అమ్మా నాన్నా.. సారీ! | Polavaram 10th Class Girl Shivani Incident, Heartbreaking Suicide Note Viral On Social Media | Sakshi
Sakshi News home page

అమ్మా నాన్నా.. సారీ!

Jul 28 2026 9:25 AM | Updated on Jul 28 2026 10:12 AM

Polavaram 10th Class Girl Shivani Incident

సూసైడ్‌ నోట్‌లో సారాంశం 

అమ్మా నన్ను క్షమించు..  
నా కోసం చాలా కష్టపడ్డావ్‌.. 
డాడీ నీ డ్రీమ్‌ నిలబెట్టలేకపోతున్నా..  
నా డ్రీమ్‌ కూడా పూర్తిచేయలేకపోతున్నా.. 
అమ్మా నాన్నా నాకు బతకాలని ఉంది.  
కానీ, బతకడానికి చాలా సిగ్గుగా ఉంది.  
అమ్మా నీ కోసం నేనేం చెయ్యలేదు.  
నాన్న నేను నీకు ఏదైనా సాధించి 
చూపించాలని ఉంది.  
కానీ నేను ఇంతకు మించి 
తట్టుకోలేకపోతున్నా..  
ఈ బాధ ఒక్కదానిని 
మోయడం నా వల్ల కావట్లేదు. 
నేను చనిపోయాక 
నాపై ఎవరూ కోప్పడకండి.  
డాడీ నన్ను మీరు ఎప్పుడూ 
లవ్‌ చేస్తూ ఉండండి.  
అమ్మా బై.. అమ్మమ్మ జాగ్రత్త.  
అన్నయ్య డాడీ మాట విని 
జాగ్రత్తగా ఉండు. 
అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ 
ఎప్పటికైనా కలవండి, 
ద్వేషించుకోకండి..  ఇక ఉంటా..  

రంపచోడవరం:  ఆ చిన్నారి తల్లడిల్లిపోయింది.. గుండె నిండా బాధతో, బరువెక్కిన హృదయంతో బలవన్మరణానికి పాల్పడింది.. గిరిసీమలో ఓ విద్యాకుసుమం నేలకొరిగింది.. ఇటీవల మెగా పేరెంట్స్, టీచర్స్‌ సభలో తన ప్రసంగంతో మెప్పించి, సీఎం చంద్రబాబు సైతం అబ్బురపడి తన పక్కన కూర్చోబెట్టుకుని మరీ సెల్ఫీ తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో షైనింగ్‌ స్టార్‌గా మెరిసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పతకం, ప్రశంసా పత్రాన్ని అందుకున్న శివాని అనుకోని విధంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఏజెన్సీలో విషాదం అలముకొంది.  

ఇర్లపల్లిలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ముర్రం శివాని రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లి సౌభాగ్యవతి, తండ్రి వరప్రసాద్‌లు నాలుగేళ్ల క్రితమే విడిపోయారు. దీంతో శివాని అప్పుడప్పుడూ గోకవరం మండలం బావాజీపేటలో తండ్రి వద్దకు వెళ్లి వస్తూండేది. ఆదివారం పుట్టిన రోజు కావడంతో తండ్రి వద్దకు వెళ్లి సాయంత్రం ఆరు గంటలకు ఇర్లపల్లిలో ఇంటికి వచ్చింది. తల్లి సౌభాగ్యవతి వెదురుపాకలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. 

ఒక్కోసారి ఆమె అక్కడే ఉంటుంటారు. తల్లి లేని సమయంలో శివాని, అమ్మమ్మ బాలమ్మలు ఇద్దరే ఇంటి వద్ద ఉంటారు. బావాజీపేటలో తండ్రి వద్దకు వెళ్లి తిరిగి ఆరు గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత గదిలోకి వెళ్లి రాసుకుంటానని అమ్మమ్మకు చెప్పింది. సోమవారం ఉదయం అమ్మమ్మ ఆ గది తలుపు తీసి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ ఉండడంతో కేకలు వేయడంతో, చుట్టుపక్కల వారు వచ్చి బాలికను కిందకు దింపారు. అప్పటికే శివాని మృతిచెంది ఉండడంతో ఆదివారం రాత్రే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.  

డాడీ ఇంటికెళ్లిపోయా.. అదే చివరి మాట 
తన కుమార్తె శివాని మృతి తండ్రి వరప్రసాద్‌ను కలిచివేసింది. ఆదివారం సెలవు డాడీ వస్తానని చెప్పిందని, రా తల్లీ అన్నానని ఆయన వివరించారు. నేను గోకవరం సమీపంలోని అష్టలక్ష్మి గుడి సమీపంలోని బిర్యానీ పాయింట్‌ నిర్వహిస్తున్నాను.. సాయంత్రం వరకూ తన దగ్గరే ఉంది. నా చిట్టి తల్లి ముఖంలో ఎటువంటి బాధ కనిపించలేదు. పచ్చకామెర్లు వచ్చి తగ్గడంతో ఉత్తి బిర్యానీ తినమని చెప్పాను.. అదే తింది. సీఎంతో ఫొటో తీయించుకున్నావు, బాగా మాట్లాడవు అన్నాను. డాడీ నీ పరువు నిలబెడతానని చెప్పింది. చీకటి పడుతుంది ఉండిపో తల్లీ అన్నాను. వెళ్లిపోతానని చెప్పింది. మా చిన్నోడు బన్నీతో కలసి గోకవరం బస్‌ కాంప్లెక్స్‌లో దింపాను. గోకవరంలో చాక్లెట్‌ కావాలంది. కొనుక్కోమని డబ్బులు ఇచ్చాను. మధ్యలో ఫోన్‌ చేశాను దారిలో ఉన్నాను డాడీ అని చెప్పింది. తరువాత ఇంటికి వచ్చానని చెప్పింది. అవే చివరి మాటలని తండ్రి వరప్రసాద్‌ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏ బాధ ఉండో చెప్పలేదు, ఏ కష్టం ఉందో చెప్పలేదు.. ఎందుకు చనిపోయిందో తెలియడం లేదు. బాధతో చనిపోయింది.. ఇప్పుడు నా ప్రాణమే పోయిందని వరప్రసాద్‌ రోదించారు.  

లోపం ఎక్కడుంది? 
పసిపిల్లల్లో.. బలవన్మరణానికి చాలా ధైర్యం కావాలి. ఏం సాధించలేక పోతున్నాననే ఆలోచన ఆ పసి మనసులో, ఆ వయసులోనే రావడం అంటే... అది మన వ్యవస్థలోనే లోపం ఉన్నట్టు కాదా..! మన విద్యా వ్యవస్థ, ఇటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకొనే వారికి... ఎలాగైనా బతికగలం అన్న నమ్మకాన్ని ఎందుకు ఇవ్వలేక పోతోంది... చదువు అంటే... ర్యాంకులు, గ్రేడ్లు, మార్కులు మాత్రమే కాదు.. అనే అంశాన్ని ఆ పసి మనసులకు అర్థమయ్యేలా ఎందుకు వివరించలేకపోతోంది..? లోపం ఎవరిది...? ఎక్కడుంది.   

పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తాం: కలెక్టర్‌ 
రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని బలవన్మరణం అత్యంత బాధాకరమని కలెక్టర్‌ కె. దినేష్‌ కుమార్‌ అన్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో శివాని మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ దినేష్‌ కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ సురపాటి ప్రశాంత్‌ కుమార్, రంపచోడవరం రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె.స్వాతి, సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారి అశ్రఫ్‌ అలీతో కలసి శివాని మృతికి సంబంధించిన పరిస్థితులు, ఘటనకు దారితీసిన కారణాలపై సమీక్ష నిర్వహించారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. మంచి భవిష్యత్తు ఉన్న విద్యారి్థని ఇలా మృతి చెందడం అత్యంత విషాదకరమని అన్నారు.  

బాలిక మృతిపై కేసు నమోదు 
శివాని ఆత్మహత్యపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రమేష్‌ తెలిపారు. సంఘటన స్థలంలో సూసైట్‌ నోట్, సెల్‌ఫోన్‌ స్వాదీనం చేసుకున్నామని అన్నారు. తల్లి బంధువుల ఫంక్షన్‌కు వెళ్లడంతో అమ్మమ్మ, బాలిక మాత్రమే ఇంటి వద్ద ఉన్నారన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తు తెలియాల్సి ఉందని వివరించారు. కుటుంబ కలహాలు ఏమీ లేవని అన్నారు.

విద్యార్థిని మృతి బాధాకరం 
ఇర్లపల్లి గ్రామానికి చెందిన ముర్రం శివాని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఇర్లపల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి వెళ్లి శివాని మృతదేహానికి పూలమాలు వేసి నివాళులరి్పంచి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు పండా వెంకటలక్షి్మ, ఎంపీపీ బంధం శ్రీదేవి, మండల పార్టీ అధ్యక్షుడు జల్లేపల్లి రామన్నదొర, పండా రామకృష్ణదొర, మాజీ సర్పంచ్‌లు మంగా బొజ్జయ్య, రమేష్‌ దొర, బొజ్జయ్య, ఆనందరెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు బొబ్బా శేఖర్, డొక్కులూరి రత్నరాజు తదితరలు ఉన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement