పాకిస్తాన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు | Pakistan accused of match fixing in Under 19 World Cup 2026 | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు

Jan 23 2026 6:32 PM | Updated on Jan 23 2026 6:48 PM

Pakistan accused of match fixing in Under 19 World Cup 2026

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుపై మరోసారి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. అండర్‌-19 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో జరిగిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఫిక్స్‌ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. 

ఈ మ్యాచ్‌లో పాక్‌ 8 వికెట్ల తేడాతో, 181 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనతో జింబాబ్వే సూపర్ సిక్స్‌కు అర్హత సాధించగా.. స్కాట్లాండ్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 35.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్‌ 26.2 ఓవర్లలో ఛేదించింది. వాస్తవానికి పాక్‌ ఈ లక్ష్యాన్ని 20 ఓవర్లలోపే ఛేదించి ఉండవచ్చు. ఇలా జరిగితే జింబాబ్వే ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించి, స్కాట్లాండ్‌ తదుపరి దశకు అర్హత సాధించేది.

అయితే, ఇలా జరగడం పాక​్‌కు వ్యూహాత్మకంగా కరెక్ట్‌ కాదు. అందుకే ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడి జింబాబ్వేకి లబ్ది చేకూర్చి, వారు కూడా లబ్ది పొందారు. 16వ ఓవర్లోనే 96 పరుగులు చేసిన పాక్‌.. 16 నుంచి 25 ఓవర్ల మధ్యలో ఏకంగా 50 డాట్ బాల్స్ ఆడి, విజయాన్ని ఆలస్యం చేసింది.

పాక్‌కు కలిగే లబ్ది ఏ​ంటి.. టోర్నీ నియమాల ప్రకారం సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధించిన జట్టు, అదే గ్రూప్‌ నుంచి సూపర్‌ సిక్స్‌కు క్వాలిఫై అయిన మిగతా జట్లపై సాధించిన పాయింట్లు, నెట్‌ రన్‌రేట్‌ను మాత్రమే సూపర్ సిక్స్‌కి తీసుకెళ్లుంది.

ఈ లెక్కన జింబాబ్వేతో పోలిస్తే స్కాట్లాండ్‌ సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధిస్తే పాక్‌కు రన్‌రేట్‌ కాస్త తక్కువవుతుంది. అందుకనే చాకచక్యంగా స్కాట్లాండ్‌ను సైడ్‌ చేసి, జింబాబ్వేకు, తమకు లబ్ది చేక్చూకుంది.

పాక్‌ చేసిన ఈ పని అవినీతి కిందికి రాకపోయిన ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని ప్రభావితం చేసిన ప్రక్రియ కిందికి వస్తుంది. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లోని ఆర్టికల్‌ 2.11 ప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని మార్చి, నెట్‌ రన్‌రేట్‌ను ప్రభావితం చేస్తే కెప్టెన్‌పై చర్యలు తీసుకోవచ్చు. 

పై ఉదంతంలో పాక్‌ చేసింది అవినీతి కిందికి రాకపోయినా, ఆట ఆత్మను దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతుంది. అందువల్ల పాకిస్తాన్‌పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.  

కాగా, గ్రూప్‌-సి నుంచి పాక్‌, జింబాబ్వేతో పాటు ఇంగ్లండ్‌ కూడా తదుపరి దశకు అర్హత సాధించింది. తదుపరి దశలో పాక్‌ భారత్‌తో తలపడనుంది. భారత్ జనవరి 24న జింబాబ్వేపై గెలిస్తే, ఫిబ్రవరి 1న బులావయోలో పాకిస్తాన్–భారత్ పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ సెమీఫైనల్స్ అర్హతను నిర్ణయించే కీలక పోరాటంగా భావిస్తున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement