మమత కారుపైకి రాయిని విసురుతున్న నిరసనకారుడు
బురద, చెప్పులు విసిరి.. దొంగ అంటూ దూషించిన జనం
టీఎంసీ కార్యకర్త కుటుంబ పరామర్శకు వెళ్లగా చేదు అనుభవం
బీజేపీ గూండాలు తనను చంపేసేవాళ్లంటూ మమత ఆగ్రహం
కోల్‌కతా: టీఎంసీ చీఫ్, బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హాలిసహార్‌కు వెళ్తుండగా ఊహించని రీతిలో నిరసన వ్యక్తమైంది. మమత వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చుట్టుముట్టి ‘దొంగ, దొంగల రాణి’అంటూ నినాదాలు చేశారు. ఆమె కారుపైకి బురద, చెప్పులు, రాళ్లను విసిరారు. పోలీసులు లాఠీలు ఝళిపించి, నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం పోలీసు బందోబస్తు నడుమ ఆమె ప్రయాణం తిరిగి కొనసాగించారు.
అనంతరం మమత మీడియాతో మాట్లాడారు. ‘నా కారుపై దాడి జరిగింది. ఇదంతా బీజేపీ కుట్రే. పోలీసుల కళ్లెదుటే బీజేపీ గూండాలు రాళ్లు, ఇటుకలు, చెప్పులు, బురద, నీళ్ల బాటిళ్లు విసిరారు. కారు డోర్లు మూసి ఉండకపోతే నా తల పగిలిపోయి ఉండేది. నేను చచ్చిపోయేదాన్ని. పోలీసులకు నా పర్యటన గురించిన సమాచారం ముందుగానే అందజేశా. అయినప్పటికీ, వారు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. బీజేపీ ప్రభుత్వం గూండాలతో నన్ను లక్ష్యంగా చేసుకుంది’అంటూ ఆమె మండిపడ్డారు. ఇంత తీవ్ర స్థాయి నిరసను మునుపెన్నడూ తాను ఎదుర్కోలేదన్నారు.
పోలీసులపై తనకు ఎలాంటి కోపం లేదన్న ఆమె..ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే జరిగిందని ఆరోపించారు. ‘పోలీసులు రౌడీ మూకలకు రక్షణ కల్పిస్తున్నారు. బెంగాల్ అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తమ పార్టీ చట్టపరంగా పోరాటం చేస్తుందన్నారు. అయితే, రాష్ట్రంలో ఉద్రిక్తతలను తిరిగి రాజేసేందుకే మమత బయటకు వచ్చారని బీజేపీ విమర్శించింది. స్థానికులే ఆమె రాకపై నిరసన తెలిపారని, తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది.


