పగలు లీడర్‌.. రాత్రి స్మగ్లర్‌ | Thota Venkatadri Arrested in Red Sanders Smuggling Case | Sakshi
Sakshi News home page

పగలు లీడర్‌.. రాత్రి స్మగ్లర్‌

Aug 11 2026 5:48 AM | Updated on Aug 11 2026 5:48 AM

Thota Venkatadri Arrested in Red Sanders Smuggling Case

పట్టుబడ్డ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ముఖ్య అనుచరుడు తోట వెంకటాద్రి

సాక్షి టాస్క్‌ఫోర్స్‌/రాజంపేట: ఆదివారం కదా.. పోలీసులు ఎందుకు గస్తీ కాస్తారులే అనుకున్నాడో లేక అధికార పార్టీ పెద్దల అండ ఉందన్న ధైర్యమోగానీ ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ కారులో దుంగలు తరలిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతను ఎవరంటే.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం దిగువ మూల తూముకుంటకు చెందిన తోట వెంకటాద్రి. ఆదివారం రాత్రి అటవీ అధికారులు గస్తీ నిర్వహిస్తుండగా కోటిగేవాండ్లపల్లె దగ్గర పట్టుబడ్డాడు. అతని దగ్గర నుంచి పోలీసులు ఏపీ 26 ఏఎన్‌ 7119 స్కార్పియో వాహనంతో పాటు రూ.2,10,647 విలువగల 409 కిలోల బరువున్న 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని అరెస్టుచేసినట్లు సానిపాయి రేంజ్‌ అధికారి వైసీ రెడ్డి తెలిపారు.

చరిత్రంతా నేరమయం..
ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడిన తోట వెంకటాద్రి చరిత్ర అంతా నేరమయమని తెలుస్తోంది. ఇతను కొన్నేళ్లుగా స్మగ్లింగ్‌ సాగిస్తూ ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా పోలీసులకు చిక్కి అరెస్టయ్యాడు. మదనపల్లె, రేణిగుంట, రాయచోటి ప్రాంతాల్లో ఇతనిపై ఐదు కేసులు నమోదైనట్లు సమాచారం. రాయచోటి పట్టణంలో నివాసముంటున్న వెంకటాద్రి.. తాను ఒక న్యాయవాదినని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. 

పగలంతా టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటాడు. ఇటీవల నిర్వహించిన ‘డోర్‌ టు డోర్‌’ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. రాత్రయితే మాత్రం స్మగ్లర్‌ అవతారమెత్తుతాడు. అయితే, ఎర్రచందనం స్మగ్లర్లపై అటవీశాఖ, పోలీసు అధికారులు సాధారణంగా పీడీ యాక్ట్‌ నమోదుచేస్తుంటారు. కానీ, అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్న తోట వెంకటాద్రి ఇప్పటికే పలుమార్లు పట్టుబడినా అతనిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement