గ్రాండ్‌స్లామ్‌లో రికార్డు విజయం
ప్రిక్వార్టర్స్‌లో సెర్బియా దిగ్గజం
ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్‌బోర్న్: స్టార్ ఆటగాడు, వరల్డ్ మాజీ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో ఈ సెర్బియా దిగ్గజం ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 6–3, 6–4, 7–6 (7/4)తో బాటిల్ వాన్ డి జాండ్‌షల్ప్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును అతను తన ఖాతాలో వేసుకున్నాడు.
గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లో జొకోవిచ్‌కు ఇది 400వ విజయం కావడం విశేషం. దీంతో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధిక మ్యాచ్‌లు నెగ్గిన రోజర్ ఫెడరర్ (102 మ్యాచ్‌లు) రికార్డును కూడా అతను సమం చేశాడు. వరల్డ్ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) కూడా ముందంజ వేశాడు. తీవ్ర వేడి కారణంగా అలసటకు గురై ఇబ్బంది పడిన సినెర్ చివరకు విజయాన్ని దక్కించుకున్నాడు.
మూడో రౌండ్‌లో అతను 4–6, 6–3, 6–4, 6–4తో ఇలియట్ స్పిజారి (అమెరికా)పై గెలుపొందాడు. తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిజ్ (అమెరికా) మూడో రౌండ్‌లో 7–6 (7/5), 2–6, 6–4, 6–4తో వావ్రింకా (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. మహిళల విభాగంలో రెండు సార్లు విజేత నవోమీ ఒసాకా (జపాన్) గాయంతో మూడో రౌండ్‌కు ముందు టోర్నీనుంచి తప్పుకుంది.
ఇతర మ్యాచ్‌లలో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) 6–1, 1–6, 6–1తో కలిన్సకయా (రష్యా)పై, మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–3తో ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై, పెగులా 6–3, 6–2తో సలెక్‌మెన్‌టొవా (రష్యా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరారు.
యూకీ బాంబ్రీ ముందంజ...
పురుషుల డబుల్స్ భారత ఆటగాడు యూకీ బాంబ్రీ మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. బాంబ్రీ – ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) తమ రెండో రౌండ్ పోరులో 4–6, 7–6 (7/5), 6–3తో సాంటియాగో గొనాలెజ్ – డేవిడ్ పెల్ జంటపై విజయం సాధించారు. అయితే మరో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ పరాజయంతో ని్రష్కమించాడు. రెండో రౌండ్‌లో బాలాజీ – నీల్ ఒబర్‌లీనర్ (ఆ్రస్టేలియా) 5–7, 1–6తో నాలుగో సీడ్ మార్సెల్ అరెవాలో – మేట్ పావిక్ చేతిలో ఓటమి పాలయ్యారు.


