టి20 వరల్డ్ కప్‌నుంచి తప్పించిన ఐసీసీ
భారత్‌లో ఆడేందుకు నిరాకరించడంతో చర్య
టోర్నీ బరిలో దిగనున్న స్కాట్లాండ్
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా తమ మ్యాచ్‌లను భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. బంగ్లా టీమ్‌ను వరల్డ్ కప్‌నుంచి తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది భద్రతకు హామీ ఇస్తూ ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ మంకు పట్టు వీడలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్‌పై ఐసీసీ వేటు వేసింది.
ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్ ఈ టోర్నమెంట్‌లో బంగ్లా స్థానంలో బరిలోకి దిగుతుంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు మద్దతు పలికింది. దాంతో వేటు లాంఛనంగానే మారింది.
టీమ్‌ను వరల్డ్ కప్‌ను తొలగిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ శుక్రవారం బీసీబీకి తెలియజేసింది. ఐసీసీలోని ఇతర సభ్య దేశాలకు కూడా ఈ సమాచారం అందించింది. టోర్నీకి దూరం కావడం బంగ్లా బోర్డుపై ఆరి్థ కపరంగా కూడా తీవ్ర ప్రభావం చూపించనుంది. వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు ఇచ్చే 5 లక్షల డాలర్లతో పాటు ఐసీసీనుంచి ప్రతీ ఏటా అందే 27 మిలియన్ డాలర్లు కోల్పోనుంది.
బంగ్లా నిష్క్రమణ నేపథ్యమిదీ...
తాజా పరిణామాలను బట్టి చూస్తే వరల్డ్ కప్‌కు దూరం కావడం బంగ్లా స్వయంకృతమే. ఐపీఎల్ వేలంలో బంగ్లా పేసర్ ముస్తఫిజుర్ రహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 9.50 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఆటగాడిని ఐపీఎల్‌లో ఆడించాలనే ఆలోచనపై భారత్‌లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.
వీటికి స్పందిస్తూ కేకేఆర్ యాజమాన్యం ముస్తఫిజుర్‌ను లీగ్ నుంచి తప్పించింది. తమ ఆటగాడిని అర్ధాంతరంగా తొలగించడం బీసీబీకి నచ్చలేదు. దీనిని ఆ దేశ బోర్డు ఒక రకమైన అవమానంగా భావించింది. దాంతో భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత లేదంటూ కొత్త విషయాన్ని ముందుకు తెచ్చింది. టి20 వరల్డ్ కప్‌లో తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది.
ఈ అంశంపై స్పందించిన ఐసీసీ బంగ్లాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. టోర్నీకి చాలా తక్కువ సమయం ఉండటంతో ఇప్పుడు షెడ్యూల్ మార్పు సాధ్యం కాదని స్పష్టం చేసింది. భారత్‌లో ఆ దేశపు ఆటగాళ్లు, మీడియా, ఇతర సిబ్బందికి ఎలాంటి సమస్య రాకుండా అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు.


