టీ20 ప్రపంచకప్-2026 నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ హై–వోల్టేజ్ పోరుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే, పాక్ జట్టు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే మిగతా ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో పాల్గొంటుందని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్‌ను కలిసిన కొన్ని గంటల తర్వాత వెలువడింది. పాక్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఇరు దేశాల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
భారత్-పాక్ ఇప్పటివరకు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడేవి. ఇప్పుడు అది కూడా లేకపోవడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా కలిచి వేస్తుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐసీసీ ఏరకంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
భారత్-పాక్ మ్యాచ్ రద్దు వల్ల అభిమానులకే కాదు, వాణిజ్యానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య రాజకీయ, ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
కాగా, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. ఇప్పుడు పాక్ కూడా అదే కారణాన్ని సాకుగా చూపుతూ భారత్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ మొత్తం ఎపిసోడ్ ఇటీవలికాలంలో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో మొదలైంది. ఈ కారణంగా బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించగా.. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్ భారత్‌లో జరగాల్సిన లీగ్ మ్యాచ్‌లు ఆడమని భీష్మించుకు కూర్చుంది.
వేదికలను శ్రీలంకకు మార్చాలని కోరగా ఐసీసీ ససేమిరా అంది. ఈ విషయంలో పాక్ బంగ్లాదేశ్‌కు మొదటి నుంచి వంత పాడుతూ వచ్చింది. బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి వైదొలగడంతో స్కాట్లాండ్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. కాగా, ప్రపంచకప్‌లో పాక్ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనున్న విషయం తెలిసిందే. భారత్-పాక్ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే షెడ్యూలై ఉండింది.


