హైదరాబాద్‌కు చెందిన సునీల్ అనే ఉద్యోగి ఇటీవల ఒక ముఖ్యమైన పనిమీద ముంబయికి విమానంలో ప్రయాణించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో బోర్డింగ్ అయ్యేవరకు ఆయన ఫోన్‌లో పూర్తి స్థాయిలో సిగ్నల్ ఉంది. విమానం ముంబయిలో ల్యాండ్ అయిన తర్వాత ఫోన్‌ను ఫ్లైట్ మోడ్ నుంచి సాధారణ మోడ్‌లోకి మార్చగా, సిగ్నల్ పూర్తిగా మాయమైంది. ఫోన్‌ను పలుమార్లు రీస్టార్ట్ చేసినా, ఫ్లైట్ మోడ్ ఆన్-ఆఫ్ చేసినా ఫలితం లేకపోయింది. టెలికాం నెట్‌వర్క్ రాకపోవడంతో రెండు రోజుల పాటు ఆయన ఎలాంటి కాల్స్ మాట్లాడలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరిగి హైదరాబాద్ చేరుకున్న వెంటనే సిగ్నల్ స్వయంచాలకంగా రావడం గమనార్హం.
సునీల్ ఎదుర్కొన్న ఈ సమస్యకు ప్రధాన కారణం ‘నేషనల్ రోమింగ్ నెట్‌వర్క్ సెలక్షన్’, యాక్సెస్ పాయింట్ నేమ్స్ (ఏపీఎన్) సెట్టింగ్స్ లోపం. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణించినప్పుడు కొన్ని టెలికాం నెట్‌వర్క్‌లు తమ భాగస్వామ్య నెట్‌వర్క్‌లకు స్వయంచాలకంగా (ఆటోమేటిక్) కనెక్ట్ కావు. ఇలాంటి రోమింగ్ సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారులు ఆందోళన చెందకుండా క్రింది సాంకేతిక మార్గాలను పాటించాలి.
ఫోన్‌లో చేసుకోవాల్సిన సెట్టింగ్స్
ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Settings -> Mobile Network -> Network Operators ఎంచుకోవాలి.
అక్కడ Automatic ఆప్షన్‌ను డిసేబుల్ (Off) చేస్తే, అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ల జాబితా కనిపిస్తుంది.
మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ లేదా వారి భాగస్వామ్య నెట్‌వర్క్‌ను మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకోవాలి.
డేటా రోమింగ్ ఆన్ చేయడం
రాష్ట్రం దాటిన వెంటనే Settings -> Mobile Network -> Data Roaming ఆప్షన్‌ను తప్పనిసరిగా Enable చేయాలి. ఇది ఆన్‌లో లేకపోతే డేటా సేవలతో పాటు కొన్నిసార్లు నెట్‌వర్క్ సర్వీసు ఆగిపోతుంది.
ఏపీఎన్ సెట్టింగ్స్ రీసెట్
సెట్టింగ్స్‌లో SIM Card-> Mobile Data -> Access Point Names విభాగంలోకి వెళ్లి Reset to Default క్లిక్ చేయాలి. దీనివల్ల స్థానిక నెట్‌వర్క్‌కు తగిన సెట్టింగ్స్ అప్‌డేట్ అవుతాయి.
నెట్‌వర్క్ టైప్ మార్చడం
సిగ్నల్ చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఫోన్ సెట్టింగ్స్‌లో 5G/4G మోడ్ నుంచి 3G లేదా 2Gకి మార్చి చూడాలి. దీనివల్ల కనీసం కాల్స్ మాట్లాడేందుకు సిగ్నల్ అందుతుంది. విమాన ప్రయాణాలు లేదా అంతర్‌రాష్ట్ర ప్రయాణాలు చేసే ముందు వినియోగదారులు తమ సిమ్ కార్డ్‌లో నేషనల్ రోమింగ్ సేవలు యాక్టివ్‌గా ఉన్నాయో లేదో టెలికాం కస్టమర్ కేర్ ద్వారా సరిచూసుకోవడం శ్రేయస్కరం.
ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా బంగారం ధర..


