breaking news
eeramma
-
వృద్ధురాలి ప్రాణం తీసిన రీసర్వే
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం అడ్డదిడ్డంగా చేపడుతోన్న రీసర్వే ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్లకు చెందిన చాకలి ఈరమ్మ (80) భర్త పెద్ద మల్లన్నకు 2.50 ఎకరాల భూమి ఉంది. 1962లో కటకం లక్ష్మయ్య, కటకం నరసింహులు నుంచి పెద్దమల్లన్న 26 సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. అయితే 1970లో కటకం నరసింహులు ఆ భూమిని గొల్ల సంజన్నకి కూడా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇటీవల గ్రామంలో రీసర్వే జరగ్గా..ఈ 26 సెంట్ల భూమిని గొల్ల సంజన్న కుమారులు నారాయణ, రంగస్వామి, రామాంజనేయుల పేరిట చూపించింది. దీంతో ఈరమ్మ, గొల్ల సంజన్న కుమారుల మధ్య వివాదం తలెత్తింది. 60 ఏళ్ల నుంచి తన ఆధీనంలోనే ఉన్న పొలాన్ని వారికి ఎలా ఇవ్వాలని తహశీల్దార్, వీఆర్వోకు ఈరమ్మ మొరపెట్టుకుంది. ఆమె విన్నపాన్ని పట్టించుకోకపోవడంతో ఈరమ్మ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో గొల్ల సంజన్న కుమారులు స్థానిక టీడీపీ నేతలు కావడంతో వారి పేరిట భూమి మార్పిడి చేయాలని తహశీల్దార్‌పై ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఒత్తిడి చేశారు. దీంతో అధికారులు ఈరమ్మ పేరిట ఉన్న భూమిని గొల్ల సంజన్న కుమారులకు మార్పు చేసి పాసు పుస్తకం ఇచ్చేశారు. ఆ భూమిని జూలై 30న ఆక్రమించుకోవడానికి వెళ్లి అక్కడున్న ఈరమ్మను దుర్భాషలాడి..అవమానించి.. పురుగుల మందు ఇచ్చి చావాలని ఎగతాళి చేశారు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై వారిచ్చిన పురుగుల మందు తాగేసింది. దీంతో ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతదేహానికి పంచనామా చేయడంలో తాత్సారం జరుగుతుండటంతో ఈరమ్మ కుటుంబ సభ్యులు బుధవారం ధర్నాకు దిగారు. దీంతో వైద్యులు పోస్టుమార్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి రజకులు, ప్రజా సంఘాల నేతలు ఆమె మృతదేహంతో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈరమ్మ చావుకు కారణమైన గొల్ల సంజన్న కుమారులు, గోనెగండ్ల తహశీల్దార్, వీఆర్వో, షాడో ఎమ్మెల్యేగా పిలవబడే ఆప్నా బజార్ శేఖర్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఆర్వో వెంకటనారాయణమ్మ అక్కడికి వచ్చి ఈ ఘటనపై ఆదోని ఆర్డీవోతో విచారణ చేయిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
కాడెద్దులుగా మారిన దంపతులు
మడకశిర: వర్షాభావ పరిస్థితుల కారణంగా కాడెద్దులను సంరక్షించుకోవడానికి రైతులకు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో మనుషులే కాడెద్దులుగా మారుతున్నారు. ఇందుకు ఉదాహరణ అనంతపురం జిల్లా మడకశిర మండలం గోవిందాపురం గొల్లహట్టి గ్రామానికి చెందిన భార్యాభర్తలు రామలింగప్ప, ఈరమ్మ. వీరు రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట ఎండిపోతున్నా కూడా అందులో పెరిగిన కలుపు మొక్కలను తొలగించడానికి ఆ దంపతులు నానా తంటాలు పడుతున్నారు. గురువారం గ్రామ సమీపంలోని తమ వేరుశనగ పంటలో కలుపు మొక్కలను తొలగించడానికి గుంటుకను వారే లాగుతూ సాక్షి కెమెరాకు కనిపించారు.


