breaking news
CISF jawans
-
కన్నీటి వరద
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లాలో ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా గురువారం చోసితీ గ్రామాన్ని భారీ వరద ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు సహా ఏకంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 220 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న 167 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వారిలో 38 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మచైల్ మాత ఆలయానికి వెళ్లే దారిలో వాహనాలపై ప్రయాణించగలిగే చిట్టచివరి గ్రామం చోసితీ. జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో కొండల మధ్య ఉన్న ఈ గ్రామంపై గురువారం మధ్యాహ్నం 12 గంటలకు క్లౌడ్‌బరస్ట్ విరుచుకుపడింది. సరిగ్గా గంటపాటు భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వరద ముంచెత్తింది. వరద దూసుకొచ్చిన సమయంలో గ్రామంలో 1,200 మంది ఉన్నట్లు తెలిసింది. మచైల్ మాత యాత్ర కోసం అప్పటికే చోసితీ గ్రామానికి చేరుకున్న భక్తులు భయకంపితులయ్యారు. సామూహిక వంటశాల(లంగర్)లో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. వంటశాలలోకి వరద నీరు చేరింది. పలు ఇళ్లు, దుకాణాలు, సెక్యూరిటీ ఔట్‌పోస్టు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వీధులన్నీ బురద, బండరాళ్లతో నిండిపోయాయి. కొన్ని ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. వర్షం, వరద ధాటికి ఇప్పటిదాకా 46 మంది మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలు ఛిద్రం చోసితీలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. బురద, రాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాలు ముక్కలయ్యాయి. శరీరం లోపలి అవయవాలు బయటకు వచ్చాయి. ఎటుచూసినా రక్తపు మరకలే. మృతదేహాల ఊపిరితిత్తుల్లోకి కూడా బురద చేరింది. పక్కటెముకలు విరిగిపోయాయి. రాళ్ల తాకిడికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. బురదను తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇక క్షతగాత్రులు షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని అంటున్నారు. అసలేం జరిగిందో చెప్పలేకపోయారు. గల్లంతైన తమవారి కోసం గ్రామస్తులు, భక్తులు వెతుకున్నారు. వారి రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జమ్మూకశ్మీర్‌లో కిష్తవాడ్తోపాటు రాజౌరీ, ఉదంపూర్, పూంచ్, కథువా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తావి, చినాబ్, ఉజ్, సురాన్ తదితర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సహాయక చర్యలు వేగవంతం చేయాలి: మోదీ కిష్తవాడ్ జిల్లాలో ఆకస్మిక వర్షాల్లో 40 మందికిపైగా భక్తులు, ప్రజలు మృతిచెందడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికిప్పుడు సమీక్షిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. సహాయక, పునరావాస చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. క్షతగాత్రులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో ఫోన్లో మాట్లాడారు. చోసితీ గ్రామంలో సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులను ఆదుకోవాలని సూచించారు. క్లౌడ్ బరస్ట్ గురించి తెలిసిన వెంటనే కిష్తవాడ్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ వర్మతోపాటు సీనియర్ అధికారులు చోసితీకి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు స్థానిక పోలీసులు, సైనికులు, స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, వరదల నేపథ్యంలో మచైల్ యాత్రను అధికారులు రద్దు చేశారు. ప్రజలు, యాత్రికుల సహాయార్థం కంట్రోల్ రూమ్, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో తొమ్మిది రోజుల క్రితమే క్లౌడ్ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మరణించగా, గల్లంతైన 68 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. విశిష్టమైన యాత్ర మచైల్ మాత యాత్ర జూలై 25న ప్రారంభమైంది. సెపె్టంబర్ 5న ముగియనుంది. చోసితీ నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 9,500 అడుగుల ఎత్తులో మచైల్ మాత ఆలయం ఉంది. ఈ గ్రామం నుంచే యాత్ర ప్రారంభమవుతుంది. యాత్రికులు తొలుత ఇక్కడికి వాహనాల్లో చేరుకుంటారు. తర్వాత కాలినడకన దుర్గా మాత ఆలయానికి వెళ్తారు. ప్రతిఏటా జరిగే ఈ యాత్రలో వేలాది మంది పాల్గొంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తారు. ఇది చాలా విశిష్టమైన యాత్రగా పేరుగాంచింది. యాత్ర కోసం చోసితీని బేస్‌క్యాంప్‌గా ఉపయోగిస్తుంటారు. -
కోర్టులకు సీఐఎస్ఎఫ్ భద్రత?
న్యూఢిల్లీ: హింసాత్మక ఘటనలను నివారించేందుకు కొన్ని న్యాయస్థానాల్లో ప్రత్యేక తరగతికి చెందిన సీఐఎస్ఎఫ్ జవాన్లతో భద్రత ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. గత నవంబరులో జరిగిన ఈ ఘటనలో న్యాయవాదులు, పోలీసులు పరస్పరం దాడులకు దిగిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ నిర్ణయం తరువాత ప్రత్యేక సీఐఎస్ఎఫ్ జవాన్లను ఏర్పాటు చేసే అంశాన్ని చేపట్టాలని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తెలిపారు. జవాన్ల ఏర్పాటు న్యాయవాదులకు ఇబ్బందికరం కావచ్చునని ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సహాయపడుతున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అన్నారు. -
ఏళ్లుగా భరించాం.. ఇక ఊరుకోం
ఘజియాబాద్: ‘అయిందేదో అయింది. ఏళ్లుగా భరించాం. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు’అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రకుట్రలకు తగిన గుణపాఠం చెప్పి తీరతామని స్ప ష్టం చేశారు. పుల్వామా, ఉడి ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆదివారం ఇక్కడ జరిగిన కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సీఐఎస్ఎఫ్) 50వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని ప్రసంగించారు. దేశ భద్రతను కాపాడుతున్న సీఐఎస్ఎఫ్ జవాన్ల కృషి అభినందనీయమని కొనియాడారు. స్వాతంత్య్రం అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించిన 35 వేల మంది పోలీసుల్లో పాలమిలటరీ దళాలకు చెందిన వారు 4 వేల మంది ఉన్నారని పేర్కొ న్నారు. వీరి శౌర్యం, అంకితభావం ప్రజలందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు. దేశప్రజల మద్దతుతోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. ఉగ్రదాడు లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధునాతన గాడ్జెట్లను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇక వీఐపీ సంస్కృతిపై మోదీ విమర్శల వర్షం కురిపించారు. వీఐపీలకు భద్రతను అందించే సీఐఎస్ఎఫ్ బలగాలతో వారు వ్యవహరించే తీరు దారుణంగా ఉంటోం దన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్ల గురించి ప్రజలకు తెలిసేలా వారి చరిత్ర, విధివిధానాలతో డిజిటల్ మ్యూజియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల ఆశీర్వాదం కోరుతున్నా: మోదీ న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను మరోసారి ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను తాను కోరుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘అందరితోపాటుగా, అందరి అభివృద్ధి అనే మా మార్గంలో వెళ్తూ మరోసారి మీ ఆశీర్వాదం కోరుతున్నా. గత 70 ఏళ్లలో నాటి ప్రభుత్వాలు తీర్చలేకపోయిన కనీస అవసరాలను మా ప్రభుత్వం తీర్చింది. ఇప్పుడు మనం మరింత బలమైన, వృద్ధి దాయకమైన, భద్రమైన ఇండియాను నిర్మించాలి’అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను మోదీ ప్రస్తావించారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడి
చింతూరు (రంపచోడవరం)/చర్ల: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న మినీ బస్సే లక్ష్యంగా మావోలు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మందు పాతరను పేల్చడంతో ఒక జవాను, నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గత 15 రోజుల్లో ఇది మావోయిస్టుల మూడో దాడి కావడం గమనార్హం. ఎన్నికల విధుల కోసం కోల్‌కతా నుంచి వచ్చిన 502వ బెటాలియన్ జవాన్లు ఆకాశ్ నగర్లో క్యాంప్ వేశారు. వీరంతా ఆ సమీపంలో ఎన్ఎండీసీ ఆధ్వర్యంలో పనిచేసే బైలడిల్లా ఇనుప గనుల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం కొందరు జవాన్లు కూరగాయలు కొనుగోలు చేసేందుకు పక్కనే ఉన్న బచేలీకి వెళ్లారు. అనంతరం తిరిగి మినీ బస్సులో వస్తుండగా కొండ ప్రాంతంలోని ఆరో మలుపు వద్ద మావోయిస్టులు ముందుగా అమర్చిన మందుపాతరతో పేల్చేశారు. దీంతో బస్సు సుమారు 20 అడుగుల ఎత్తు ఎగిరిపడింది. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ హెడ్‌కానిస్టేబుల్, బస్ డ్రైవర్, ఇద్దరు క్లీనర్లు, ట్రక్కు డ్రైవర్ చనిపోయారు. మందుపాతర పేల్చిన తర్వాత మావోయిస్టులు సీఐఎస్ఎఫ్ జవాన్లకు చెందిన ఆయుధాలను తీసుకెళ్లారు. ఈ ఘటనతో అప్రమత్తమైన దంతెవాడ పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. -
కోర్టుకెక్కిన 200 మంది జవాన్లు
ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోవడంతో.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది కోర్టును ఆశ్రయించారు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న దాదాపు 200 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది తమకు సరైన తిండి పెట్టడం లేదని, అలవెన్సులు ఇవ్వట్లేదని, పని చేసే పరిస్థితులు కూడా ఘోరంగా ఉన్నాయని అంటూ తమకు న్యాయం చేయాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విమానాశ్రయాలతో పాటు ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భద్రతా బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది చూసుకుంటారు. కేంద్ర భద్రతా దళాలలో భాగమైన సీఐఎస్ఎఫ్తో పాటు వివిధ దళాలు తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేస్తున్నాయి. గత మూడేళ్లలో 344 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 15 మంది ఇలా అసువులు బాశారు. పనిచేసే పరిస్థితులు దుర్భరంగా ఉండటం, తీవ్రమవుతున్న ఒత్తిళ్లు, ఉన్నతాధికారుల వేధింపులు.. ఇలా రకరకాల కారణాలతో వీళ్లు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు.