breaking news
supply channel works
-
నిర్లక్ష్యం నీడన.. ఐదేళ్ల పాలన
సాక్షి, కందుకూరు రూరల్ (ప్రకాశం): రైతులకు పెద్దపీట వేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకున్న పాపాన పోలేదు. పొరపాటున వర్షాలు కురిస్తే చెరువులకు పుష్కలంగా నీరు చేరేందుకు అవకాశం ఉన్న సప్లయ్ ఛానల్ పెండింగ్ పనుల గురించి అసలు పట్టించుకోలేదు. కానీ చెరువులో పూడిక తీత తీసేందుకు మాత్రం నీరు చెట్టు పథకం తీసుకొచ్చారు. నామినేటెడ్ కింద కట్టపెట్టిన ఈ పనులు టీడీపీ కార్యకర్తలు పండగ చేసుకున్నారు. మోపాడు చెరువుకు పూడికతీత పేరుతో లక్షల రూపాయిలు మంజూరు చేసి కార్యకర్తలకు కట్టపెట్టారు. కానీ వర్షాలు పడితే సప్లయ్ ఛానల్ ద్వారా పనుల్లో అభివృద్ధి మాట ఎక్కడ వినిపించ లేదు. దీనిన బట్టి చూస్తే అర్థమవుతుంది రైతులపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో.. మహీధర్‌రెడ్డి హయంలో చకచక పనులు.. లింగసముద్రం మండలంలో వీఆర్‌కోట వద్ద మన్నేరుపై మోపాడు చెరువుకు కాలువు ఏర్పాటు 2011లో రూ.8.12 కోట్లు నిధులు మంజూరు చేశారు. 20.6 కిలో మీటర్లు మేర కాలువు నిర్మాణం జరగాలి. దీని కూడా ప్రస్తుత కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్‌రెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలోనే చకచకా పనులు సాగాయి. కానీ పొలాల మధ్యలో బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని కొందరు రైతులు కోరడంతో అక్కడక్కడ పనులు కాలువ పనులు పెండింగ్‌లో నిలిచిపోయాయి. పెండింగ్ పనులు కూడా పూర్తి చేసేందుకు 2013లో మరో రూ.1.99 కోట్లు మంజూరు చేశారు. ఇలా పనులు జరుగుతుండగానే అనాటి ప్రభుత్వ కాలం ముగిసింది. రాష్ట్ర విభజన, నిధుల కొరత తదితర కారణాల వల్ల పనలు నిలిచిపోయాయి. ఆ తర్వాత 2104లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ పాలనలో నత్తనడక పనులు.. సప్లయ్ ఛానల్ పెండింగ్ పనులు పూర్తి చేసి మోపాడు చెరువకు నీరు వచ్చేలా చేస్తామని టీడీపీ ప్రభుత్వం, నాయకులు రైతులకు యామ మాటలు చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సప్లయ్ ఛానల్ పనులు ఒక్కటి కూడా మొదలుపెట్టలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఆ పనులు ఊసే ప్రస్థావనకు తీసుకురాలేదు. వీఆర్‌కోట వద్ద ఉన్న ఆనకట్ట కేవలం పూనాదికి గుంట తీసేరే తప్పా పనులు ప్రారంభించలేదు. కాలువపై నిర్మించాల్సిన బ్రిడ్జిలు సుమారు ఆరు ఉన్నాయి. ఆనకట్ట వద్ద పనులు, కాలువ పనులు పూర్తి కాకపోవడంతో పనులు ఎక్కడ పెండింగ్ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. ఐదేళ్లుగా కాలువ గురించి పట్టించుకోకపోవడంతో కాలువ కూడా పూడిపోతుంది. కాలువు నిర్మాణం చేసిన తర్వాత ఒక్క సారి కూడా నీరు పారుదల కాకపోవడం, వర్షాలు లేకపోవడంతో కాలువకు ఇరువైపు ఉన్న మట్టి అంతా జారీ కాలువలో పడి అక్కడక్కడ పూడిపోతుంది. చిల్ల చెట్లు పెరిగి కాలువ మూసుకుపోయింది. రైతులకు ఏ మాత్రం ఉపయోగపడలేదు.. ఈ టీడీపీ ఐదేళ్ల పాలనతో రైతులకు ఉపయోగపడే పనులు చేసింది ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మోపాడు చెరువుకు ఏర్పాటు చేసిన సప్లయ్ ఛానల్ పనులను అసలు పట్టించుకోలేదు. కేవలం నీరు చెట్టు కింద రెండు సార్లు లక్షల రూపాయిలు మంజూరు చేయించుకొని పూడిక తీసినట్లు మమ అనిపించారు. ఉపాధి హామీ కూలీలు చేసిన గుంటలను ప్రొక్లెయిన్‌తో చెక్కి ఇదే నీరు చెట్టుకింద చూపించారని రైతులు చెప్తున్నారు. అదే నిధులు వీఆర్‌కోట–మోపాడు సప్లయ్ ఛానల్‌కు ఉపయోగిస్తే పనులు పూర్తయి ఉండేవని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇదేటో గాని వర్షాలు పడవని చంద్రబాబుకు తెలుసులాగుంది. అందుకేనోమో కాలువ పనులు గాని, చెరువు అభివృద్ధి పనులు గాని ఏమి చేయలేదు. వర్షాలు కూడా పడ లేదు. దీంతో ఆయకట్టంతా బీళ్లుగానే మిగిలిపోయాయి. రైతుల కళ్లలో కన్నీళ్లు మిగిలాయి. -
ఎంత నిర్లక్ష్యమో..!
గిద్దలూరు రూరల్, న్యూస్‌లైన్: పగబట్టిన ప్రకృతి, పట్టించుకోని ప్రభుత్వం కారణంగా ఏటా రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ప్రధానంగా నీటి వనరులు లేకపోవడమే రైతు కుదేలుకు కారణమవుతోంది. వర్షపు నీటిని సక్రమంగా వినియోగించి ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది. దీని కోసం అనేక సార్లు రైతులు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం కరుణించి నిధులు విడుదల చేసింది. అయితే పనుల నిర్వహణలో మాత్రం అధికారులు నత్తకు నడకలు నేర్పుతున్నారు. దీంతో పంటలకు నీళ్లందక రైతులు అవస్థలు పడుతున్నారు. మండలానికి సగిలేరు సపై చానల్ పనులు మంజూరై రెండేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు 25 శాతం పనులు కూడా చేయలేదు. ఈ చానల్ పూర్తయితే ఐదు చెరువుల పరిధిలో ఆయకట్టుకు నీరందుతుంది. ఇరిగేషన్ శాఖాధికారులు మాత్రం దీనిపై ఎక్కడ లేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వర్షపు నీటిని మళ్లించి రాచర్ల మండలంలోని ఐదు చెరువులు నింపేందుకు 40 ఏళ్ల క్రితం సగిలేరు సప్లై చానల్ నిర్మించారు. కొన్నేళ్ల తర్వాత దీన్ని పట్టించుకోకపోవడంతో పూడిపోయింది. 2011 డిసెంబరులో కాలువ మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఏడు కిలోమీటర్ల మేర ఉన్న కాలువ, కొండపేట వద్ద ఉన్న యాక్యూడెట్, పాములపల్లె రోడ్డు, నల్లబండ బజారులో రెండు బ్రిడ్జిలు, రెండు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు స్టిల్వే, సగిలేరు ఆనకట్ట వద్ద యాప్రాన్, 200 మీటర్ల మేర కాలువకిరువైపులా గోడలు వంటి పనులు నిర్వహించాలి. కాంట్రాక్టర్ కొండపేట నుంచి పాములపల్లె మధ్య కొంత భాగంలో మాత్రమే కాలువ పనులు చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు పనులు జరుగుతున్న వైపు కన్నెత్తి చూడకపోవడంతోనే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండేళ్ల క్రితం పనులు వదిలి... రెండు నెలల క్రితం మంజూరైన పనులు పూర్తి: రైతులకు అత్యంత ప్రయోజనకరంగా ఉన్న సగిలేరు సప్లై చానల్ పనులను రెండేళ్లవుతున్నా పూర్తి చేయకుండా.. రెండు నెలల క్రితం మంజూరైన ఎఫ్డీఆర్ పనులను పూర్తి చేయడంపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సగిలేరు సప్లై చానల్ పనులకు సంబంధించిన పర్సంటేజీలు అప్పటి అధికారులు దిగమింగడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. ఎఫ్డీఆర్ పనుల్లో భాగంగా డివిజన్ పరిధిలోని గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల్లో రెండు నెలల క్రితం మంజూరైన *1.35 కోట్ల పనులను మాత్రం పూర్తి చేశారు. ఈ పనులకు పర్సంటేజీలు అందడంతోనే త్వరగా ముగించారని రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సగిలేరు సప్లై చానల్ పనులు త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. డీఈ వివరణ: సగిలేరు సప్లై చానల్ కాలువ పనులు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ డీఈ యూ.బాలగురువయ్య తెలిపారు. ఎఫ్డీఆర్ పనులు తక్షణం చేయాల్సినవి కావున అవసరాన్ని బట్టి కొన్ని చెరువు పనులను పూర్తిచేశామన్నారు.