
జమ్ము కశ్మీర్ క్లౌడ్ బరస్ట్ ఘటనలో మృతుల సంఖ్య 65కి చేరుకుంది. ఆచూకీ గల్లంతైన వందలాది మంది కోసం శుక్రవారం చోసితీ గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. మరోవైపు.. అక్కడి పరిస్థితులు మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం చెప్పకనే చెబుతున్నాయి.
చోసితీలో ప్రస్తుతం హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితోపాటు స్థానిక పోలీసులు, సైనికులు, స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బురద, రాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను గుర్తించి ఆస్పత్రికి తరలిస్తున్నారు. నిన్నటి నుంచి ఇప్పటిదాకా 200 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
చోసితీలో బురదను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఎటుచూసినా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. రాళ్ల తాకిడికి మృతదేహాలు ఛిద్రమై.. శరీరం లోపలి అవయవాలు బయటకు వచ్చి.. గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. మరోపక్క.. గల్లంతైన తమవారి కోసం గ్రామస్తులు, భక్తులు వెతుకున్నారు. వారి రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జమ్ము కశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లాలో గురువారం ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా చోసితీ గ్రామాన్ని భారీ వరద ముంచెత్తింది. వరద ధాటికి చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరద దూసుకొచ్చిన సమయంలో గ్రామంలో 1,200 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో దాదాపు 220 మంది గల్లంతయ్యారని చెబుతున్నా.. భారీ సంఖ్యలో భక్తులు ఉండడంతో ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది.
కిష్త్‌వాడ్ జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో కొండల మధ్య ఉంటుంది చోసితీ గ్రామం. ఇక్కడి నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో సుప్రసిద్ధ మచైల్ మాత ఆలయం ఉంటుంది. యాత్ర కోసం వచ్చే భక్తులు చోసితీని బేస్‌క్యాంప్‌గా ఉపయోగిస్తుంటారు. ఇక్కడిదాకా వాహనాల్లో వచ్చి.. అటుపై కాలినడకన ఆలయానికి వెళ్తారు. ఈ ఏడాది జులై 25న మచైల్ మాత యాత్ర ప్రారంభమైంది. అలాంటి గ్రామంపై గురువారం క్లౌడ్‌బరస్ట్ వల్ల.. సరిగ్గా గంటపాటు భారీ వర్షం కురిసి ఒక్కసారిగా వరద ముంచెత్తింది
ఈ వరదలతో చోసితీకి భారీగా చేరుకున్న భక్తులు వణికిపోయారు. పలు ఇళ్లు, దుకాణాలు, సెక్యూరిటీ ఔట్‌పోస్టు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వీధులన్నీ బురద, బండరాళ్లతో నిండిపోయాయి. కొన్ని ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి.