మంగళూరు ఎంఆర్‌పీఎల్‌ రిఫైనరీలో భారీ పేలుడు | MRPL Refinery Explosion Blast Rocks Mangaluru Complex 9 Injured | Sakshi
Sakshi News home page

మంగళూరు ఎంఆర్‌పీఎల్‌ రిఫైనరీలో భారీ పేలుడు

Sep 30 2026 4:39 PM | Updated on Sep 30 2026 5:04 PM

MRPL Refinery Explosion Blast Rocks Mangaluru Complex 9 Injured

కర్ణాటకలోని ప్రముఖ చమురు శుద్ధి కర్మాగారం మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్‌) ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం తీవ్రస్థాయి పేలుడు సంభవించింది. రిఫైనరీ యూనిట్‌లోని బాయిలర్ పేలడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రాథమిక కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో కనీసం తొమ్మిది మంది ఉద్యోగులు గాయపడగా, వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలందిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం.

పేలుడు ధాటికి సమీపంలోని జోకట్టె, బాజ్పే, సురత్కల్ సహా పరిసర ప్రాంతాలు తీవ్రంగా కంపించాయి. కొద్ది దూరంలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు అద్దాలు సైతం రాలిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆకాశాన్ని కమ్మేసిన నల్లటి దట్టమైన పొగలు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీతోపాటు కద్రి, పాండేశ్వర్ ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నాయి.

ఈ సంఘటన నేపథ్యంలో ఎంఆర్‌పీఎల్‌ యాజమాన్యం, సాంకేతిక నిపుణుల బృందం ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించింది. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ బ్రిజేష్ చౌతా, స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ప్రమాద వార్త బయటకు రావడంతో ఎంఆర్‌పీఎల్‌ షేర్ల విలువ ఒకేసారి 5 శాతం వరకు క్షీణించింది.

ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement