ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడి

CISF Jawan Among Five Killed As Maoists Blow Up Bus In Chhattisgarh - Sakshi

మందుపాతర పేలి ఒక జవాను, నలుగురు పౌరుల మృతి

చింతూరు (రంపచోడవరం)/చర్ల: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) జవాన్లు ప్రయాణిస్తున్న మినీ బస్సే లక్ష్యంగా మావోలు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మందు పాతరను పేల్చడంతో ఒక జవాను, నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గత 15 రోజుల్లో ఇది మావోయిస్టుల మూడో దాడి కావడం గమనార్హం. ఎన్నికల విధుల కోసం కోల్‌కతా నుంచి వచ్చిన 502వ బెటాలియన్‌ జవాన్లు ఆకాశ్‌ నగర్‌లో క్యాంప్‌ వేశారు. వీరంతా ఆ సమీపంలో ఎన్‌ఎండీసీ ఆధ్వర్యంలో పనిచేసే బైలడిల్లా ఇనుప గనుల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు.

గురువారం ఉదయం కొందరు జవాన్లు కూరగాయలు కొనుగోలు చేసేందుకు పక్కనే ఉన్న బచేలీకి వెళ్లారు. అనంతరం తిరిగి మినీ బస్సులో వస్తుండగా కొండ ప్రాంతంలోని ఆరో మలుపు వద్ద మావోయిస్టులు ముందుగా అమర్చిన మందుపాతరతో పేల్చేశారు. దీంతో బస్సు సుమారు 20 అడుగుల ఎత్తు ఎగిరిపడింది. ఈ ఘటనలో సీఐఎస్‌ఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్, బస్‌ డ్రైవర్, ఇద్దరు క్లీనర్లు, ట్రక్కు డ్రైవర్‌ చనిపోయారు. మందుపాతర పేల్చిన తర్వాత మావోయిస్టులు సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లకు చెందిన ఆయుధాలను తీసుకెళ్లారు. ఈ ఘటనతో అప్రమత్తమైన దంతెవాడ పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేశారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top