బాబుకు చెంపపెట్టు! | AP Local Elections: YSRCP Candidates Win Despite Alleged Threats from TDP and Police | Sakshi
Sakshi News home page

బాబుకు చెంపపెట్టు!

Nov 10 2026 5:28 AM | Updated on Nov 10 2026 5:28 AM

AP Local Elections: YSRCP Candidates Win Despite Alleged Threats from TDP and Police

అన్నమయ్య జిల్లా రాజంపేట నామినేషన్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సంబందీకులను కట్టెలతో చితకబాదుతున్న టీడీపీ గూండాలు (ఫైల్‌)

నిర్బంధంలోనూ ఎదురొడ్డి నిలిచి గెలిచిన వైఎస్సార్‌సీపీ

టీడీపీ గూండాలు, పోలీసుల అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొన్న పార్టీ శ్రేణులు  

లాఠీచార్జిలు, దాడులు, కిడ్నాప్‌లు చేసినా వెన్నుచూపని పార్టీ నేతలు, కార్యకర్తలు 

చంద్రబాబు, ఎస్‌ఈసీ, పోలీసుల కుట్రలు, కుతంత్రాలు ఛేదింపు 

రాజానగరంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే సతీమణిని ఓడించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 

అనంతపురం నగర పాలక సంస్థపై వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలు 

నాయుడుపేట, నందికొట్కూరు, బేతంచర్ల మున్సిపాలిటీలలో విజయ ఢంకా 

రాష్ట్ర వ్యాప్తంగా 76 జెడ్పీటీసీలు, 1,741 ఎంపీటీసీల్లో ఘన విజయం.. 

అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌ కైవశం.. డజన్‌ కుట్రలను ఎదుర్కొని విజయం సాధించడంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలదే కీలక పాత్ర 

ఇన్ని కుట్రల మధ్య ఈ విజయం ఆషామాషీ కాదంటున్న విశ్లేషకులు 

2021లో అప్పటి ప్రతిపక్ష టీడీపీ కంటే భారీ స్థాయిలో విజయమని వెల్లడి 

ఇది ముమ్మాటికీ  ‘నారా’సుర పాలనపై ప్రజా తిరుగుబాటేనని స్పష్టీకరణ 

2029లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఘన విజయానికి విస్పష్ట సంకేతం

నామినేషన్ల సమయంలో నియోజకవర్గ స్థాయి వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసుల సాయంతో గృహ నిర్బంధం చేశారు.. ఆపై ఎక్కడికక్కడ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పచ్చ గూండాలు అడ్డుకున్నారు.. ఏకంగా చేతుల్లోంచి నామినేషన్‌ పత్రాలు లాక్కొని చింపేశారు.. ఆర్వో చేతుల్లో ఉన్న పత్రాలు సైతం లాగేసుకున్నారు.. ఈ గండాలను దాటుకుని పోటీలో నిలిచిన అభ్యర్థులను బెదిరించారు.. పోలింగ్‌ రోజున ఏజెంట్లనూ బయటకు తోసేశారు.. ఇష్టానుసారం రిగ్గింగ్‌ చేసుకున్నారు.. ఆపై కౌంటింగ్‌ రోజున చెల్లని ఓట్లనూ కలుపుకున్నారు.. అదీ సరిపోని చోట్ల ఎంచిన ఓట్లలోంచి మళ్లీ కొన్ని ఓట్లను పక్కకుతీసి కలిపేసుకున్నారు.. 

ఆపై విజయం సాధించామంటూ చంకలు గుద్దుకుంటున్నారు.. ఇదీ ఓ విజయమా! అని ప్రజలు వెన్నుపోటు పార్టీ కూటమిని చీదరించుకుంటుంటే తుడిచేసుకుని వెళ్తున్నారు.. ఇన్ని అక్రమాలు, దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు, హత్యాయత్నాల మధ్య.. ప్రజాస్వామ్యం మనుగడకే ముప్పు తెచ్చిన వేళ సైతం పలుచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ధైర్యంగా ఎదురు నిలిచి పోరాడారు.. ఫలితంగా 76 జెడ్పీటీసీ, 1,741 ఎంపీటీసీ, ఒక మేయర్, రెండు మున్సిపాలిటీలను కైవశం చేసుకోవడం పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.

సాక్షి, అమరావతి :  ‘నారా’సుర రాక్షస రాజ్యంలోని దుర్మార్గాలు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా వెల్లడి కాకుండా వెన్నుపోటు పార్టీ కూటమి నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా వ్యతిరేకతను మాత్రం దాచలేకపోయారు. మున్సిపాలిటీ, పరిషత్‌ ఎన్నికల నామినేషన్లు మొదలు.. ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ టీడీపీ మూకలు ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డాయి. ప్రజా వ్యతిరేకతను ముందే గుర్తించి బెంబేలెత్తిన చంద్రబాబు.. బరితెగించి ఎన్నికల అక్రమాలకు తెగబడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం, అధికార వ్యవస్థలను యథేచ్చగా దుర్వీనియోగం చేస్తూ తమ అధికారిక ‘రిగ్గింగ్‌’కు బరితెగించారు.

కూటమి డజన్‌ కుట్రలను ఎదురొడ్డీ మరీ వైఎస్సార్‌సీపీ మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో గణనీయంగా సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. 2021లో నిర్వహించిన మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీగా టీడీపీ గెలిచిన స్థానాల కంటే.. ప్రస్తుతం 2026లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ రెట్టింపు స్థానాల్లో విజయం సాధించడం రాజకీయంగా ప్రాధా­­న్యం సంతరించుకుంది. ఈ ఫలితాలు రాష్ట్రంలో రానున్న రోజుల్లో విప్లవాత్మకంగా మారనున్న రాజ­కీయ పరిణామాలను సూచిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న వైఎస్సార్‌సీపీ 2029 సాధారణ ఎన్నికల్లో సాధించబోయే ఘన విజయా­నికి ఈ ఎన్నికలు సంకేతంగా నిలుస్తున్నాయి.  

ఓటమి భయంతో చంద్రబాబు అధికారిక రిగ్గింగ్‌ 
టీడీపీ కూటమి రెండున్నరేళ్ల పాలనపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతతో బెంబేలెత్తిన చంద్రబాబు స్థానిక ఎన్నికల్లో అధికారిక రిగ్గింగ్‌కు పన్నాగం పన్నారు. టీడీపీ వీర విధేయ అనిల్‌ చంద్ర పునేఠా నేతృత్వంలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌.. డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా నేతృత్వంలోని పచ్చ ఖాకీలతో కూడిన పోలీసు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్నికల అక్రమాలకు బరితెగించారు. నామినేషన్లు, స్రూ్కటినీ, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్, ఫలితాల ప్రకటన.. ఇలా ప్రతి దశలోనూ అక్రమాలకు పాల్పడ్డారు.

ఆ రాక్షస తంత్రాన్ని బరితెగించి అమలు చేసేందుకు టీడీపీ కూటమి గూండాలు, గంజాయి బ్యాచ్‌లు, ఇతర రాష్ట్రాల నుంచి రప్పించిన అసాంఘిక శక్తులను రంగంలో దించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ రాష్ట్రమంతటా విధ్వంసం సృష్టించారు. పలుచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను అపహరించారు. వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతో సహా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్న ప్రాంతాల్లో అడ్డుకునేందుకు విధ్వంసం సృష్టించారు.

బెదిరింపులు, దాడులను ఎదురొడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో రెండో దశలో అక్రమాలకు తెరతీశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు స్థానాల్లో రిటరి్నంగ్‌ అధికారులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను ఏకపక్షంగా తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలోనూ అదే అక్రమాలను కొనసాగించారు. అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి, వారే స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పోలింగ్‌ ప్రక్రియపై టీడీపీ కూటమి కాలకేయ ముష్కర మూకలు దండెత్తి బీభత్సం సృష్టించాయి.

పోలింగ్‌ కేంద్రాలపై టీడీపీ రౌడీ మూకలు దండయాత్రకు తెగబడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తూ పోలీసులు కూటమి కుట్రలకు కొమ్ముకాశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లకు రక్షణ కల్పించలేదు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. బూత్‌లలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపి, టీడీపీ వర్గీయులు పోలింగ్‌ కేంద్రాలను తమ ఆ«దీనంలోకి తీసుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. సామాన్యులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. మరో వైపు టీడీపీ గూండాలు పోలింగ్‌ కేంద్రాలను ఆ«దీనంలోకి తీసుకుని భారీగా రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి.  

ఓట్ల లెక్కింపులోనూ రిగ్గింగే 
చంద్రబాబు ముఠా ఓట్ల లెక్కింపు ప్రక్రియలోనూ మరింతగా అరాచకాలకు తెగించింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో కుట్రపూరితంగా ఆటంకాలు సృష్టించారు. రీ కౌంటింగ్‌ పేరుతో పదేపదే లెక్కింపులు జరిపించి, తొలుత ఆధిక్యంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బదులుగా కూటమి అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించే వరకు ఒత్తిడి తెచ్చారు.

అందుకోసం అవసరం లేకపోయినా రీ కౌంటింగ్‌ పేరుతో కుతంత్రం చేశారు. చెల్లని ఓట్లుగా పక్కన పెట్టేసిన ఓట్లను తెచ్చి మరీ టీడీపీకి వేసిన ఓట్లుగా లెక్క చూపారు. దీనిపై అభ్యంతరం తెలిపిన వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజంట్లను పోలీసులు బలవంతంగా బయటకు నెట్టేశారు. అనంతరం టీడీపీ కూటమి అభ్యర్థులు గెలిచినట్టు ఏకపక్షంగా ప్రకటించేశారు.  

దౌర్జన్యాలను ఎదిరించి మరీ.. 
మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అదే రీతిలో టీడీపీ కూటమి కుట్రలను ఎదురొడ్డి నిలిచింది. మొత్తం 87 మున్సిపాలిటీలలో చైర్మన్‌ పోస్టులతోపాటు వాటిలో 3,020 వార్డులు.. 13 మున్సిపల్‌ కార్పొరేషన్లలో మేయర్‌ పోస్టులతోపాటు 922 డివిజన్లలో ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. కాగా టీడీపీ కూటమి బరితెగించి అరాచకాలతో వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడింది. ఎన్నికలను హైజాక్‌ చేసేందుకు బీభత్సం సృష్టించింది. 17 మున్సిపాలిటీలలో చైర్మన్‌ పోస్టులతోపాటు రాష్ట్రం మొత్తం మీద 637 వార్డులను బలవంతంగా ఏకగ్రీవం చేసుకుంది.

అదే రీతిలో 13 మున్సిపల్‌ కార్పొరేషన్లలో 118 డివిజన్లను ఏకపక్షంగా ఏకగ్రీవంగా ప్రకటించుకుంది. ఎన్నికలు నిర్వహించిన మున్సిపాటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో పోలింగ్‌ రోజున దాడులు, దౌర్జన్యాలతో బీభత్సం సృష్టించింది. అయినా సరే వైఎస్సార్‌సీపీ నందికొట్కూరు, బేతంచర్ల, నాయుడుపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది.

అనంతపురం నగర పాలక సంస్థలో మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంది. 2021 ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే గెలిచింది. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించిన 804 మున్సిపల్‌ కార్పొరేషన్‌ డివిజన్లలో వైఎస్సార్‌సీపీ 112 డివిజన్లలో విజయం సాధించింది. 2021లో నిర్వహించిన ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్షంగా టీడీపీ 82 డివిజన్లలోనే గెలిచింది. ప్రస్తుతం వైఎస్‌స్రాŠసీపీ అంతకంటే 40 శాతం డివిజన్లలో అధికంగా విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.   

రాజకీయ విప్లవానికి సంకేతం 
రాష్ట్రంలో రానున్న రోజుల్లో రాజకీయ విప్లవానికి మున్సిపల్, పరిషత్‌ సంస్థల ఎన్నికలు నాంది పలికాయి. 2024 ఎన్నికల్లో మోస పూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై ప్రజా తిరుగుబాటు మొదలైందని స్పష్టం చేశాయి. రెండున్నరేళ్ల కూటమి పాలనపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోందని తేల్చి చెప్పాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ సాగిస్తున్న ప్రజా పోరాటాలకు మద్దతుగా నిలిచాయి. 2024 ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందకుండా వైఎస్సార్‌సీపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయకుండా చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది.

కూటమి ప్రభుత్వం బరితెగించి సాగిస్తున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతోంది. డీఎస్సీ కుంభకోణం, భూదోపిడీ,  మద్యం మాఫియా, ఇసుక దందా, గనుల లూటీ.. ఇలా కూటమి ప్రభుత్వ అవినీతిని పూర్తి ఆధారాలతో సహా నిరూపిస్తూ ప్రజా క్షేత్రంలో దూసుకుపోతోంది. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు అమానవీయ పాలనను ఎండగడుతోంది. ఈ పరిణామాలతో ప్రజా చైతన్యం వెల్లివిరుస్తోంది. చంద్రబాబు మోసాలపట్ల ఆగ్రహావేశాలతో ఉన్న ప్రజలు మార్పును కోరుకుంటున్నామని మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల ద్వారా స్పష్టమైన సంకేతం ఇచ్చారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వైఎస్సార్‌సీపీ సంస్థాగతంగా బలీయంగా ఉందని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని విశ్లేషకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో భవిష్యత్‌ రాజకీయ విప్లవానికి సంకేతమని వ్యాఖ్యానిస్తున్నారు.  

రాక్షస కుట్రలకు ఎదురొడ్డి వైఎస్సార్‌సీపీ జయకేతనం 
⇒ రాష్ట్రంలో చంద్రబాబు రాక్షస రాజకీయాన్ని ఎదురొడ్డీ మరీ మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గణనీయమైన స్థానాల్లో విజయ కేతనం ఎగుర వేసింది. 2021లో అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ గణనీయమైన స్థానాల్లో విజయ ఢంకా మోగించింది.  

⇒ రాష్ట్రంలో మొత్తం 659 జెడ్పీటీసీలకు ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అందులో టీడీపీ కూటమి గూండాగిరీ, పోలీసు రౌడీయిజంతో బరితెగించి 77 జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 582 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 76 స్థానాల్లో విజయం సాధించింది. అదే 2021లో నిర్వహించిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష పారీ్టగా ఉన్న టీడీపీ కేవలం 6 జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. అంటే అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ 12 రెట్లు అధికంగా 76 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించడం విశేషం.  

⇒ చంద్రబాబు రాక్షస రాజకీయాన్ని ఎదురొడ్డీ మరీ వైఎస్సార్‌సీపీ అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌లో విజయదుందుభి మోగించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. 2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ రాష్ట్రంలో ఒక్క జిల్లా పరిషత్‌ను కూడా గెలుచుకోలేకపోయింది.  
⇒ రాష్ట్రంలో మొత్తం 9,818 ఎంపీటీసీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులో టీడీపీ కూటమి బరితెగించి అధికార దుర్వినియోగం, గూండాగిరీతో భయోత్పాతం సృష్టించి 2,051 ఎంపీటీసీ స్థానాలను బలవంతంగా ఏకగ్రీవం చేసుకుంది. ఇక 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. వెన్నుపోటు పార్టీ కుట్రలను ఎదురించి వైఎస్సార్‌సీపీ 1,741 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. 2021లో నిర్వహించిన ఎంపీటీసీ ఎన్నికల్లో  అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ కేవలం 929 స్థానాల్లోనే గెలిచింది. రాజానగరంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే సతీమణిని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఓడించడం సంచలనం సృష్టించారు.  

గెలిచినా రెండు గంటలు డిక్లరేషన్‌ ఇవ్వలేదు 
నేను ప్రకాశం జిల్లా కొత్తపట్నం జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేశాను. నామినేషన్‌ వేసిన దగ్గర నుంచి కౌంటింగ్‌ వరకు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు నా మీద కక్షకట్టి మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టారు. ఎప్పటికప్పుడు మా పార్టీ కార్యకర్తల సాయంతో వారి కుట్రలను ధైర్యంగా ఎదుర్కొన్నా. కౌంటింగ్‌ ముగిశాక నాకు మెజార్టీ వచ్చిందని స్పష్టమైనా రెండు గంటల పాటు డిక్లరేషన్‌ ఫాం ఇవ్వలేదు. పైగా పోలీసుల చేత బలవంతంగా బయటకు పంపించారు. కరెంటు నిలిపి వేయించారు. అయినా వెనక్కు తగ్గకుండా కౌంటింగ్‌ కేంద్రం వద్ద గట్టిగా నిలదీస్తూ ఆందోళన చేపట్టాం. విషయాన్ని జేసీ కల్పనాకుమారికి స్పష్టంగా వివరించి ఫిర్యాదు చేశాం. తుదకు గత్యంతరం లేక 710 ఓట్ల మెజార్టీతో నేను గెలిచినట్లు ప్రకటించి డిక్లరేషన్‌ ఫాం ఇచ్చారు. 
    – రొండా అంజిరెడ్డి, జెడ్పీటీసీ, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా

తిరగబడటం వల్లే విజయం 
కౌంటింగ్‌ హాలులో సైతం అక్రమాలకు పాల్పడ్డారు. నేను గెలిచాక కూడా ఓడిపోయినట్లు నిరూపించేందుకు పన్నాగం పన్నారు. ఖాళీ డిక్లరేషన్‌ ఫారం ఇచ్చి సంతకం పెట్టమన్నారు. ఫారం నింపుకొని వస్తేనే సంతకం పెడతానని ఎదురు తిరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఫారం నింపుకొని వచ్చారు. ఖాళీ డిక్లరేషన్‌పై సంతకం పెట్టి ఉంటే నన్ను కూడా ఓడిపోయిన జాబితాలో చేర్చేవారు. తిరగబడటం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో గెలిచినట్లు ప్రకటించారు.  
    – పోతుల దీపిక, వైఎస్సార్‌సీపీ 44వార్డు కౌన్సిలర్,     చిలకలూరిపేట మున్సిపాలిటీ  

కౌంటింగ్‌లో నరకం చూపించారు 
ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం దాడితోట ఎంపీటీసీ స్థానానికి నేను వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేశాను. ధర్మవరంలో జరిగిన కౌంటింగ్‌కు హాజరయ్యాను. ఉదయం 11 గంటలకు అభ్యర్థినైన నన్ను లోపలకు అనుమతించలేదు. అధికారులను నిలదీస్తే చివరకు లోనికి అనుమతి ఇచ్చారు. దాడితోట పరిధిలో మూడు గ్రామాల్లో కలిపి 2,410 ఓట్లు పోలయ్యాయి.

 నాకు 648 మెజారిటీ వచ్చింది. అయితే దురుద్దేశంతో డిక్లరేషన్‌ ఫారం ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టారు. ఒక దశలో నన్ను బయటకు పంపి ఫలితాలను తారుమారు చేయాలని టీడీపీ ఏజెంట్, అధికారులు విశ్వ ప్రయత్నం చేశారు. గుండె ధైర్యంతో పోరాడాను. అక్కడి నుంచి కదిలేదిలేదని కూర్చున్నాను. చివరకు రాత్రి 7 గంటలకు నేను గెలిచినట్లు ప్రకటించారు.  
– గద్దె రాజే‹Ùరెడ్డి, దాడితోట ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, తాడిమర్రి మండలం, శ్రీసత్యసాయి జిల్లా

టీడీపీ దౌర్జన్యాలను ఎదుర్కొని కార్పొరేటర్‌గా గెలిచి 
గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ సాగించిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. గుంటూరు పశి్చమ నియోజకవర్గంలోని 38వ డివిజన్‌లో పోలింగ్‌ ముగిసేందుకు గంట వ్యవధి ఉండగా వేణుగోపాల్‌నగర్‌లోని పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించేందుకు టీడీపీ బ్యాచ్‌ చేసిన ప్రయత్నాలను స్థానికుల సహకారంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. దొంగ ఓట్లు వేసేందుకు పచ్చ మూక వేసిన పాచిక పారక పోవడంతో పోలింగ్‌ బూత్‌ ఎదుట ఉన్న స్థానికులపై దాడులకు తెగబడిన టీడీపీ ముఠా ముస్లిం మహిళలను గాయాలు తేలేలా కొట్టింది.

ఏఎన్‌యూలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో కూడా ఓటమి భయంతో బ్యాలెట్‌ పత్రాలను చించేస్తుంటే అడ్డుకున్నాం. ఎలాగైనా సరే నన్ను ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ చేసిన దౌర్జన్యాలు, హింసాకాండను తట్టుకుని గట్టిగా నిలబడ్డాం. వారు ఎన్ని చేసినా 1,283 ఓట్ల మెజారీ్టతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌గా విజయం సాధించాను.     – షేక్‌ రోషన్, 38వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్, గుంటూరు

కుట్రలను ఛేదించి గెలిచాను 
వైఎస్సార్‌సీపీ పెనుమూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడానికి చిత్తూరు జిల్లా పరిషత్‌ కార్యాలయానికి నా భర్తతో కలసి వెళ్లాను. ఎన్నో అడ్డంకులు దాటుకుని లోనికి వెళ్లగానే తెలుగుదేశం పార్టీ అల్లరి మూక అధికారుల ముందే నా నామినేషన్‌ పత్రాలను చించేసింది. వారి దౌర్జన్యాన్ని ఎదుర్కొంటూ మరో సెట్‌ తీసుకెళ్లి నామినేషన్‌ వేశాను. అప్పటి నుంచి టీడీపీ నాయకులు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. పోలింగ్‌ వరకు అదే దౌర్జన్యం కొనసాగింది.

ఓట్ల లెక్కింపు అనంతరం నాకు 222 ఓట్ల మెజారిటీ ఉందని అధికారులు ప్రకటించారు. దీంతో కుమిలిపోయిన టీడీపీ నాయకులు, వారి అభ్యర్థిని ఎలాగైనా అడ్డదారుల్లో గెలిపించాలని అప్పటికప్పుడు కుట్రలకు తెరలేపారు. రీ కౌంటింగ్‌ చేయించారు. ఎన్నో నాటకాలు ఆడారు. అయినా ప్రజా తీర్పును తలకిందులు చేయడం వారి వల్ల కాలేదు. ఎట్టకేలకు తెల్లవారుజామున 5 గంటలకు నేను 184 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు ప్రకటించారు.      – నిరీషారెడ్డి, వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు, పెనుమూరు, చిత్తూరు జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement