breaking news
Kishtwar
-
ఇంకా చిక్కని 82 మంది ఆచూకీ
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ వల్ల విధ్వంసానికి గురైన చోసితీ గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం సంభవించిన ఆకస్మిక వర్షాలు, వరదల ధాటికి ముగ్గురు సీఐఎస్ఎఫ్ జవాన్లు, ఒక స్పెషల్ పోలీసు ఆఫీసర్ సహా 60 మంది దుర్మరణం పాలయ్యారు. 167 మందిని అధికారులు రక్షించారు. మరో 82 మంది జాడ గల్లంతయ్యింది. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన భారీ బండరాళ్లను పేలుడు పదార్థాలతో పేల్చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ఉదయం చిసోతీని సందర్శించారు. బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి పరిహారం అందజేస్తామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున ఇస్తామన్నారు. ధ్వంసమైన ఇళ్లకు సైతం పరిహారం ప్రకటించారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన గ్రామస్థులను ఒమర్ అబ్దుల్లా ఓదార్చారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ శుక్రవారం అర్ధరాత్రి చోసితీ గ్రామానికి చేరుకున్నారు. సహాయక చర్యలను సమీక్షించారు. శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జితేంద్ర సింగ్ పరామర్శించారు. సహాయ పునరావాస చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. అధికారులు ఇప్పటిదాకా 50 మృతదేహాలను గుర్తించి, సంబంధిత కుటుంబాలకు అప్పగించారు. క్లౌడ్ బరస్ట్‌లో కనీసం 16 నివాస గృహాలతోపాటు పలు ప్రభుత్వ భవనాలు, మూడు ఆలయాలు, 30 మీటర్ల వంతెన ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో వాహనాలో వరదలో కొట్టుకుపోయాయి. మరోవైపు మచైల్ మాత యాత్రను వరుసగా మూడోరోజు శనివారం సైతం రద్దు చేశారు. -
60కి చేరిన మరణాలు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లా చోసీతీ గ్రామంలో ‘క్లౌడ్ బరస్ట్’ ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం 60కి చేరింది. 30 మృతదేహాలను గుర్తించి, సంబంధిత కుటుంబాలకు అప్పగించారు. మరో 69 మంది జాడ ఇంకా లభించలేదు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించడానికి అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా గురువారం రాత్రి నిలిపివేసిన గాలింపు చర్యలను శుక్రవారం ఉదయం పునఃప్రారంభించారు. సైన్యం, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చోసితీ గ్రామంలో రాళ్లు, బురదను తొలగిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. క్లౌడ్ బరస్ట్‌లో 100 మందికిపైగా గాయపడ్డారని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తెలిపారు. .ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సీఎం ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. శిథిలాల కింద నుంచి వెలికి తీసినవారిని తక్షణమే ఆసుపత్రికి తరలించడానికి చోసితీలో 65 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. గ్రామంలో గురువారం మధ్యాహ్నం గంటపాటు క్లౌడ్ బరస్ట్ విరుచుకు పడిన సంగతి తెలిసిందే. ఆకస్మిక వర్షాలు, వరదల ధాటికి పెద్ద సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. గ్రామాన్ని బురద ముంచెత్తింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మచైల్ మాత యాత్రను రెండో రోజు శుక్రవారం కూడా రద్దుచేశారు. -
కన్నీటి వరద
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లాలో ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా గురువారం చోసితీ గ్రామాన్ని భారీ వరద ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు సహా ఏకంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 220 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న 167 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వారిలో 38 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మచైల్ మాత ఆలయానికి వెళ్లే దారిలో వాహనాలపై ప్రయాణించగలిగే చిట్టచివరి గ్రామం చోసితీ. జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో కొండల మధ్య ఉన్న ఈ గ్రామంపై గురువారం మధ్యాహ్నం 12 గంటలకు క్లౌడ్‌బరస్ట్ విరుచుకుపడింది. సరిగ్గా గంటపాటు భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వరద ముంచెత్తింది. వరద దూసుకొచ్చిన సమయంలో గ్రామంలో 1,200 మంది ఉన్నట్లు తెలిసింది. మచైల్ మాత యాత్ర కోసం అప్పటికే చోసితీ గ్రామానికి చేరుకున్న భక్తులు భయకంపితులయ్యారు. సామూహిక వంటశాల(లంగర్)లో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. వంటశాలలోకి వరద నీరు చేరింది. పలు ఇళ్లు, దుకాణాలు, సెక్యూరిటీ ఔట్‌పోస్టు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వీధులన్నీ బురద, బండరాళ్లతో నిండిపోయాయి. కొన్ని ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. వర్షం, వరద ధాటికి ఇప్పటిదాకా 46 మంది మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలు ఛిద్రం చోసితీలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. బురద, రాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాలు ముక్కలయ్యాయి. శరీరం లోపలి అవయవాలు బయటకు వచ్చాయి. ఎటుచూసినా రక్తపు మరకలే. మృతదేహాల ఊపిరితిత్తుల్లోకి కూడా బురద చేరింది. పక్కటెముకలు విరిగిపోయాయి. రాళ్ల తాకిడికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. బురదను తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇక క్షతగాత్రులు షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని అంటున్నారు. అసలేం జరిగిందో చెప్పలేకపోయారు. గల్లంతైన తమవారి కోసం గ్రామస్తులు, భక్తులు వెతుకున్నారు. వారి రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జమ్మూకశ్మీర్‌లో కిష్తవాడ్తోపాటు రాజౌరీ, ఉదంపూర్, పూంచ్, కథువా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తావి, చినాబ్, ఉజ్, సురాన్ తదితర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సహాయక చర్యలు వేగవంతం చేయాలి: మోదీ కిష్తవాడ్ జిల్లాలో ఆకస్మిక వర్షాల్లో 40 మందికిపైగా భక్తులు, ప్రజలు మృతిచెందడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికిప్పుడు సమీక్షిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. సహాయక, పునరావాస చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. క్షతగాత్రులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో ఫోన్లో మాట్లాడారు. చోసితీ గ్రామంలో సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులను ఆదుకోవాలని సూచించారు. క్లౌడ్ బరస్ట్ గురించి తెలిసిన వెంటనే కిష్తవాడ్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ వర్మతోపాటు సీనియర్ అధికారులు చోసితీకి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు స్థానిక పోలీసులు, సైనికులు, స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, వరదల నేపథ్యంలో మచైల్ యాత్రను అధికారులు రద్దు చేశారు. ప్రజలు, యాత్రికుల సహాయార్థం కంట్రోల్ రూమ్, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో తొమ్మిది రోజుల క్రితమే క్లౌడ్ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మరణించగా, గల్లంతైన 68 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. విశిష్టమైన యాత్ర మచైల్ మాత యాత్ర జూలై 25న ప్రారంభమైంది. సెపె్టంబర్ 5న ముగియనుంది. చోసితీ నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 9,500 అడుగుల ఎత్తులో మచైల్ మాత ఆలయం ఉంది. ఈ గ్రామం నుంచే యాత్ర ప్రారంభమవుతుంది. యాత్రికులు తొలుత ఇక్కడికి వాహనాల్లో చేరుకుంటారు. తర్వాత కాలినడకన దుర్గా మాత ఆలయానికి వెళ్తారు. ప్రతిఏటా జరిగే ఈ యాత్రలో వేలాది మంది పాల్గొంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తారు. ఇది చాలా విశిష్టమైన యాత్రగా పేరుగాంచింది. యాత్ర కోసం చోసితీని బేస్‌క్యాంప్‌గా ఉపయోగిస్తుంటారు. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్:కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. కిష్త్వార్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచారు. అదే విధంగా కథువాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో భారత బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు.కాగా చత్రూలోని నైద్ఘం గ్రామ సమీపంలోని పింగ్నాల్ దుగడ్డ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులుకాల్పులు జరిపాయి. వీటిని బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. అయితే ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు గాయపడినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి#𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐀𝐫𝐦𝐲𝐎𝐏 𝐊𝐇𝐀𝐍𝐃𝐀𝐑𝐀In the Joint operation launched on 11 Sep by 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐑𝐢𝐬𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 𝐂𝐨𝐫𝐩𝐬 & 𝐉&𝐊 𝐏𝐨𝐥𝐢𝐜𝐞, Two Terrorists Neutralised & Large War Like Stores Recovered. 𝐎𝐩𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐬 C𝐨𝐧𝐜𝐥𝐮𝐝𝐞𝐝 pic.twitter.com/QUc92EhElN— Rising Star Corps_IA (@RisingStarCorps) September 13, 2024ఇక ఉదంపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన కొద్ది రోజులకే ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. గత జూలైలో దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ముడిపడి ఉన్న ఉగ్రవాదులే తాజా కాల్పుల్లోనూ పాల్గొన్నట్లు సంబధిత వర్గాలు తెలిపాయి. దోడా ఎన్కౌంటర్లో ఓ అధికారి సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు.అయితే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. ప్రధాని రేపు దోడాను సందర్శించే అవకాశం ఉంది.దోడా, ఉదంపూర్, కథువా జిల్లాల్లో ఇటీవల తీవ్రవాద దాడులు పెరిగాయి దోడాలో జరిగిన ఆపరేషన్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు మరియు ఏడుగురు సైనికులతో సహా దాదాపు డజను మంది మరణించారు.ఇక సెప్టెంబరు 18న దక్షిణ కాశ్మీర్ జిల్లాలైన అనంత్‌నాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్‌లోని 16 స్థానాలతో పాటు చీనాబ్ లోయ ప్రాంతంలోని దోడా, కిష్త్వార్, రాంబన్ జిల్లాల్లో ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కిష్త్వార్, దోడా, రాంబన్ జిల్లాల్లో భద్రతను పెంచారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, పోలింగ్ స్టేషన్ల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించారు. జమ్మూ, కథువా, సాంబా జిల్లాలో సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న రెండో, మూడో దశలలో ఓటింగ్ జరగనుంది. -
రాజ్యసభలో కిష్ట్‘వార్’
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో తలెత్తిన మత ఘర్షణల దరిమిలా నెలకొన్న పరిస్థితులపై విపక్షాలు రాజ్యసభలో సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కిష్ట్వార్లో హింసాకాండను అరికట్టడంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. కిష్ట్వార్, పరిసర జిల్లాల్లో ఉద్రిక్తతలను కేవలం రెం డు వర్గాల మధ్య తలెత్తిన మత ఘర్షణలుగా కొట్టిపారేయలేమని, ఇవి దేశ సమైక్యతకు, సార్వభౌమత్వానికి భంగం కలి గించేలా ఉన్నాయన్నా రు. కిష్ట్వార్ వెళ్లేందుకు తనను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడా న్ని జైట్లీ తప్పుపట్టారు. ఏఐసీసీ సభ్యులు అడుగు పెట్టకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ 144 సెక్షన్ విధిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ చర్చలో మాట్లాడుతూ, కాశ్మీర్ ప్రభుత్వం హింసాకాం డను అరికట్టడంలో విఫలమైందని, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డి మాండ్ చేశారు. కిష్ట్వార్లో తలెత్తినది స్థానిక శాంతిభద్రతల సమ స్య కాదని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నా రు. కాగా, కాశ్మీర్ లోయలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. -
కిష్ట్వార్లో మళ్లీ హింసాకాండ
జమ్మూ/శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో సోమవారం మళ్లీ హింసాకాండ చెలరేగింది. ఇక్కడ శుక్రవారం తలెత్తిన మత ఘర్షణలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న జమ్మూ కాశ్మీర్ హోంశాఖ సహాయ మంత్రి సాజద్ కిచ్లూ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హింసాకాండపై జ్యుడీషియల్ దర్యాప్తుకు ఆదేశించారు. ఘర్షణలపై నివేదిక పంపాలని కేంద్రం కాశ్మీర్ సర్కారును కోరింది. కాగా, జమ్మూ ప్రాంతంలో శాంతి సామరస్యాలను కాపాడాలని గవర్నర్ ఎన్.ఎన్.వోరా ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు, కిష్ట్వార్ జిల్లా హిద్యాల్ ప్రాంతంలో సోమవారం జరిగిన తాజా ఘర్షణల్లో ఏఎస్పీ కుల్బీర్ సింగ్ సహా పదిమంది గాయపడ్డారు. కాగా, మంత్రి కిచ్లూ రాజీనామా విషయాన్ని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ‘ట్విట్టర్’ ద్వారా వెల్లడించారు. కిచ్లూ రాజీనామాను గవర్నర్ ఎన్.ఎన్.వోరా ఆమోదించినట్లు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కిష్ట్వార్లో శుక్రవారం చెలరేగిన ఘర్షణలకు మంత్రి కిచ్లూనే కారకుడని, ఆయనను పదవి నుంచి తప్పించాలని బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కిష్ట్వార్ ఘర్షణల దరిమిలా జమ్మూ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించగా, సోమవారం ఉధామ్‌పూర్ జిల్లాలో రెండు గంటల సేపు కర్ఫ్యూను సడలించారు. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (జేకేఎన్‌పీపీ) ఉధామ్పూర్లో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసింది. ఇదిలా ఉండగా, కిష్ట్వార్ జిల్లాలో చెలరేగిన హింసాకాండలో ముగ్గురు మరణించగా, 68 దుకాణాలను, ఏడు హోటళ్లను, 35 వాహనాలను అల్లరి మూకలు ధ్వంసం చేశాయని జమ్మూ కాశ్మీర్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ చెప్పారు. హింసాకాండకు సంబంధించి ఇప్పటి వరకు పదిమందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, కిష్ట్వార్, జమ్మూ, రాజౌరీ, ఉధామ్‌పూర్, సాంబా, రియాసీ జిల్లాలతో పాటు దోడా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలవుతోంది. సైనిక బలగాలు ఈ ప్రాంతాల్లో వీధుల్లో గస్తీ తిరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, శ్రీనగర్‌లో సోమవారం నిరసన ర్యాలీ తలపెట్టిన జేకేఎల్ఎఫ్ అధ్యక్షుడు మహమ్మద్ యాసిన్ మాలిక్, ఉపాధ్యక్షుడు బషీర్ అహ్మద్ భట్‌లతో పాటు మరో పాతిక మందిని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా నిర్బంధంలోకి తీసుకున్నారు. బీజేపీపై కిచ్లూ ప్రతి విమర్శలు... తనపై ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీ నామా చేసిన కిచ్లూ, తనపై విమర్శలు చేసిన బీజేపీపై ప్రతి విమర్శలు సంధించారు. దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేందుకు వీలుగా తాను పదవికి రాజీనామా చేశానని ఆయన చెప్పారు. ‘గోధ్రా హింసాకాండ తర్వాత గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ రాజీనామా చేశారా?... ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రచారకర్తగా ఉన్న అమిత్ షా సంగతేమిటి? అని ప్రశ్నించారు. డార్జిలింగ్‌లో 15 నుంచి నాలుగు రోజులు బంద్ సడలింపు డార్జిలింగ్: గూర్ఖాలాండ్ డిమాండ్‌పై డార్జిలింగ్ పర్వతప్రాంతంలో కొనసాగిస్తున్న నిరవధిక బంద్‌ను ఆగస్టు 15 నుంచి నాలుగు రోజుల పాటు సడలిస్తున్నట్లు గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) సోమవారం ప్రకటించింది. అయితే, మంగళవారం నుంచి రెండు రోజుల పాటు ‘జనతా కర్ఫ్యూ’ చేపడతామని, ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతారని వెల్లడించింది. నిరవధిక బంద్ విరమణకు పశ్చిమ బెంగాల్ సర్కారు విధించిన 72 గంటల గడువు ముగియడంతో జీజేఎం సోమవారం అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసింది. -
కాశ్మీర్లో అరుణ్ జైట్లీ నిర్బంధం
జమ్మూ: జమ్మూ కాశ్మీర్లో మత ఘర్షణలు జరిగిన కిష్ట్వార్ జిల్లాను సందర్శించేందుకు ఆదివారం జమ్మూ చేరుకున్న బీజేపీ నేత అరుణ్ జైట్లీని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వెనక్కు పంపింది. జమ్మూ విమానాశ్రయంలోనే పోలీసులు ఆయనను నిర్బంధించారు. తర్వాత కొద్దిసేపటికి ఆయనను వెనక్కు పంపారు. జైట్లీతో పాటు వచ్చిన పంజాబ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ అవినాశ్‌రాయ్ ఖన్నాను, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జుగల్ కిశోర్‌ను కూడా పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని, ఆ తర్వాత వెనక్కు పంపారు. మత ఘర్షణలతో ఉద్రిక్తంగా మారిన కిష్ట్వార్ వెళ్లేందుకు రాజకీయ నాయకులను అనుమతించబోమని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు కిష్ట్వార్లో ఆదివారం మరో మృతదేహం లభ్యమైంది. అయితే, మృతుడు హింసాకాండలోనే మరణించాడా, మరేదైనా కారణం వల్ల మరణించాడా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ సందర్భంగా వదంతులను నమ్మవద్దని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కిష్ట్వార్లో శుక్రవారం చెలరేగిన మత ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందిన దరిమిలా, కాశ్మీర్ లోయలోని చుట్టుపక్కల ప్రాంతాలకూ ఉద్రిక్తతలు విస్తరించాయి. దీంతో శనివారం జమ్మూ, రాజౌరీ జిల్లాల్లో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం, ఆదివారం ఉధామ్‌పూర్, సాంబా, కఠువా జిల్లాలకు, దోడా జిల్లాలోని భదేర్వా పట్టణానికి కర్ఫ్యూ విస్తరించింది. అయితే, జమ్మూ విమానాశ్రయంలోనే జైట్లీని నిర్బంధించి, అక్కడి నుంచి ఆయనను వెనక్కు పంపడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మత ఘర్షణలు చెలరేగిన ప్రాంతంలో వాస్తవాలను తెలుసుకునేందుకు వచ్చిన జైట్లీని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడింది. కిష్ట్వార్ హింసాకాండకు సంబంధించిన నిజాలు బయటకు రాకుండా చూసేందుకే ఒమర్ సర్కారు జైట్లీ సహా తమ పార్టీ నేతలను నిర్బంధించిందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. కాగా, ఘర్షణలు జరిగిన కిష్ట్వార్ జిల్లాకు వెళ్లాలనుకున్న తనను శ్రీనగర్‌లోని తన ఇంటిని దాటి బయటకు రాకుండా నిర్బంధించారని పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. మరోవైపు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆ పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆ రాజకీయ నాయకులందరూ తిరిగి 2008 నాటి (అమర్నాథ్ భూములపై ఘర్షణ) పరిస్థితులను పునరావృతం చేయాలని ప్రయత్నిస్తున్నారని, తద్వారా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభలో విపక్షనేత సుష్మా స్వరాజ్‌తో తాను ఫోన్లో మాట్లాడానని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని ఆ పార్టీ నేతలకు సూచించాలని కోరానని ఒమర్ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరో మూడు జిల్లాలకు కర్ఫ్యూ విధించామని, ముందు జాగ్రత్తగా ఈ ప్రాంతాల్లో సైన్యాన్ని రంగంలోకి దించామని జమ్మూ డివిజినల్ కమిషనర్ శాంత్మను చెప్పారు. మంత్రి పాత్రపై దర్యాప్తు జరపాలి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ కిష్ట్వార్ మత ఘర్షణలపై జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ నరేశ్ గుప్తా డిమాండ్ చేశారు. కిష్ట్వార్లో మైనారిటీలపై జరిగిన దాడి వెనుక రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి సజ్జద్ కిచ్లూ హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారని, కిచ్లూ కిష్ట్వార్లో ఉండగానే ఈ సంఘటన జరిగినందున ఆయన పాత్రపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. -
కాశ్మీర్లో మరో రెండు జిల్లాల్లో కర్ఫ్యూ
జమ్మూ/శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో చెలరేగిన మత ఘర్షణల ఫలితంగా, శనివారం కాశ్మీర్ లోయలో జనజీవనం స్తంభించిపోయింది. కిస్ట్‌వార్ జిల్లాలో శనివారం రెండోరోజూ కర్ఫ్యూ కొనసాగగా, హింసాత్మక సంఘటనలు చెలరేగడంతో జమ్మూ, రాజౌరీ జిల్లాల్లోనూ కర్ఫ్యూ విధించారు. బంద్ ఫలితంగా కాశ్మీర్ లోయ ప్రాంతంలో విద్యా, వ్యాపార సంస్థలు మూతపడగా, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నిరసనల్లో పదిమంది గాయపడ్డారు. కిష్ట్వార్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. జమ్మూ నగరంలో పోలీసులు, నిరసనకారుల పరస్పర దాడుల్లో ఏడుగురు గాయపడ్డారు. జమ్మూతో పాటు పరిసర జిల్లాల్లో బంద్ పాటించడంతో పాటు భారీ స్థాయిలో నిరసనలు జరిగాయి. కిష్ట్వార్ జిల్లాలోని గులాబ్‌గఢ్ ప్రాంతంలో శనివారం కొందరు దుకాణాలకు నిప్పుపెట్టారు. కాగా, జమ్మూ బంద్‌ను నిరసనకారులు మరో 48 గంటలకు పొడిగించారు. కిష్ట్వార్ జిల్లాలో శుక్రవారం జరిగిన మత ఘర్షణల్లో ఇద్దరు మరణించగా, ఇరవై మందికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈద్ ప్రార్థనల తర్వాత కొందరు దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతో ఘర్షణలు మొదలయ్యాయి. దీనికి నిరసనగా బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగదళ్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో జమ్మూలో శనివారం ర్యాలీ నిర్వహించారు. సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకోవడంతో, వారిపై రాళ్లు రువ్వారు. దీంతో సీఆర్పీఎఫ్ జవాన్లు లాఠీలు ఝుళిపించి, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో జమ్మూ ఎస్పీ సహా ఏడుగురు గాయపడ్డారు.మరోవైపు, హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ గీలానీ ఆదివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.