వృద్ధురాలి ప్రాణం తీసిన రీసర్వే | Elderly woman dead by consuming pesticide | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి ప్రాణం తీసిన రీసర్వే

Aug 6 2026 5:32 AM | Updated on Aug 6 2026 5:34 AM

Elderly woman dead by consuming pesticide

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న రజకులు, ప్రజా సంఘాల నేతలు

60 ఏళ్లుగా ఆమె ఆ«దీనంలో 26 సెంట్ల భూమి 

రీ సర్వేలో ఆ భూమి వేరే కుటుంబానికి చెందినదిగా గుర్తింపు 

వారు తమ సానుభూతిపరులంటూ రంగంలోకి దిగిన టీడీపీ ఎమ్మెల్యే  

స్థలాన్ని స్వాదీనం చేసుకునే క్రమంలో వృద్ధురాలిపై టీడీపీ కుటుంబం దాష్టీకం 

పురుగులమందు తాగి వృద్ధురాలి ఆత్మహత్య  

కర్నూలు(సెంట్రల్‌): చంద్రబాబు ప్రభుత్వం అడ్డదిడ్డంగా చేపడుతోన్న రీసర్వే ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజక­వర్గం గోనెగండ్లకు చెందిన చాకలి ఈరమ్మ (80) భర్త పెద్ద మల్లన్నకు 2.50 ఎకరాల భూమి ఉంది. 1962లో కటకం లక్ష్మయ్య, కటకం నరసింహులు నుంచి పెద్దమల్లన్న 26 సెంట్ల భూమిని కొను­గోలు చేశాడు. అయితే 1970లో కటకం నరసింహులు ఆ భూమిని గొల్ల సంజన్నకి కూడా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇటీవల గ్రామంలో రీసర్వే జరగ్గా..ఈ 26 సెంట్ల భూమిని గొల్ల సంజన్న కుమారులు నారా­యణ, రంగస్వామి, రామాంజనేయుల పేరిట చూపిం­చింది. దీంతో ఈరమ్మ, గొల్ల సంజన్న కుమా­రుల మధ్య వివాదం తలెత్తింది. 60 ఏళ్ల నుంచి తన ఆధీనంలోనే ఉన్న పొలాన్ని వారికి ఎలా ఇవ్వాలని తహశీల్దార్, వీఆర్వోకు ఈరమ్మ మొరపెట్టుకుంది. 

ఆమె విన్నపాన్ని పట్టించుకోకపోవడంతో ఈరమ్మ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో గొల్ల సంజన్న కుమారులు స్థానిక టీడీపీ నేతలు కావడంతో వారి పేరిట భూమి మార్పిడి చేయాలని తహశీల్దార్‌పై ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఒత్తిడి చేశారు. దీంతో అధికారులు ఈరమ్మ పేరిట ఉన్న భూమిని గొల్ల సంజన్న కుమారులకు మార్పు చేసి పాసు పుస్తకం ఇచ్చేశారు. ఆ భూమిని జూలై 30న ఆక్రమించుకోవడానికి వెళ్లి అక్కడున్న ఈరమ్మను దుర్భాషలాడి..అవమానించి.. పురుగుల మందు ఇచ్చి చావాలని ఎగతాళి చేశారు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై వారిచ్చిన పురుగుల మందు తాగేసింది. దీంతో ఆమెను కర్నూలు ప్రభు­త్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. 

మృతదేహానికి పంచ­నామా చేయడంలో తాత్సారం జరుగుతుండటంతో ఈరమ్మ కుటుంబ సభ్యులు బుధవారం ధర్నాకు దిగారు. దీంతో వైద్యులు పోస్టుమార్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి రజకులు, ప్రజా సంఘాల నేతలు ఆమె మృతదేహంతో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈరమ్మ చావుకు కారణమైన గొల్ల సంజన్న కుమారులు, గోనెగండ్ల తహశీల్దార్, వీఆర్వో, షాడో ఎమ్మెల్యేగా పిలవబడే ఆప్నా బజార్‌ శేఖర్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డీఆర్వో వెంకటనారాయణమ్మ అక్కడికి వచ్చి ఈ ఘటనపై ఆదోని ఆర్డీవోతో విచారణ చేయిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement