మొనజైట్‌ కేరాఫ్‌ కళింగపట్నం | Five kilos of pure monazite found in 1000 kilos of sand on the Kalingapatnam coast | Sakshi
Sakshi News home page

మొనజైట్‌ కేరాఫ్‌ కళింగపట్నం

Aug 6 2026 6:01 AM | Updated on Aug 6 2026 6:01 AM

Five kilos of pure monazite found in 1000 kilos of sand on the Kalingapatnam coast

కళింగపట్నం తీరం , మొనజైట్‌

తీరంలోని బీచ్‌ శాండ్‌ నిల్వల్లో అరుదైన, విలువైన ఖనిజం 

27 కిలోమీటర్ల పొడవు, 700 మీటర్ల వెడల్పున ఖనిజాల గని  

మొనజైట్‌తో పాటు గార్నెట్, ఇల్మనైట్, జిర్కాన్‌ వంటివి కూడా.. 

కళింగపట్నం తీరంలో వెయ్యికిలోల ఇసుకలో ఐదుకిలోల స్వచ్ఛమైన మొనజైట్‌  

సెమీకండక్టర్లు, ఎల్‌ఈడీ, మైక్రోప్రాసెసర్స్, సోలార్‌ సెల్స్, లేజర్స్‌ తయారీకి అవసరం  

ఇప్పటివరకు 80 శాతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న భారత్‌  

రేర్‌ ఎర్త్‌ ప్రాజెక్టుతో కేంద్రం వ్యూహాత్మక అడుగులు  

అరుదైన ఖనిజ సంపదపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన బీ2కే అనలిటిక్స్‌ 

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని సుదీర్ఘ సముద్రతీరం ఇప్పుడు సరికొత్త ఆర్థిక విప్లవానికి వేదిక కాబోతోంది. ముఖ్యంగా అత్యంత అరుదైన, ఖరీదైన ఖనిజాల్లో ఒకటైన మొనజైట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం తీరం ఉందని ప్రముఖ పరిశోధన సంస్థ బీ2కే అనలిటిక్స్‌ తేల్చింది. కళింగపట్నం తీరంలో దాదాపు 27 కిలోమీటర్ల పొడవున 700 మీటర్ల వెడల్పు మేర విస్తరించి ఉన్న సముద్రతీరంలో ఈ ఖనిజం ఉన్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని తీరప్రాంతంలో మొనజైట్‌తో పాటు గార్నెట్, ఇల్మనైట్‌ మొదలైన ఖనిజాలున్నాయి. ఇప్పటివరకు మన దేశం 80 శాతం వరకు మొనజైట్‌ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది.

ఇక కేంద్రప్రభుత్వం వ్యూహాత్మకంగా చేపట్టిన రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ ప్రాజెక్టు ద్వారా కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. బీ2కే అనలిటిక్స్‌ సంస్థ దేశంలో హెవీ రేర్‌ ఎర్త్‌ ఖనిజాల కొరత, వాటి నిల్వలపై ప్రధానంగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఐఎస్‌), అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ (ఏఎండీ) జరిపిన భూగర్భ పరిశోధన నివేదికలను, కోర్‌ శాంప్లింగ్‌ డేటా ఆధారంగా అధ్యయనం చేసింది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల్లో లభించే మొనజైట్‌ ఇసుకలో ఎక్కువగా లైట్‌ రేర్‌ ఎర్త్‌ మూలకాలే ఉన్నాయని, ఎలక్ట్రిక్‌ వాహ­నాల మోటార్లు, గ్రీన్‌ ఎనర్జీ పరిశ్రమలకు అత్యంత కీలకమైన డిస్పోసియం, టెర్బియం, వంటి హెవీ రేర్‌ ఎర్త్‌ మూలకాల వాణిజ్యపరమైన నిల్వలు మనదేశంలో చాలా తక్కువగా ఉన్నాయని గుర్తించింది. ఈ కొరతను కచ్చితంగా అంచనా వేయడానికి దేశీయ పారిశ్రామిక దిగుమతుల రికార్డులను, అంతర్జాతీయ గనుల లభ్యత గణాంకాలను సరిపోలుస్తూ.. రాబోయే కాలంలో ఈవీ రంగం పెరిగే కొద్దీ భారత్‌కు హెవీ రేర్‌ ఎర్త్‌ లభ్యత ఎంత సవాలుగా మారుతుందో విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది.  

రాష్ట్రంలో 38 లక్షల టన్నుల మొనజైట్‌ నిల్వలు  
974 కిలోమీటర్ల తీరప్రాంతం కలిగిన మన రాష్ట్రంలో 38 లక్షల టన్నుల మొనజైట్‌ నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇది దేశంలోని మొనజైట్‌ నిక్షేపాల్లో 30 శాతం. రాష్ట్రంలోని నిల్వల్లోను ఎక్కువభాగం కళింగపట్నం–భావనపాడు బెల్ట్‌లోనే ఉంది. ఏఎండీ పరిశోధనల ప్రకారం.. కళింగపట్నం డిపాజిట్లలో సగటున 0.5 శాతం మొనజైట్‌ నిల్వలు ఉన్నాయి. అంటే కళింగపట్నం తీరంలో లభించే ప్రతి వెయ్యికిలోల ఇసుకలో ఐదుకిలోల స్వచ్ఛమైన మొనజైట్‌ లభిస్తుంది. ఇది రేర్‌ ఎర్త్‌ ఆక్సైడ్ల (ఆర్‌ఈవో) ఉత్పత్తికి ప్రధాన వనరు. 

మిగిలిన 995 కిలోల ఇసుకలోను టైటానియం తయారీకి వాడే ఇల్మనైట్, రూటైల్‌.. అదేవిధంగా పరిశ్రమల్లో వాడే గార్నెట్, జిర్కాన్‌ వంటి ఇతర విలువైన ఖనిజాలు కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి గార్నెట్‌ నిల్వల్లోను అధునాతన సాంకేతికతలకు అవసరమైన హెవీ రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తల ఎల్రక్టాన్‌ ప్రోబ్‌ మైక్రో అనాలసిస్‌ (ఎప్మా)లో స్పష్టమైందని నివేదికలో పేర్కొన్నారు.  

మొనజైట్‌ని ఎందుకు వినియోగిస్తారంటే..  
ప్రస్తుత ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్న సెమీకండక్టర్లు, ఎల్‌ఈడీలు, మైక్రోప్రాసెసర్లు, సోలార్‌ సెల్స్, లేజర్స్‌ వంటి అత్యాధునిక ఎల్రక్టానిక్స్‌ పరికరాల తయారీలో కీలకమైన ఈ మొనజైట్‌ ఖనిజం అత్యంత కీలకమైనది. ఇందులో ఉండే సరికొత్త రసాయన మూలకాలు సాంకేతిక రంగానికి ప్రాణాధారంగా మారాయి.  

చైనా నుంచి దిగుమతికి ఇకపై చెక్‌  
ప్రపంచవ్యాప్తంగా రేర్‌ ఎర్త్‌ పర్మనెంట్‌ మాగ్నెట్స్‌ (ఆర్‌ఈపీఎం) చిప్‌ల తయారీకి అవసరమైన ముడిసరుకులో 70 నుంచి 80 శాతం వరకు చైనా నుంచే వస్తోంది. భారత్‌ కూడా తన అవసరాల కోసం చైనాపైనే ఆధారపడుతోంది. భారతదేశంలో భారీగా నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని వెలికితీసే సరైన సాంకేతికత, శుద్ధిచేసే పరిశ్రమలు లేవు. చైనా నుంచి దిగుమతులు చేసుకోవడం వల్ల దేశీయంగా తయారీ రంగానికి భారీగా ఖర్చవుతోంది. దీన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 

ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేర్‌ ఎర్త్‌ ప్రాజెక్ట్, నేషనల్‌ క్రిటికల్‌ మినరల్స్‌ మిషన్‌ ద్వారా దేశీయంగానే వీటిని శుద్ధిచేసి వినియోగించుకునేలా ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒడిశా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ఖనిజ కారిడార్లను ఏర్పాటు చేయాలని కేంద్ర బడ్జెట్‌లో నిర్ణయించింది. మైనింగ్, ఖనిజాల శుద్ధి, పరిశోధనలను ప్రోత్సహించడంతోపాటు అత్యంత శక్తిమంతమైన అయస్కాంతాల తయారీ పరిశ్రమలను నెలకొల్పడమే దీని ప్రధాన లక్ష్యం. 

మొనజైట్‌ ఖనిజంలో అణుశక్తికి ఉపయోగపడే థోరియం అనే రేడియోధార్మిక పదార్థం ఉండటం వల్ల దీని వెలికితీత బాధ్యతలను ప్రభుత్వరంగ సంస్థలకే పరిమితం చేసింది. అయితే రాబోయే రోజుల్లో స్పష్టమైన నిబంధనలతో ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆహ్వానించే అవకాశం ఉందని బీ2కే సంస్థ వెల్లడించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement