breaking news
Tobacco price
-
జగన్ పర్యటనతో పుంజుకున్న పొగాకు ధర
దేవరపల్లి: పొగాకు మార్కెట్లో ధరలో పెరుగుదల కనిపించింది. కిలోకు ఒక్కసారిగా రూ.15లు ఎగబాకింది. ఇదంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమేనని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ తమ సమస్యలను ప్రస్తావించడంతోనే ప్రభుత్వం ధర పెంచిందని పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఈ నెల 5వ తేదీన పర్యటించి పొగాకు రైతులకు బాసటగా నిలిచారు. పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించడంతోపాటు రైతులు కష్టాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నట్టు రైతులు వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా పోరాటం చేయాలని రైతులు కోరారు. అనంతరం వైఎస్ జగన్ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పొగాకు మార్కెట్లో ధరల పెరుగుదల... జగన్ పర్యటన అనంతరం రెండు రోజులకే పొగాకు మార్కెట్లో ధరలు పెరిగాయి. కిలోకు రూ.15లు పెరుగుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన కిలో గరిష్ట ధర రూ.275 ఉండగా, శుక్రవారం రూ.290 పలికింది. జగనన్న పర్యటన ప్రకటన వెలువడిన మరుసటి రోజు కిలోకు రూ.10 ధర పెరిగిందని, అప్పటి వరకు కిలో గరిష్ట ధర రూ.265 ఉండగా రూ.275కు పెరిగిందని తెలిపారు. పర్యటన అనంతరం కిలోకు రూ.15 పెరిగినట్టు చెబుతూ రైతులు సంతోషం వ్యక్తం చేశారు. జగనన్న పర్యటన వల్ల కిలోకు మొత్తంగా రూ.25లు అదనపు ధర లభించినట్టయిందని తెలిపారు. పొగాకు రైతుల హర్షాతిరేకాలు పొగాకు ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వల్లభనేని సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కూచిపూడి సతీష్, పొగాకు రైతులు సుంకర గంగరాజు, బాలం చంద్రశేఖర్, కవల సత్తిబాబు, పైడికొండల సత్యనారాయణ, కవల శ్రీనివాస్, తేతల బ్రహ్మరెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి, తేతల వీరకాశీరెడ్డి, పప్పు ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంలో కూడు దొరకడం లేదు
సాక్షి, రాజమహేంద్రవరం: ‘మీ పాలనలో కడుపు నిండా అన్నం తిన్నాం సార్.. చంద్రబాబు ప్రభుత్వంలో కూడు దొరకడం లేదు.. గిట్టుబాటు ధరా దక్కడం లేదు.. ఆత్మహత్యలే శరణ్యం సార్..’ అంటూ పొగాకు రైతులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం కారణంగా మద్దతు ధర దక్కక ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకుకు కనీస గిట్టుబాటు ధర దక్కక ఇక్కట్లు పడుతున్న రైతులతో నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పడానికి బుధవారం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా రైతులు తమ అభిమాన నేత వైఎస్ జగన్‌ను చూడగానే కష్టాలు ఏకరువు పెట్టారు. ‘ఈ పాలన ఏం బాగోలేదన్నా.. మీరొస్తేనే రైతు రాజ్యం వస్తుందన్నా.. మీ హయాం అన్నదాతలకు స్వర్ణ యుగం అన్నా..’ అంటూ తమ ఆవేదన చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాతల ఆవేదన వారి మాటల్లోనే..మీరొస్తున్నారని రూ.10 పెంచారుపొగాకు రైతులు మిమ్మల్ని అమరావతిలో కలిశాక.. మీరు దేవరపల్లి వస్తున్నారని తెలుసుకుని చంద్రబాబు ప్రభుత్వం కిలోకు రూ.10 మద్దతు ధర పెంచింది. అయితే గ్రేడింగ్ పేరిట వ్యాపారులు ఆ మేరకు అంటే రూ.10 తగ్గించేశారు. ఈ ప్రభుత్వ మాయాజాలం ఇలా ఉంటోంది. ప్రస్తుతం కిలో రూ.170 నుంచి రూ.260 మధ్య కొనుగోలు చేస్తున్నారు. యావరేజ్ ధర రూ.230 కూడా రావడం లేదు. ఎకరాకు రూ.3 లక్షలపైనే ఖర్చవుతోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి నాణ్యమైన పొగాకును సైతం కిలో రూ.230కే తీసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో సిండికేట్ వ్యాపారులకే మేలు జరుగుతోంది. సామాన్య రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. – జక్కుల భద్రం, కౌలు రైతు, దేవరపల్లిమన ప్రభుత్వంలో యావరేజ్ రూ.365 అన్నా.. మన ప్రభుత్వంలో దేవరపల్లి బోర్డు పరిధిలో కిలో పొగాకుకు గరిష్టంగా రూ.385 దక్కింది. యావరేజ్‌గా రూ.365 దక్కేది. ఇప్పుడా పరిస్థితి లేనే లేదు. గ్రేడింగ్ పేరుతో వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచేసుకుంటున్నారు. కిలోకు ఒక్కోసారి రూ.170 కూడా దక్కడం లేదు. గరిష్టంగా రూ.260 దాటడం లేదు. 20 ఎకరాల్లో పంట సాగు చేశాను. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాను. – సుంకవిల్లి వెంకట శ్రీనివాసరావు, సంగాయి గూడెం, దేవరపల్లి‘వడ్డీ లేని రుణం’ పథకం తీసేశారుమీరు దేవరపల్లి పర్యటనకు వస్తున్నారని చంద్రబాబు హడావిడిగా రూ.50 వేలు రుణం వడ్డీ లేకుండా ఇస్తానని ప్రకటించాడు. ఆ రూ.50 వేలు మూడేళ్లలో ఇస్తారంట. మన ప్రభుత్వంలో ఏడాదికి రూ.లక్ష వడ్డీ లేకుండా రుణాలిచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తేసింది. రైతులు వ్యవసాయం మానేసేలా చేస్తోంది. – వల్లభనేని సత్యనారాయణ, పొగాకు రైతు, గోపాలపురంమీరొస్తేనే మంచి రోజులుకేజీ పొగాకు సాగు చేసేందుకు రూ.300 ఖర్చవుతుంటే... ఇక్కడ యావరేజ్‌గా రూ.230కే కొంటున్నారు. లో గ్రేడ్ పేరుతో వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారు. వచ్చే ఏడాది నుంచి సాగు విస్తీర్ణం తగ్గించేయమంటున్నారు. టొబాకో బోర్డు గతంలో ఒక్కో రైతు నుంచి 40 క్వింటాళ్లు కొంటామని చెప్పి.. ప్రస్తుతం 20 క్వింటాళ్లే కొంటామంటోంది. వచ్చే ఏడాది పది క్వింటాళ్లే కొంటామంటున్నారు. రైతులు ఇంత అన్యాయానికి గురవుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే మా కోసం వచ్చారు. మళ్లీ మీరు అధికారంలోకి వస్తేనే మాకు మంచి రోజులొస్తాయి. – వైఎస్ జగన్‌తో పలువురు రైతులు -
మంత్రి చెప్పినా పలకని ధర
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పినా పొగాకుకు మద్దతు ధర అమలు కావడం లేదు. గత వారంలో కేంద్రమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఒక్కో గ్రేడ్‌కు సగటున ఎంత ధర ఇవ్వాలో నిర్ణయించారు. దీని ప్రకారం నాణ్యమైన పొగాకు (ఏ గ్రేడ్)కు రూ.114 తగ్గకుండా ఇవ్వాలని సూచించగా రూ.100 కూడా రావడం లేదు. మిడిల్ గ్రేడ్ పొగాకుకు రూ.102లకు తగ్గకుండా ధర వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చినా రూ.80 నుంచి రూ. 90 మధ్యనే నడుస్తోంది. ఇక లోగ్రేడ్ విషయానికి వస్తే కిలోకు రూ.67 ఇస్తామని చెప్పగా రూ.50 నుంచి రూ. 60 మధ్యనే నడుస్తోంది. జిల్లాలో సగటున రూ.99 ధర వచ్చే బాధ్యత మాదని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకూ సగటు ధర రూ.93 కూడా దాటడం లేదు. ప్రస్తుతం పొగాకు బోర్డు వేలం కేంద్రాలకు వస్తున్న పొగాకులో 50 నుంచి 60 శాతం మంచి నాణ్యత ఉన్న పొగాకు వస్తోంది. నాణ్యమైన పొగాకు వస్తుంటేనే సగటు ధర రూ.93 దాటడం లేదని, లో గ్రేడ్ పొగాకు వస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో ఉత్పత్తైన పొగాకులో 75 శాతం వరకూ మీడియం - లో గ్రేడ్ పొగాకే వచ్చింది. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రైతులు తమ వద్ద పొగాకును బోర్డు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బోర్డు మాత్రం దీనికి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. గత ఏడాది ఈ ప్రాంతంలో 213 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తయితే సగటు ధర రూ.116 పలికింది. ఈ ఏడాది అది వంద రూపాయలలోపే ఉండటంతో ఒక్కో బ్యారన్‌కు రెండు లక్షల రూపాయల వరకూ రైతు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. విస్తీర్ణం తగ్గింపుపై ఆగ్రహం వచ్చే ఏడాది పొగాకు పంట లక్ష్యం తగ్గింపుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పాగాకు బోర్డు కర్ణాటకపై ప్రేమ చూపిస్తూ ఆంధ్రప్రదేశ్‌పై శీతకన్ను వేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో నాలుగు మిలియన్ కేజీల లక్ష్యాన్ని తగ్గించిన పొగాకు బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 52 మిలియన్ కేజీల లక్ష్యాన్ని తగ్గించింది. సుమారు 30 శాతం ఏరియాలో పంటను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దక్షిణ తేలిక నేలలు 58 మిలియన్ కిలోలకుగాను ఎనిమిది మిలియన్ కిలోలు, నల్లరేగడి నేలల్లో 47 మిలియన్ కిలోలకు గాను 10 మిలియన్ కిలోలు లక్ష్యం తగ్గించారు. జిల్లాలో సుమారు లక్షన్నర ఎకరాల్లో పొగాకు సాగవుతోంది. ఈ ఏడాది లక్ష్యం తగ్గించడం వల్ల సుమారు 30 వేల ఎకరాల్లో పొగాకు పంటను తగ్గించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఈ 30 వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంట ఏది వేయాలనే సందిగ్ధత ఉంది. పొగాకు వేసే ప్రాంతమంతా వర్షాధారం కావడంతో శనగ, మిర్చి తదితర పంటలు పండే అవకాశం లేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం పట్ల రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.


