breaking news
Seaside
-
మొనజైట్ కేరాఫ్ కళింగపట్నం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని సుదీర్ఘ సముద్రతీరం ఇప్పుడు సరికొత్త ఆర్థిక విప్లవానికి వేదిక కాబోతోంది. ముఖ్యంగా అత్యంత అరుదైన, ఖరీదైన ఖనిజాల్లో ఒకటైన మొనజైట్కు కేరాఫ్ అడ్రస్‌గా శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం తీరం ఉందని ప్రముఖ పరిశోధన సంస్థ బీ2కే అనలిటిక్స్ తేల్చింది. కళింగపట్నం తీరంలో దాదాపు 27 కిలోమీటర్ల పొడవున 700 మీటర్ల వెడల్పు మేర విస్తరించి ఉన్న సముద్రతీరంలో ఈ ఖనిజం ఉన్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని తీరప్రాంతంలో మొనజైట్తో పాటు గార్నెట్, ఇల్మనైట్ మొదలైన ఖనిజాలున్నాయి. ఇప్పటివరకు మన దేశం 80 శాతం వరకు మొనజైట్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది.ఇక కేంద్రప్రభుత్వం వ్యూహాత్మకంగా చేపట్టిన రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాజెక్టు ద్వారా కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. బీ2కే అనలిటిక్స్ సంస్థ దేశంలో హెవీ రేర్ ఎర్త్ ఖనిజాల కొరత, వాటి నిల్వలపై ప్రధానంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఐఎస్), అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) జరిపిన భూగర్భ పరిశోధన నివేదికలను, కోర్ శాంప్లింగ్ డేటా ఆధారంగా అధ్యయనం చేసింది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల్లో లభించే మొనజైట్ ఇసుకలో ఎక్కువగా లైట్ రేర్ ఎర్త్ మూలకాలే ఉన్నాయని, ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లు, గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలకు అత్యంత కీలకమైన డిస్పోసియం, టెర్బియం, వంటి హెవీ రేర్ ఎర్త్ మూలకాల వాణిజ్యపరమైన నిల్వలు మనదేశంలో చాలా తక్కువగా ఉన్నాయని గుర్తించింది. ఈ కొరతను కచ్చితంగా అంచనా వేయడానికి దేశీయ పారిశ్రామిక దిగుమతుల రికార్డులను, అంతర్జాతీయ గనుల లభ్యత గణాంకాలను సరిపోలుస్తూ.. రాబోయే కాలంలో ఈవీ రంగం పెరిగే కొద్దీ భారత్‌కు హెవీ రేర్ ఎర్త్ లభ్యత ఎంత సవాలుగా మారుతుందో విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. రాష్ట్రంలో 38 లక్షల టన్నుల మొనజైట్ నిల్వలు 974 కిలోమీటర్ల తీరప్రాంతం కలిగిన మన రాష్ట్రంలో 38 లక్షల టన్నుల మొనజైట్ నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇది దేశంలోని మొనజైట్ నిక్షేపాల్లో 30 శాతం. రాష్ట్రంలోని నిల్వల్లోను ఎక్కువభాగం కళింగపట్నం–భావనపాడు బెల్ట్‌లోనే ఉంది. ఏఎండీ పరిశోధనల ప్రకారం.. కళింగపట్నం డిపాజిట్లలో సగటున 0.5 శాతం మొనజైట్ నిల్వలు ఉన్నాయి. అంటే కళింగపట్నం తీరంలో లభించే ప్రతి వెయ్యికిలోల ఇసుకలో ఐదుకిలోల స్వచ్ఛమైన మొనజైట్ లభిస్తుంది. ఇది రేర్ ఎర్త్ ఆక్సైడ్ల (ఆర్ఈవో) ఉత్పత్తికి ప్రధాన వనరు. మిగిలిన 995 కిలోల ఇసుకలోను టైటానియం తయారీకి వాడే ఇల్మనైట్, రూటైల్.. అదేవిధంగా పరిశ్రమల్లో వాడే గార్నెట్, జిర్కాన్ వంటి ఇతర విలువైన ఖనిజాలు కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి గార్నెట్ నిల్వల్లోను అధునాతన సాంకేతికతలకు అవసరమైన హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తల ఎల్రక్టాన్ ప్రోబ్ మైక్రో అనాలసిస్ (ఎప్మా)లో స్పష్టమైందని నివేదికలో పేర్కొన్నారు. మొనజైట్ని ఎందుకు వినియోగిస్తారంటే.. ప్రస్తుత ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్న సెమీకండక్టర్లు, ఎల్ఈడీలు, మైక్రోప్రాసెసర్లు, సోలార్ సెల్స్, లేజర్స్ వంటి అత్యాధునిక ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీలో కీలకమైన ఈ మొనజైట్ ఖనిజం అత్యంత కీలకమైనది. ఇందులో ఉండే సరికొత్త రసాయన మూలకాలు సాంకేతిక రంగానికి ప్రాణాధారంగా మారాయి. చైనా నుంచి దిగుమతికి ఇకపై చెక్ ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (ఆర్ఈపీఎం) చిప్‌ల తయారీకి అవసరమైన ముడిసరుకులో 70 నుంచి 80 శాతం వరకు చైనా నుంచే వస్తోంది. భారత్ కూడా తన అవసరాల కోసం చైనాపైనే ఆధారపడుతోంది. భారతదేశంలో భారీగా నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని వెలికితీసే సరైన సాంకేతికత, శుద్ధిచేసే పరిశ్రమలు లేవు. చైనా నుంచి దిగుమతులు చేసుకోవడం వల్ల దేశీయంగా తయారీ రంగానికి భారీగా ఖర్చవుతోంది. దీన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేర్ ఎర్త్ ప్రాజెక్ట్, నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ద్వారా దేశీయంగానే వీటిని శుద్ధిచేసి వినియోగించుకునేలా ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒడిశా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ఖనిజ కారిడార్లను ఏర్పాటు చేయాలని కేంద్ర బడ్జెట్లో నిర్ణయించింది. మైనింగ్, ఖనిజాల శుద్ధి, పరిశోధనలను ప్రోత్సహించడంతోపాటు అత్యంత శక్తిమంతమైన అయస్కాంతాల తయారీ పరిశ్రమలను నెలకొల్పడమే దీని ప్రధాన లక్ష్యం. మొనజైట్ ఖనిజంలో అణుశక్తికి ఉపయోగపడే థోరియం అనే రేడియోధార్మిక పదార్థం ఉండటం వల్ల దీని వెలికితీత బాధ్యతలను ప్రభుత్వరంగ సంస్థలకే పరిమితం చేసింది. అయితే రాబోయే రోజుల్లో స్పష్టమైన నిబంధనలతో ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆహ్వానించే అవకాశం ఉందని బీ2కే సంస్థ వెల్లడించింది. -
స్టార్ హీరోలందరూ అలాంటి స్టోరీలతోనే!
ప్రతీకారం కోసం ఒకరు... ఆట కోసం ఇంకొకరు. ప్రేమ కోసమై మరొకరు... ఇలా ఒక్కో కారణం కోసం ఒక్కో స్టార్ తీరప్రాంతాలకు పయనమవుతున్నారు. తీరప్రాంతాల నేపథ్యంలో ఆ తారలు చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. గోవా...కంగువా ఇటీవల విడుదలైన ‘కంగువా’ సినిమా గ్లింప్స్ వీడియోను బట్టి ఈ చిత్రం చారిత్రాత్మక నేపథ్యంతో సాగుతుందని ఊహించవచ్చు. కానీ కథ పరంగా ఈ చారిత్రాత్మక నేపథ్యం సినిమాలో కొంత భాగం వరకే ఉంటుందని, ఈ సినిమా కథ ప్రధానంగా తీరప్రాంతమైన గోవా నేపథ్యంలో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో ‘కంగువా’ సినిమా గోవాలో ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక సూర్య, దిశా పటానీ హీరో హీరోయిన్లుగా శివ దర్శకత్వంలో ‘కంగువా’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘కంగువా’ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది, తొలి భాగం తమిళ సంవత్సరాదికి ఏప్రిల్ 12న విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. గేమ్ స్టార్ట్ సముద్రతీరప్రాంతాల్లో కబడ్డీ ఆడనున్నారట హీరో రామ్‌చరణ్. తొలి చిత్రం ‘ఉప్పెన’తో దర్శకుడిగా ప్రేక్షకుల మెప్పు పొందిన బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వెంకట్ సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇది స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. అలాగే ఈ సినిమా కథ ‘ఉప్పెన’ తరహాలో మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుందట. అందుకే వైజాగ్, కాకినాడ వంటి లొకేషన్స్‌లో ఈ సినిమా మేజర్ షూటింగ్‌ని జరిపేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదు.. కథ రీత్యా ఈ సినిమాలో రామ్‌చరణ్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ అన్నదమ్ముల్లో ఓ పాత్ర దివ్యాంగుడని భోగట్టా. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్న, జాన్వీ కపూర్ వంటివార్ల పేర్లు తెర పైకి వచ్చాయి. వచ్చే ఏడాదిప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ఆరంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తీరప్రాంత దేవర ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రకథ సముద్ర తీరప్రాంతం నేపథ్యంలో ఉంటుందని ఈ సినిమాప్రారంభోత్సవంలో కొరటాల శివ వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. దేశంలో విస్మరణకు గురైన సముద్ర తీరప్రాంతంవారి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. ఇందులో తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎన్టీఆర్ సీన్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా ఉంటాయని టాక్. అలాగే ‘దేవర’ సినిమాకు సంబంధించిన ఓ షూటింగ్ షెడ్యూల్ గోవాలో జరగనుందని తెలిసింది. కాగా ఈ సినిమా ఆరంభం అయిన దగ్గర్నుంచి ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్స్ కెన్నీ బెట్స్, సాల్మోన్, పీటర్ హెయిన్స్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేశారు. ఈ సన్నివేశాలను ఎక్కువగా సెట్స్‌లోనే తీశారు. అయితే మేజర్ యాక్షన్ సీన్స్‌ను తీసిన తర్వాత టాకీ, సాంగ్స్‌పై ఫోకస్ పెడతారట. కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. ప్రేమ తీరం ప్రేమ తీరం చేరేందుకు సముద్రంలో బోటు డ్రైవర్‌గా ప్రయాణం చేయనున్నారట నాగచైతన్య. లవ్‌స్టోరీస్ సినిమాల్లో ఆడియన్స్‌ను ఎక్కువగా అలరిస్తుంటారు నాగచైతన్య. ‘ఏ మాయ చేసావె’, ‘ప్రేమమ్’ వంటి ప్రేమ కథా చిత్రాలతో ఇప్పటికే ఈ విషయాన్ని నాగచైతన్య నిరూపించుకున్నారు. కాగా దర్శకుడు చందు మొండేటి ఇటీవల నాగచైతన్యకు ఓ ప్రేమకథ వినిపించారని, ఇందులో బోటు డ్రైవర్ అయిన మత్స్యకారుడి పాత్రలో నాగచైతన్య నటిస్తారనీ ప్రచారం జరుగుతోంది. సూరత్‌లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. నాగచైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని, ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. -
సిలికాన్ తరలిస్తున్న నాలుగు లారీల పట్టివేత
అధికారయంత్రాంగం పట్టించుకోకున్నా గ్రామస్తులే అప్రమత్తమయ్యారు. తీరప్రాంతం నుంచి అక్రమంగా సిలికాన్‌ను తరలించుకుపోతున్న లారీలను అడ్డుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిల్లకూరు మండలంలో సముద్ర తీరం ప్రాంతంలోని ఇసుక నుంచి సిలికాన్‌ను వేరు చేసి కొందరు అక్రమంగా తరలించుకుపోతున్నారు. దీనిపై సమీప చింతవరం గ్రామస్తులు సోమవారం ఉదయం ఖనిజంతో వెళ్తున్న నాలుగు లారీలను అడ్డుకున్నారు. పోలీసులు, గనుల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు లారీలను సీజ్ చేశారు. -
సాగర తీరంలో భారీ తాబేలు కళేబరం
సముద్ర తీరంలో భారీ తాబేలు కళేబరం ఆదివారం కనిపించింది. అతి భారీ సైజులో ఉన్న ఈ తాబేలును చూసి పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. దీనితో పాటు ఆదివారం ఒక్కరోజే పవిత్ర కృష్ణాసాగరసంగమ ప్రాంతం నుంచి పాలకాయతిప్ప సమీపంలోని సముద్రం వరకు పది తాబేళ్ల కళేబరాలు కనిపించాయి. సముద్రంలో నివసించే ఆలివ్రీడ్లీ జాతికి చెందిన తాబేళ్లు ఇటీవల ఎక్కువ సంఖ్యలో మృతిచెంది తీరానికి కొట్టుకొస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇలా నిత్యం తాబేళ్లు మృతిచెంది తీరానికి కొట్టుకు వస్తుండటంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. - కోడూరు


