‘వావ్‌’రింకా... | Stanislas Wawrinka holds the record for playing the most five set matches in Grand Slam tournaments | Sakshi
Sakshi News home page

‘వావ్‌’రింకా...

Jan 23 2026 3:44 AM | Updated on Jan 23 2026 3:44 AM

Stanislas Wawrinka holds the record for playing the most five set matches in Grand Slam tournaments

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో అత్యధిక ఐదు సెట్‌ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రికార్డు

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరిన స్విట్జర్లాండ్‌ వెటరన్‌ స్టార్‌

1978 తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మూడో రౌండ్‌ చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగా ఘనత

మెల్‌బోర్న్‌: నాలుగు పదుల వయసు దాటినా తనలో సత్తా తగ్గలేదని స్విట్జర్లాండ్‌ వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ స్టానిస్లాస్‌ వావ్రింకా నిరూపించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ‘వైల్డ్‌ కార్డు’తో బరిలోకి దిగిన మాజీ చాంపియన్‌ మరో అద్భుత విజయంతో మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో వావ్రింకా 4–6, 6–3, 3–6, 7–5, 7–6 (10/3)తో క్వాలిఫయర్‌ ఆర్థర్‌ గియా (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. 

తద్వారా కెన్‌ రోజ్‌వాల్‌ (ఆ్రస్టేలియా–1978లో 44 ఏళ్లు) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మూడో రౌండ్‌కు చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగా వావ్రింకా (40 ఏళ్ల 296 రోజులు) గుర్తింపు పొందాడు. అంతేకాకుండా 1987లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో 128 మందితో ‘డ్రా’ రూపొందించడం మొదలయ్యాక ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన అతిపెద్ద వయసు్కడిగానూ వావ్రింకా ఘనత వహించాడు. 

దాంతోపాటు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల చరిత్రలో అత్యధిక ఐదు సెట్‌ల మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గానూ వావ్రింకా రికార్డు నెలకొల్పాడు. ‘గ్రాండ్‌’ టోర్నీల్లో వావ్రింకా ఐదు సెట్‌ల మ్యాచ్‌లు ఆడటం ఇది 49వసారి కాగా... స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ (48 సార్లు) పేరిట ఉన్న రికార్డును వావ్రింకా బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో నొవాక్‌ జొకోవిచ్‌ (47 సార్లు), లీటన్‌ హెవిట్‌ (45 సార్లు), ఫెర్నాండో వెర్డాస్కో (45 సార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా వావ్రింకా కెరీర్‌లో ఐదు సెట్‌ల మ్యాచ్‌లు ఆడటం ఇది 58వసారి. 

ఇది కూడా రికార్డే. ఇందులో అతను 31 సార్లు గెలిచి, 27 సార్లు ఓడిపోయాడు. ఈ ఏడాది తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్న వావ్రింకాకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు ‘వైల్డ్‌ కార్డు’ కేటాయించారు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా తన శక్తినంతా ధారపోసి ఆడుతున్న వావ్రింకాకు మూడో రౌండ్‌లో కఠినపరీక్ష ఎదురుకానుంది. మూడో రౌండ్‌లో తొమ్మిదో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)తో వావ్రింకా తలపడతాడు. 

ఆర్థర్‌ గియాతో జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా 11 ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 63 విన్నర్స్‌ కొట్టడంతోపాటు 69 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. నిర్ణాయక ఐదో సెట్‌ ‘సూపర్‌ టైబ్రేక్‌’లో వావ్రింకా పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. 

జొకోవిచ్‌ 399వ విజయం 
పురుషుల సింగిల్స్‌లోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్‌లో సినెర్‌ 6–1, 6–4, 6–2తో జేమ్స్‌ డక్‌వర్త్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. 10సార్లు చాంపియన్, మాజీ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–3, 6–2, 6–2తో ఫ్రాన్సిస్కో మెస్ట్రెలి (ఇటలీ)పై నెగ్గాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో జొకోవిచ్‌కిది 399వ విజయం. 

మరో మ్యాచ్‌లో గెలిస్తే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో పురుషుల సింగిల్స్‌లో 400 విజయాలు నమోదు చేసుకున్న తొలి ప్లేయర్‌గా జొకోవిచ్‌ రికార్డు సృష్టిస్తాడు. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ ముసెట్టి (ఇటలీ) 6–3, 6–3, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై, ఎనిమిదో సీడ్‌ బెన్‌ షెల్టన్‌ (అమెరికా) 6–3, 6–2, 6–2తో స్వీనీ (ఆ్రస్టేలియా)పై, టేలర్‌ ఫ్రిట్జ్‌ 6–1, 6–4, 7–6 (7/4)తో విట్‌ కొప్రివా (చెక్‌ రిపబ్లిక్‌)పై, 12వ సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) 6–3, 7–5, 6–4తో మునార్‌ (స్పెయిన్‌)పై గెలిచారు.  

నిశేష్‌ నిష్క్రమణ 
వరుసగా రెండో ఏడాది ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో ఆడిన తెలుగు సంతతికి చెందిన అమెరికన్‌ ప్లేయర్‌ నిశేష్‌ బసవారెడ్డి పోరాటం ముగిసింది. రెండో రౌండ్‌లో నిశేష్‌ 1–6, 4–6, 3–6తో 15వ సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరిన నిశేష్‌ 1 గంట 57 నిమిషాల్లో ఖచనోవ్‌ చేతిలో ఓటమి చవిచూశాడు. 

10 ఏస్‌లు సంధించిన నిశేష్, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 31 విన్నర్స్‌ కొట్టి, 37 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్‌ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు గెలిచిన నిశేష్‌ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. రెండో రౌండ్‌లో ఓడిన నిశేష్‌ కు 2,25,000 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 1 కోటీ 40 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

‘మిక్స్‌డ్‌’లో యూకీ జోడీ ఓటమి 
భారత డబుల్స్‌ నంబర్‌వన్‌ యూకీ బాంబ్రీకి మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లో యూకీ (భారత్‌)–నికోల్‌ మెలిచార్‌ మారి్టనెజ్‌ (అమెరికా) ద్వయం 6–3, 1–6, 6–10తో ఆరో సీడ్‌ టిమ్‌ పుట్జ్‌ (జర్మనీ)–జాంగ్‌ షుయె (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.

పదో సీడ్‌ బెన్‌చిచ్‌ అవుట్‌ 
మహిళల సింగిల్స్‌ విభాగంలో పదో సీడ్‌ బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌) రెండో రౌండ్‌లో నిష్క్రమించగా... డిఫెండింగ్‌ చాంపియన్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా), రెండో ర్యాంకర్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌), మాజీ విజేత నయోమి ఒసాకా (జపాన్‌) మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. బెన్‌చిచ్‌ 3–6, 6–0, 4–6తో క్వాలిఫయర్‌ నికోలా బర్తున్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓడిపోయింది. 

కీస్‌ 6–1, 7–5తో ఆష్లిన్‌ క్రుగెర్‌ (అమెరికా)పై, స్వియాటెక్‌ 6–2, 6–3తో బుజ్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, ఒసాకా 6–3, 4–6, 6–2తో సొరానా కిర్‌స్టియా (రొమేనియా)పై నెగ్గారు. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ అనిసిమోవా (అమెరికా) 6–1, 6–4తో సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, ఐదో సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌) 7–5, 6–2తో వర్వరా గ్రాచెవా (ఫ్రాన్స్‌)పై, ఆరో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా) 6–0, 6–2తో మెకార్ట్‌నీ కెస్లెర్‌ (అమెరికా)పై గెలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement