
46మంది మృతి
220 మంది గల్లంతు
కశ్మీర్‌లోని కిష్తవాడ్‌లో గంటపాటు క్లౌడ్ బరస్ట్
చోసితీ గ్రామాన్ని ముంచెత్తిన భారీ వరద
విరిగిపడిన కొండచరియలు.. ధ్వంసమైన ఇళ్లు, దుకాణాలు
బాధితుల్లో మచైల్ మాత భక్తులు, ప్రజలు
167 మందిని రక్షించిన సహాయక బృందాలు
ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలు..
బురద, రాళ్ల కింద ఛిద్రమైన స్థితిలో మృతదేహాలు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అధికారులు
క్లౌడ్ బరస్ట్‌పై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
సహాయక, పునరావాస చర్యలు వేగవంతం చేయాలన్న మోదీ
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడిన అమిత్ షా
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లాలో ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా గురువారం చోసితీ గ్రామాన్ని భారీ వరద ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు సీఐఎస్‌ఎఫ్ జవాన్లు సహా ఏకంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 220 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి.
శిథిలాల కింద చిక్కుకున్న 167 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వారిలో 38 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మచైల్ మాత ఆలయానికి వెళ్లే దారిలో వాహనాలపై ప్రయాణించగలిగే చిట్టచివరి గ్రామం చోసితీ. జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో కొండల మధ్య ఉన్న ఈ గ్రామంపై గురువారం మధ్యాహ్నం 12 గంటలకు క్లౌడ్‌బరస్ట్ విరుచుకుపడింది.
సరిగ్గా గంటపాటు భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వరద ముంచెత్తింది. వరద దూసుకొచ్చిన సమయంలో గ్రామంలో 1,200 మంది ఉన్నట్లు తెలిసింది. మచైల్ మాత యాత్ర కోసం అప్పటికే చోసితీ గ్రామానికి చేరుకున్న భక్తులు భయకంపితులయ్యారు.
సామూహిక వంటశాల(లంగర్)లో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. వంటశాలలోకి వరద నీరు చేరింది. పలు ఇళ్లు, దుకాణాలు, సెక్యూరిటీ ఔట్‌పోస్టు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వీధులన్నీ బురద, బండరాళ్లతో నిండిపోయాయి. కొన్ని ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. వర్షం, వరద ధాటికి ఇప్పటిదాకా 46 మంది మృతి చెందినట్లు గుర్తించారు.
మృతదేహాలు ఛిద్రం
చోసితీలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. బురద, రాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాలు ముక్కలయ్యాయి. శరీరం లోపలి అవయవాలు బయటకు వచ్చాయి. ఎటుచూసినా రక్తపు మరకలే. మృతదేహాల ఊపిరితిత్తుల్లోకి కూడా బురద చేరింది. పక్కటెముకలు విరిగిపోయాయి. రాళ్ల తాకిడికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. బురదను తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.
ఇక క్షతగాత్రులు షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని అంటున్నారు. అసలేం జరిగిందో చెప్పలేకపోయారు. గల్లంతైన తమవారి కోసం గ్రామస్తులు, భక్తులు వెతుకున్నారు. వారి రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జమ్మూకశ్మీర్‌లో కిష్తవాడ్‌తోపాటు రాజౌరీ, ఉదంపూర్, పూంచ్, కథువా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తావి, చినాబ్, ఉజ్, సురాన్ తదితర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
సహాయక చర్యలు వేగవంతం చేయాలి: మోదీ
కిష్తవాడ్ జిల్లాలో ఆకస్మిక వర్షాల్లో 40 మందికిపైగా భక్తులు, ప్రజలు మృతిచెందడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికిప్పుడు సమీక్షిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. సహాయక, పునరావాస చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
క్షతగాత్రులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో ఫోన్‌లో మాట్లాడారు. చోసితీ గ్రామంలో సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులను ఆదుకోవాలని సూచించారు. క్లౌడ్ బరస్ట్ గురించి తెలిసిన వెంటనే కిష్తవాడ్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ వర్మతోపాటు సీనియర్ అధికారులు చోసితీకి చేరుకున్నారు.
సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితోపాటు స్థానిక పోలీసులు, సైనికులు, స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, వరదల నేపథ్యంలో మచైల్ యాత్రను అధికారులు రద్దు చేశారు. ప్రజలు, యాత్రికుల సహాయార్థం కంట్రోల్ రూమ్, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో తొమ్మిది రోజుల క్రితమే క్లౌడ్ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మరణించగా, గల్లంతైన 68 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.
విశిష్టమైన యాత్ర
మచైల్ మాత యాత్ర జూలై 25న ప్రారంభమైంది. సెపె్టంబర్ 5న ముగియనుంది. చోసితీ నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 9,500 అడుగుల ఎత్తులో మచైల్ మాత ఆలయం ఉంది. ఈ గ్రామం నుంచే యాత్ర ప్రారంభమవుతుంది. యాత్రికులు తొలుత ఇక్కడికి వాహనాల్లో చేరుకుంటారు. తర్వాత కాలినడకన దుర్గా మాత ఆలయానికి వెళ్తారు. ప్రతిఏటా జరిగే ఈ యాత్రలో వేలాది మంది పాల్గొంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తారు. ఇది చాలా విశిష్టమైన యాత్రగా పేరుగాంచింది. యాత్ర కోసం చోసితీని బేస్‌క్యాంప్‌గా ఉపయోగిస్తుంటారు.