తిరుపతి: ప్రియుడు ప్రేరేపించడంతోనే భార్య తన భర్త గొంతు కోసినట్లు అంగీకరించిందని ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ముద్దాయిలను అరెస్టు చేసి, విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని నీర్పాకోటలోని పల్లం దళితవాడకు చెందిన భీమయ్య (42), రేవతి (29)కి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. భీమయ్య బెల్దూరి మేస్త్రీగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. భార్య రేవతి గతంలో శ్రీసిటీలోని అపాచీ కంపెనీలో పనిచేసేది. ఆ సమయంలో తొట్టంబేడు మండలం, పొయ్యి గ్రామానికి చెందిన నాగరాజుతో ఆమెకు పరిచయమై, వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి భీమయ్య భార్యపై అనుమానం పెంచుకుని కంపెనీకి వెళ్లకుండా పని మాని్పంచాడు. ఆరు నెలలుగా రేవతి ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 24వ తేదీ భీమయ్య మద్యం మత్తులో భార్యతో గొడవపడగా బంధువులు సర్దిచెప్పారు.
ఆ సమయంలో ప్రియుడు నాగరాజుకు రేవతి ఫోన్ చేసి తన భర్తను చంపాలని నిర్ణయింది. అతని సలహా మేరకు రాత్రికి భీమయ్య గొంతు బ్లేడుతో కోసేయాలని రేవతిని ప్రేరేంపించాడు. భీమయ్య నిద్రపోతుండగా అర్ధరాత్రి రాత్రి 1.30 గంటల ప్రాంతంలో భార్య రేవతి షేవింగ్ బ్లేడ్‌తో భర్త భీమయ్య గొంతు కోసింది. ఆ తర్వాత బంధువులకు ఫోన్ చేసి ఎవరో తన భర్త గొంతు కోశారని నమ్మబలికింది. ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం తేలింది. భర్తను తానే బ్లేడుతో కోశానని అంగీకరించింది. ప్రస్తుతం భీమయ్య రేణిగుంట సమీపంలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ మేరకు 307 సేక్షన్ కింద రేవతి, ఆమె ప్రియుడు నాగరాజుపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచనున్నట్లు హరిప్రసాద్ తెలిపారు.


