ఏళ్లుగా భరించాం.. ఇక ఊరుకోం

PM Modi attends 50th CISF's Raising Day ceremony - Sakshi

ఉగ్ర కుట్రలకు తగిన గుణపాఠం చెబుతాం

ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి

ఘజియాబాద్‌: ‘అయిందేదో అయింది. ఏళ్లుగా భరించాం. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు’అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రకుట్రలకు తగిన గుణపాఠం చెప్పి తీరతామని స్ప ష్టం చేశారు. పుల్వామా, ఉడి ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆదివారం ఇక్కడ జరిగిన కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సీఐఎస్‌ఎఫ్‌) 50వ వ్యవస్థాపక దినోత్సవంలో  ప్రధాని ప్రసంగించారు.

దేశ భద్రతను కాపాడుతున్న సీఐఎస్‌ఎఫ్‌ జవాన్ల కృషి అభినందనీయమని కొనియాడారు. స్వాతంత్య్రం అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించిన 35 వేల మంది పోలీసుల్లో పాలమిలటరీ దళాలకు చెందిన వారు 4 వేల మంది ఉన్నారని పేర్కొ న్నారు. వీరి శౌర్యం, అంకితభావం ప్రజలందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు.

దేశప్రజల మద్దతుతోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. ఉగ్రదాడు లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధునాతన గాడ్జెట్లను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇక వీఐపీ సంస్కృతిపై మోదీ విమర్శల వర్షం కురిపించారు. వీఐపీలకు భద్రతను అందించే సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో వారు వ్యవహరించే తీరు దారుణంగా ఉంటోం దన్నారు.  సీఐఎస్‌ఎఫ్‌ జవాన్ల గురించి ప్రజలకు తెలిసేలా వారి చరిత్ర, విధివిధానాలతో డిజిటల్‌ మ్యూజియాలను ఏర్పాటు చేయాలని సూచించారు.  

ప్రజల ఆశీర్వాదం కోరుతున్నా: మోదీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను మరోసారి ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను తాను కోరుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘అందరితోపాటుగా, అందరి అభివృద్ధి అనే మా మార్గంలో వెళ్తూ మరోసారి మీ ఆశీర్వాదం కోరుతున్నా. గత 70 ఏళ్లలో నాటి ప్రభుత్వాలు తీర్చలేకపోయిన కనీస అవసరాలను మా ప్రభుత్వం తీర్చింది. ఇప్పుడు మనం మరింత బలమైన, వృద్ధి దాయకమైన, భద్రమైన ఇండియాను నిర్మించాలి’అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను మోదీ ప్రస్తావించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top