ప్రస్తుత కాలంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎంతోమందిని వేధిస్తున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు చాలామంది వీటితో పోరాటం చేస్తున్నారు. అయితే సరైన వైద్య చికిత్స, ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో కఠిన పరిస్థితులను అధిగమించవచ్చని నిరూపించినవారు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో కొందరు తారలు ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కొంటూనే తమ జీవితాలను తిరిగి గాడిలో పెట్టుకున్నారు. క్యాన్సర్ నుంచి నాడీ సంబంధిత సమస్యల వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, మళ్లీ తమ కెరీర్‌పై దృష్టి సారించారు. అలాంటివారి గురించి తెలుసుకుందాం.

మనీషా కొయిరాలా
ఒకప్పుడు తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మనీషా కొయిరాలా జీవితంలో క్యాన్సర్ రూపంలో ఊహించని సవాలు ఎదురైంది. 2012లో ఆమెకు నాలుగో దశ అండాశయ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో చికిత్స కోసం అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లారు. అక్కడ శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ చేయించుకున్నారు. ఈ కఠిన ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, మనోధైర్యాన్ని కోల్పోకుండా వ్యాధితో పోరాడారు. చివరకు కోలుకుని తిరిగి సినిమాల్లో నటించడం ప్రారంభించారు. తన అనుభవాలను ఆత్మకథలోనూ పంచుకున్నారు.
సోనాలి బింద్రే
ప్రముఖ నటి సోనాలి బింద్రేకు 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె చికిత్స కోసం న్యూయార్క్‌కు వెళ్లారు. క్యాన్సర్‌తో పోరాటం శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఎన్నో సవాళ్లను విసిరింది. అయినప్పటికీ, తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ముందుకు సాగారు. చికిత్స సమయంలో ఎదురైన పరిస్థితులు, తనలో కలిగిన భావోద్వేగాలను బహిరంగంగా వెల్లడించారు. ఈ క్రమంలో క్యాన్సర్‌పై అవగాహన పెంచడంలోనూ తన వంతు పాత్ర పోషించారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత తిరిగి సాధారణ జీవితంపై దృష్టి సారిస్తూ వినోద రంగంలోనూ చురుగ్గా కనిపిస్తున్నారు.
(ఇదీ చదవండి: అర్ధరాత్రి బన్నీకి ఫోన్.. లేచే ఉన్నావా అన్నా..: విజయ్ దేవరకొండ)

తాహిరా కశ్యప్
రచయిత్రి, చిత్రనిర్మాత తాహిరా కశ్యప్ కూడా రొమ్ము క్యాన్సర్‌ను ఎదుర్కొన్నారు. 2018లో తనకు డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (డీసీఐఎస్) ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఇది రొమ్ము పాల నాళాల్లోని కణాలకు సంబంధించిన క్యాన్సర్‌కు ముందస్తు దశగా పరిగణించే పరిస్థితి. చికిత్సలో భాగంగా ఆమె మాస్టెక్టమీ చేయించుకున్నారు. వ్యాధి నిర్ధారణ నుంచి చికిత్స, కోలుకునే దశ వరకు ఎదురైన శారీరక, మానసిక ఇబ్బందుల గురించి బహిరంగంగా మాట్లాడారు. తన అనుభవాలను దాచిపెట్టకుండా పంచుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.
ఫాతిమా సనా షేక్
‘దంగల్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్ మూర్ఛ వ్యాధితో పోరాడుతున్నారు. ఈ సినిమా కోసం శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే తనకు ఎపిలెప్సీ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆమె గతంలో వెల్లడించారు. ఈ వ్యాధి గురించి తెలిసిన తొలినాళ్లలో బహిరంగ ప్రదేశాల్లో మూర్ఛ వస్తుందేమోనని ఆందోళన చెందేవారట. అంతేకాదు, ఈ సమస్య గురించి సమాజంలో ఉన్న అపోహలు, వివక్ష కూడా తనను ఇబ్బంది పెట్టాయని ఆమె తెలిపారు. వ్యాధిని అంగీకరించడం, దానికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగించడం మొదట్లో సులభంగా అనిపించలేదని వివరించారు.
హృతిక్ రోషన్
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సైతం తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నారు. 2013లో నిరంతర తలనొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్య పరీక్షల్లో మెదడు బయటి పొర, మెదడు మధ్య రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. ఈ సమస్యను సబ్‌డ్యూరల్ హెమటోమా అంటారు. దీంతో ఆయన మెదడుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం కోలుకున్న హృతిక్ తిరిగి తన పనుల్లో నిమగ్నమయ్యారు.
సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నాడీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గతంలో వెల్లడించారు. ఆయనకు ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే సమస్య ఉంది. ఇది ముఖంలోని నాడికి సంబంధించిన వ్యాధి. దీనివల్ల ముఖంలో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి కలగవచ్చు. ఈ సమస్య తనకు ఎన్నో ఇబ్బందులు కలిగించినట్లు సల్మాన్ పలు సందర్భాల్లో మాట్లాడారు.
సమంత రూత్ ప్రభు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జీవితంలోనూ అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి రూపంలో పెద్ద సవాలు ఎదురైంది. కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలోనే తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు 2022లో ఆమె వెల్లడించారు. ఈ వ్యాధి కండరాల్లో వాపు, బలహీనతకు కారణమవుతుంది. చికిత్స తీసుకుంటున్న సమయంలో తన ఆరోగ్య పరిస్థితి, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సమంత అభిమానులతో పంచుకున్నారు. కొన్నిసార్లు శారీరకంగా, మానసికంగా కష్టమైన రోజులు ఎదురైనా, తన పనులపై దృష్టి సారిస్తూ ముందుకు సాగారు.
(ఇదీ చదవండి: చొక్కా నలగకుండా రూ.500 కోట్లు.. రజనీకే సాధ్యం: అల్లు అర్జున్)


