
చోసితీలో కొనసాగుతున్న సహాయక చర్యలు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ వల్ల విధ్వంసానికి గురైన చోసితీ గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం సంభవించిన ఆకస్మిక వర్షాలు, వరదల ధాటికి ముగ్గురు సీఐఎస్‌ఎఫ్ జవాన్లు, ఒక స్పెషల్ పోలీసు ఆఫీసర్ సహా 60 మంది దుర్మరణం పాలయ్యారు. 167 మందిని అధికారులు రక్షించారు. మరో 82 మంది జాడ గల్లంతయ్యింది. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.
సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన భారీ బండరాళ్లను పేలుడు పదార్థాలతో పేల్చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ఉదయం చిసోతీని సందర్శించారు. బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి పరిహారం అందజేస్తామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున ఇస్తామన్నారు.
ధ్వంసమైన ఇళ్లకు సైతం పరిహారం ప్రకటించారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన గ్రామస్థులను ఒమర్ అబ్దుల్లా ఓదార్చారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ శుక్రవారం అర్ధరాత్రి చోసితీ గ్రామానికి చేరుకున్నారు. సహాయక చర్యలను సమీక్షించారు. శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జితేంద్ర సింగ్ పరామర్శించారు. సహాయ పునరావాస చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. అధికారులు ఇప్పటిదాకా 50 మృతదేహాలను గుర్తించి, సంబంధిత కుటుంబాలకు అప్పగించారు. క్లౌడ్ బరస్ట్‌లో కనీసం 16 నివాస గృహాలతోపాటు పలు ప్రభుత్వ భవనాలు, మూడు ఆలయాలు, 30 మీటర్ల వంతెన ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో వాహనాలో వరదలో కొట్టుకుపోయాయి. మరోవైపు మచైల్ మాత యాత్రను వరుసగా మూడోరోజు శనివారం సైతం రద్దు చేశారు.