివరి­స్తు­న్నారు. 2 రోజులుగా మైనింగ్‌ ఆగి­పో­యింది. పరిశ్ర­మ ఉత్పత్తి నిలిచిపోతే, వేలాది కు­టుంబాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం పడనుంది.

పెట్టుబడిదారులకు ఏం సందేశం ఇస్తున్నారు?
భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (భారతి సిమెంట్స్‌), భారత్‌లో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన ప్రతిష్టాత్మక ఫ్రెంచ్‌ సంస్థ వికాట్‌ గ్రూప్‌పై చంద్రబాబు సర్కార్‌ పగబట్టి­నట్లు వ్యవహరిస్తోంది. వికాట్‌ గ్రూప్‌తో అనుబంధమున్న భారతి సిమెంట్స్‌ వంటి సంస్థ కార్య­కలాపాలనే ఇలా కక్షసాధింపుతో అడ్డుకుంటుంటే... రాష్ట్రంపై అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందన్న ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. చట్టబద్దమైన వ్యాపార సంస్థలకు అండగా నిల­వాల్సిన ప్రభుత్వం ఇలా కక్షసాధించడం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని వారు వ్యాఖ్యానిస్తు­న్నారు. ట్యాక్స్‌ రూపంలో రూ.3వేల కోట్లు చెల్లిస్తున్న భారతి సిమెంట్స్‌ వంటి సంస్థలను అడ్డుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ప్రయోజన­మేమిటి అని పారిశ్రామిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.  

సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఇక్కట్లు సృష్టించారా? హెరిటేజ్‌ సంస్థ నిర్వహణను అడ్డుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం అంటే కొరివితో తలగోక్కున్నట్లే అన్నట్లు సీఎం చంద్రబాబు సర్కార్‌ వ్యవహరిస్తోందని పలు­వురు పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యాని­స్తున్నారు. వైజాగ్‌­లో గ్రైండింగ్‌ స్టేషన్‌ పెట్టాలని నిర్ణయించుకున్న వికాట్‌ సంస్థ ఇదే కారణంతో ఆ ఆలోచనను ఉపసంహరించుకుందని వారు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు అండ్‌ కో తీరు వల్లే రాష్ట్రం నుంచి పలు కంపెనీలు పలాయనం చిత్తగిస్తున్నాయి. తాజాగా టాటా గ్రూప్‌ కంపెనీ బైబై చెప్పేసింది.. హిందుస్థాన్‌ కోకోకోలా, అజాద్‌ మొబిలిటీ, జ్యూపిటర్, జిన్‌ఫ్రా, ఐస్పేస్‌ లాంటి సంస్థలు కూడా వెళ్లిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement