టెహ్రాన్: ఇరాన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలపై పన్ను విధించేందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్‌కు సంబంధించిన మీడియా కథనాలు ఈ కీలక విషయాలు వెల్లడించాయి.
ఆ దేశ మీడియా కథనాల ప్రకారం.. "హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతి ఉన్న దేశాల ఓడల నుండి సముద్రయాన సేవలకు రుసుము వసూలు చేయబడుతుంది రుసుములకు బదులుగా సముద్ర సేవలు, భద్రత మరియు బీమా వంటి సౌకర్యాలు కల్పించబడతాయి.పర్యావరణ సేవలు మరియు, ప్రత్యేక పరిస్థితులలో, ఇంధనం కూడా అందించబడతాయి. చెల్లింపు ఇరానియన్ రియాల్స్‌లో లేదా ఇరాన్ ఎంచుకున్న ఏదైనా ఇతర కరెన్సీలో చేయబడుతుంది". అని తెలిపాయి.కాగా ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. అమెరికా ఇరాన్‌పై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నట్లు తెలిపింది.
ఇరాన్‌పై ఆర్థిక యుద్ధం
ఇరాన్‌పై ట్రంప్ ప్రభుత్వం సాగిస్తున్న ఆర్థిక యుద్ధం ఇప్పుడు తుది దశలోకి ప్రవేశించిందని అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సాంట్ అన్నారు. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరులను నిలిపివేయడమే అమెరికా లక్ష్యమని బెస్సాంట్ తెలిపారు. ఇరాన్‌పై ఒత్తిడిని పెంచడానికి అమెరికా తన ప్రభుత్వ సంస్థలన్నింటినీ, అధికారాలన్నింటినీ వినియోగిస్తుందని బెస్సెంట్ చెప్పారు. దీనిని ఒక శత్రువుపై చేపట్టే అతిపెద్ద ఆర్థిక చర్యగా ట్రంప్ గతంలో అభివర్ణించారు మరియు ఇరాన్‌ను ఏకాకిని చేయడంలో పాలు పంచుకోవాలని ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు.
గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ సైతం గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ఆర్థిక కఠిన చర్యలకు మద్దతు ఇచ్చే గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించడంలో అమెరికాకు మద్దతు ఇచ్చే ఏ దేశాన్నైనా శత్రువుగా పరిగణిస్తామని ఇరాన్ కొత్త జాతీయ భద్రతా అధిపతి మొహ్సెన్ రెజాయీ అన్నారు.
కాగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య హర్ముజ్ అంశంలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ కీలకమైన జలసంధిపై పట్టు సాధించేందుకు అమెరికా యత్నిస్తుంది. ఇప్పుడు ఇరాన్ దానికి టోల్ టాక్స్ వసూలు చేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


