వైద్య కళాశాలల ప్రైవేటీకరణ కుట్రలతో విద్యార్థులకు చంద్రబాబు ద్రోహం
వైఎస్ జగన్ నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ కళాశాలలను అడ్డుకున్న చంద్రబాబు
మూడేళ్లలో 3,500 సీట్లు కోల్పోయిన ఏపీ విద్యార్థులు
ఎంబీబీఎస్ సీట్లు పెరగక అన్ని విభాగాల్లో పెరుగుతున్న కటాఫ్‌లు.. తెలంగాణతో పోలిస్తే బీసీల్లో కటాఫ్ ఏకంగా 90 మార్కులు అదనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చి, పిల్లలు, తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా 17 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టి, కొన్నింటిని ఆయన ప్రభుత్వంలోనే ప్రారంభిస్తే.. చంద్రబాబు ఆ కలలను ఛిద్రం చేసేశారు. కొత్త ప్రభుత్వ కళాశాలలను పీపీపీ పేరుతో తన అనుంగులకు కట్టబెట్టడం కోసం బాబు చేసిన కుట్రలు మన విద్యార్థులకు శాపాలుగా మారాయి.
నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలలను సైతం ప్రారంభించకుండా చంద్రబాబు ప్రభుత్వం దగాకోరు చర్యలకు పాల్పడింది. ఫలితంగా మూడేళ్లలో ఏకంగా 3,500 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు కోల్పోయారు. ఎక్కువ సీట్లు ఉండటంతో పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద అతి తక్కువ మార్కులకే వైద్య విద్య ప్రవేశాలు లభిస్తుంటే, ఏపీలో అక్కడికంటే 40 నుంచి 90 మార్కులు అదనంగా సాధించినా సీటు దక్కని దుస్థితి దాపురించింది. దేశంలో 2026–27 ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ కన్వీనర్ కోటా కటాఫ్ మార్కులు పరిశీలిస్తే చంద్రబాబు మన విద్యార్థులకు చేసిన ద్రోహం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు దగా
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మేలు చేసినట్టు పైకి డబ్బా కొట్టుకొనే చంద్రబాబు.. తెరవెనుక మాత్రం వారికి పెను ద్రోహం చేస్తుంటారు. ఎంబీబీఎస్ ప్రవేశాలే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది కౌన్సెలింగ్ ముగిసే సమయానికి తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద నీట్ యూజీలో కేవలం 370 మార్కులు వచ్చిన విద్యార్థికి కూడా ఎంబీబీఎస్ సీటు లభించింది. అదే ఏపీలో బాబు చేసిన ద్రోహం ఫలితంగా ఏకంగా 460 మార్కులు సాధించినా బీసీ విద్యార్థులకు సీటు దక్కలేదు.
బీసీ–బీ, సీ, డీ విభాగాల్లో తెలంగాణలోకంటే ఏపీలో కటాఫ్ 50 మార్కులపైనే ఉంది. తెలంగాణలో ఎస్సీ కేటగిరీ కింద 383 మార్కులకే కన్వీనర్ సీట్లు లభించాయి. కానీ ఏపీలో ఎస్సీ–3 విభాగంలో చివరి సీటు 445 మార్కుల వద్దే నిలిచిపోయింది. ఎస్సీ–2 విభాగంలోనూ 416 మార్కులు దాటితే తప్ప సీటు రాలేదు. అంటే తెలంగాణకంటే ఏపీలో ఎస్సీ విద్యార్థులు 33 నుంచి 62 మార్కులు అధికంగా సాధించినప్పటికీ కన్వీనర్ కోటా సీటు దక్కించుకోలేకపోయారు. ఓసీ విభాగంలో తెలంగాణలో 430 మార్కులకే సీటు వస్తే, ఏపీలో 485 మార్కుల వద్దే దారులు మూసుకుపోయాయి.
3,500 మంది జీవితాలు చిన్నాభిన్నం
రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వ రంగంలో వైద్య విద్యను అందించడం, ప్రతి ప్రాంతానికి 50 కిలోమీటీర్ల దూరంలో ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కల్పనే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రతి పార్లమెంట్ జిల్లాకు ఒకటి చొప్పున రూ.8,500 కోట్లతో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. వీటిలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలు 2023–24లోనే ప్రారంభించి ఒకేసారి కొత్తగా 750 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రానికి వైఎస్ జగన్ సమకూర్చారు.
రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సీట్లు సమకూరడం ఇదే మొదటిసారి. మిగిలిన వైద్య కళాశాలలనూ 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో ప్రారంభించేలా వేగంగా నిర్మాణం చేపట్టారు. అయితే 2024లో చంద్రబాబు గద్దెనెక్కాక ఈ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేసి, తన అనుంగులకు కట్టబెట్టాలని నిర్ణయించారు. నిర్మాణం పూర్తయిన కళాశాలలను ప్రారంభించకుండా కుట్రలు పన్నారు. పులివెందుల వైద్య కళాశాలకు 2024లోనే ఎన్‌ఎంసీ అనుమతులు ఇచ్చినా, బాబు సర్కారు ఆ అనుమతులు రద్దు చేయించింది. ఏ రాష్ట్రమైనా కొత్త సీట్లు కోరుతుంది కానీ, వచ్చిన సీట్లను వదులుకోదు.
కానీ, చంద్రబాబు మాత్ర తన అనుంగుల కోసం ఇంతకూ తెగించారు. ఇలా చంద్రబాబు కుట్రల ఫలితంగా 2024–25 విద్యా సంవత్సరంలో 700, 2025–26లో 1,750 చొప్పున రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు నష్టపోయారు. ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరంలోనూ కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమవకపోవడంతో మరో వెయ్యి సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు. ఇలా మూడేళ్లలో ఏకంగా 3,500 సీట్లు రాష్ట్రం నష్టపోయింది. దీంతో రేయింబవళ్లు శ్రమించి నీట్ యూజీలో ఉత్తమ మార్కులు తెచ్చుకున్నప్పటికీ మన విద్యార్థులకు కన్వీనర్ కోటా సీట్లు దక్కకుండా పోతున్నాయి. రూ. లక్షల్లో ఫీజులు చెల్లించి యాజమాన్యా కోటాల్లో చదివించే స్తోమత లేని నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల వారు తమ పిల్లలను ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేరుస్తున్నారు.
వివిధ కేటగిరీల్లో తెలంగణతో పోలిస్తే ఏపీలో కటాఫ్ మార్కులు ఇలా..
రిజర్వేషన్ విభాగం ఏపీ కటాఫ్ తెలంగాణ కటాఫ్ వ్యత్యాసం
బీసీ – ఏ 460 370 90 మార్కులు ఎక్కువ
బీసీ – బీ 457 416 41 మార్కులు ఎక్కువ
బీసీ – సీ 429 381 48 మార్కులు ఎక్కువ
బీసీ – డీ 455 424 31 మార్కులు ఎక్కువ
బీసీ – ఈ 438 421 17 మార్కులు ఎక్కువ
ఎస్టీ 413 404 9 మార్కులు ఎక్కువ
ఓసీ 485 430 55 మార్కులు ఎక్కువ
––––––––––
రెండు తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు, సీట్లు..
కాలేజీలు ఏపీ తెలంగాణ
మొత్తం మెడికల్ కాలేజీలు 40 66
ప్రభుత్వ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 3,565 4,400
ప్రైవేట్‌లో ఎంబీబీఎస్ సీట్లు 4,050 6,100


