మూడో రౌండ్‌లోకి ప్రపంచ నంబర్‌వన్
రెండో రౌండ్‌లోనూ వరుస సెట్‌లలో విజయం
శ్రమించి గెలిచిన జ్వెరెవ్, మెద్వెదెవ్
మెల్‌బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ అల్‌కరాజ్ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ అల్‌కరాజ్ 7–6 (7/4), 6–3, 6–2తో యానిక్ హాంఫ్‌మన్ (జర్మనీ)పై గెలిచాడు.
2 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ స్టార్ 12 ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సర్వీస్‌లో 71 పాయింట్లకు 49... రెండో సర్వీస్‌లో 40 పాయింట్లకు 24 సాధించాడు. 41 విన్నర్స్ కొట్టిన అతను 30 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.
ఇప్పటికే ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన అల్‌కరాజ్... ఆ్రస్టేలియన్ ఓపెన్ కూడా సాధిస్తే ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకుంటాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా), పదో సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్), 11వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా), 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) కూడా మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.
రెండో రౌండ్‌లో జ్వెరెవ్ 6–3, 4–6, 6–3, 6–4తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)పై, డిమినార్ 6–7 (5/7), 6–2, 6–2, 6–1తో హమాద్ మెజెదోవిచ్ (సెర్బియా)పై, బుబ్లిక్ 7–5, 6–4, 7–5తో ఫుచువోచిస్ (హంగేరి)పై, మెద్వెదెవ్ 6–7 (9/11), 6–3, 6–4, 6–2తో క్వెంటిన్ హేలిస్ (ఫ్రాన్స్)పై, రుబ్లెవ్ 6–4, 6–3, 4–6, 7–5తో క్వాలిఫయర్ జేమీ ఫారియా (పోర్చుగల్)పై విజయం సాధించారు.
ఇతర మ్యాచ్‌ల్లో 14వ సీడ్ డేవిడోవిచ్ ఫోకినా (స్పెయిన్) 6–3, 7–6 (7/3), 5–7, 4–6, 6–4తో రీలీ ఒపెల్కా (అమెరికా)పై, 19వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 6–3, 6–4, 6–2తో టిరాన్‌టి (అర్జెంటీనా)పై నెగ్గారు.
సబలెంకా సాఫీగా...
మహిళల సింగిల్స్ విభాగంలో రెండుసార్లు చాంపియన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్‌లో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 72 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సబలెంకా 6–3, 6–1తో జావోజువాన్ బాయ్ (చైనా)పై గెలిచింది.
మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ), ఎనిమిదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా), 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కోకో గాఫ్ 6–2, 6–2తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై, పావోలిని 6–2, 6–3తో మగ్ధలీనా ఫ్రీచ్ (పోలాండ్)పై, మిరా ఆంద్రీవా 6–0, 6–4తో మరియా సాకరి (గ్రీస్)పై, స్వితోలినా 7–5, 6–1తో లిండా క్లిమోవికోవా (పోలాండ్)పై గెలుపొందారు.


